ఎమ్మెల్యేలు, మంత్రులు, దేశ ప్రధానులు ఇలా అందరినీ కరోనా మహమ్మారి కాటేస్తోంది. కరోనా అంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ జనం అప్రమత్తంగానే ఉన్నా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తమకు కరోనా సోకదులే అన్న విధంగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత మాణిక్యాలరావుకు కరోనా సోకింది. పాజిటివ్‌గా నిర్థారించారు వైద్యులు. అయితే ఆ విషయాన్ని మాజీ మంత్రి స్వయంగా వెల్లడించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదంటూ తన ఇంటిలోకి వెళ్ళిపోయారు. హోం క్వారంటైన్లోనే ఉంటానంటూ ఆయన స్వయంగా ప్రకటించారు.
నాకు నేనుగా 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉంటాను. వేరుగా గదిలో ఉంటాను. భయపడను. ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదంటూ బిజెపి కార్యకర్తలు, తన అభిమానులను కోరారు. మళ్ళీ పూర్తి ఆరోగ్యంగా మీ ముందుకు వస్తానంటూ సందేశాలు పంపుతున్నారు మాణిక్యాలరావు.