Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా ఎఫెక్టు.. సికింద్రాబాద్‌లో మహేంద్రాహిల్స్ స్కూలుకు సెలవులు

కరోనా ఎఫెక్టు.. సికింద్రాబాద్‌లో మహేంద్రాహిల్స్ స్కూలుకు సెలవులు
, బుధవారం, 4 మార్చి 2020 (11:58 IST)
కరోనా వైరస్ ఎఫెక్టు కారణంగా సికింద్రాబాద్‌లోని మహేంద్రాహిల్స్ పాఠశాలకు సెలవులు ప్రకటించారు. దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా వైరస్ బాధితుడు ఈ ప్రాంతవాసి. దీంతో అధికారులు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుని పాఠశాలకు సెలవులు ప్రకటించారు. 
 
కాగా, గత ఫిబ్రవరి నెల 19వ తేదీన దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి... బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. ఇతను మహేంద్రాహిల్స్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. గత నెల 22వ తేదీన ఇతను సొంతింటికి చేరుకున్నాక ఐదు రోజులపాటు వివిధ ప్రాంతాల్లో తిరిగాడు. ఆ తర్వాత అతనికి కరోనా వైరస్‌ సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఇతనికి నగరంలోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు.
 
అయితే దాదాపు ఐదు రోజులపాటు ఈ యువకుడు ఈ పరిసరాల్లోని పలుప్రాంతాల్లోనే తిరిగాడు. దీంతో అతను ఎక్కడెక్కడికి వెళ్లాడు, ఎవరిని కలిశాడు? అన్నదానిపై ఆరాతీస్తున్నారు. అదేసమయంలో ఈ ప్రాంతంలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రస్తుతం బాధితుడి ఇంట్లో కూడా ఎవరూ లేరు. వారంతా వైద్య పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి వెళ్లినట్టు మీడియా సమాచారం. మరోవైపు కంటోన్మెంట్‌ పారిశుద్ధ్య సిబ్బంది ఈ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
 
పాఠశాల విద్యార్థులకు కరోనాపై అవగాహన
మరోవైపు, హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడు కరోనా వైరస్ బారినపడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అప్రమత్తమైంది. రాజధాని జిల్లా పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు ప్రార్థనా సమయంలో కరోనాపై అవగాహన కల్పించాలంటూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
 
ముఖ్యంగా బాధిత యువకుడు వుండే చుట్టుపక్కల పాఠశాలలపై మరింత దృష్టి పెట్టింది. మంగళవారం ఆ ప్రాంతంలో మూడు కిలోమీటర్ల పరిధిలో సర్వే చేసిన అధికారులు మొత్తం 61 పాఠశాలలు ఉన్నట్లు గుర్తించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు ముందస్తు వైద్య పరీక్షలు కూడా చేయాలని నిర్ణయించారు.
 
'వైరస్ సోకకుండా ఏం చేయాలి అన్నది తెలియజేయాలనుకున్నాం. ఈ రోజు ఉదయం నుంచి దీన్ని అమలు చేయాలని కోరాం. భోజనానికి ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవడం, మరుగుదొడ్లకు వెళ్లి వచ్చాక కాళ్లు చేతులు శుభ్రం చేసుకోవడం వంటి అంశాలు ప్రార్థన సమయంలో తెలియజేయాలి అని ఆదేశించాం' అని డీఈఓ బి.వెంకటనర్సమ్మ తెలిపారు.
 
విద్యార్థులను అప్రమత్తం చేయడం ద్వారా వారి తల్లిదండ్రుల్లోనూ అవగాహన పెంచినట్టవుతుందన్నారు. అలాగే కోఠి పాఠశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థులను నీలోఫర్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వీరు పాఠశాలకు గైర్హాజరవుతుండడంతో ఉపాధ్యాయులు ఆరాతీశారు. జ్వరంతో బాధపడుతున్నారని తెలిసి ఆసుపత్రికి తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తూగో జిల్లాలో కరోనా కలకలం... ఏపీలో కాల్ సెంటర్