Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయవాడలో ప్రైవేటు టీకా, ధర ఎంతో తెలుసా..?

Advertiesment
విజయవాడలో ప్రైవేటు టీకా, ధర ఎంతో తెలుసా..?
, బుధవారం, 12 మే 2021 (14:01 IST)
టీకాలు ఇవ్వలేం.. తొలిడోసు వేయలేం అంటూ ప్రభుత్వాలే చేతులెత్తేసిన వేళ, ఓ ప్రైవేటు వైద్యుడు నేను టీకా వేస్తా రండి అంటూ ప్రచారం మొదలు పెట్టాడు. ఇదెక్కడో మారుమూల ప్రాంతంలో కాదు, విజయవాడ నడిబొడ్డున. అవును.. విజయవాడలో ప్రైవేటుగా ఓ వైద్యుడు కరోనా టీకాలు వేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వ్యవహారంపై ఎవరూ ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా వదిలిపెట్టారు.
 
విజయవాడలోని సత్యనారాయణపురం గిరి వీధిలో ఓ వైద్యుడు కరోనా టీకాల పేరుతో ఒక్కో డోసుకు రూ.600 వసూలు చేసి కొంతమందికి తన కారులోనే కొవిడ్‌ టీకా వేశారని తెలుస్తోంది. స్థానిక కార్పొరేటర్‌ ఒకరు దీన్ని గమనించి డాక్టర్‌ని నిలదీశారట. అయితే అప్పటికే అప్రమత్తమైన సదరు డాక్టర్ కారుతో సహా అక్కడినుంచి పారిపోయాడు. సినీ ఫక్కీలో కార్పొరేటర్ ఆ కారుని వెంబడించగా.. రామవరప్పాడు రింగ్ సెంటర్లో ఆ కారుని చెక్ పోస్ట్ విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ఆ కారులో రకరకాల ఇంజెక్షన్లు, నీడిల్స్ బయటపడ్డాయి. తనిఖీల్లో ఎలాంటి వ్యాక్సిన్ పోలీసులకు దొరకలేదు. దీంతో ఆ కారుని, అందులో ఉన్నవారిని వదిలిపెట్టారు.
 
కరోనా అత్యవసర చికిత్సలో వాడే రెమెడిసివిర్ ఇంజక్షన్‌నే కల్తీ చేసి అమ్ముతున్న రోజులివి. వ్యాక్సిన్‌కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో దాన్ని కూడా కల్తీ చేసి అమ్మే ప్రబుద్ధులు ఉంటారు. అందుకే ప్రభుత్వం ఇచ్చే వ్యాక్సిన్‌ని మాత్రమే వేసుకోవాలని, లేదా ఆంక్షల తర్వాత ప్రైవేటు ఆస్పత్రుల్లో సైతం వ్యాక్సిన్ వేయించుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. ఎవరు పడితే వారు, ఏది పడితే అది తీసుకొచ్చి కరోనా వ్యాక్సిన్, ధర తక్కువేనంటూ ప్రచారం చేస్తే నమ్మేయొద్దని చెబుతున్నారు.
 
విజయవాడలో జరిగిన ఘటనలో వ్యాక్సిన్ సీసాలను, లేదా వ్యాక్సిన్ పేరుతో ఉన్న ఇంజక్షన్లను కారులో ఉన్న వైద్యులు వెంటనే పారేసి ఉంటారని, అందుకే వారి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. మొత్తమ్మీద వ్యాక్సిన్ కి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో వ్యాక్సిన్ పేరుతో వ్యాపారాలు కూడా జోరందుకుంటున్నాయి. ప్రజలు అప్రమత్తతతో ఉండటం ఒక్కటే దీనికి ఏకైక పరిష్కారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓ కుమారుడుకి చితి వెలిగించగానే.. మరో కుమారుడు మృతి... ఎక్కడ?