దేశంలో కరోనా వైరస్ కలిగిస్తున్న ప్రాణనష్టం అంతాఇంతాకాదు. ఏకంగా కుటుంబాలకు కుటుంబాలనే కబళిస్తోంది. తాజాగా ఓ తండ్రి.. చనిపోయిన ఒక కుమారుడికి చితి వెలిగిస్తుంటే.. మరో కుమారుడు చనిపోయాడు. ఈ హృదయ విదారక ఘటన యూపీలోని గ్రేటర్ నోయిడాలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రేటర్ నోయిడాకు సమీపంలోని జలాల్‌పూర్ గ్రామానికి చెందిన అత్తర్ సింగ్ అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఆ ఇద్దరికి ఇటీవలే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
వీరిద్దరి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తూ వచ్చారు. వారిలో పంకజ్ అనే కుమారుడు మంగళవారం మృతి చెందగా, అతనికి అంత్యక్రియలు నిర్వహించారు. రెండో కుమారుడు కూడా కరోనాతో బాధపడుతున్నాడు.
మొదటి కుమారుడు అంత్యక్రియలు చేస్తున్న సమయంలోనే రెండో కుమారుడు దీపక్ ఇంట్లో కుప్పకూలిపోయాడు. గంటల వ్యవధిలోనే ఇద్దరు కుమారుడు చనిపోవడం అత్తర్ కుటుంబాన్ని తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. మరోవైపు, ఈ గ్రామంలో 14 రోజుల వ్యవధిలో 18 మంది మృత్యువాతపడ్డారు.