కేరళను ఓ వైపు కరోనా వైరస్, మరోవైపు షిగెల్లా బ్యాక్టీరియా వణికిస్తున్నాయి. తాజాగా గురువారం ఏడాదిన్నర ఏళ్ల బాలుడికి షిగెల్లా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కోజికోడ్ నగర పరిధిలోని ఫిరోక్ ప్రాంతానికి చెందిన బాలుడికి చాలా రోజులుగా విరేచనాలు అవుతున్నాయి. దీంతో పరీక్షలు నిర్వహించగా షిగెల్లా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం బాబు పరిస్థితి బాగానే ఉన్నదని వైద్యులు తెలిపారు.
బాలుడి తల్లిదండ్రుల నుంచి కూడా నమూనాలు సేకరించి పరీక్షకు పంపినట్లు చెప్పారు. గత వారం కోజికోడ్ జిల్లాలో ఈ వ్యాధి బారిన పడి 11 ఏళ్ల బాలుడు మరణించడంతో పాటు మరో 30మందికి సోకడంతో కేరళలో కలకలం రేగింది.
అయితే షిగెల్లా బ్యాక్టీరియా వల్ల కలిగే ఈ వ్యాధి గురించి భయాందోళన అవసరం లేదని, ఈ వ్యాధి వ్యాప్తి మూలాలను గుర్తించేందుకు వైద్య నిఫుణులు ప్రయత్నిస్తున్నారని కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ చెప్పారు.
కలుషిత నీటి వల్ల షిగెల్లా బ్యాక్టీరియా సోకినట్లుగా ప్రాథమిక నివేదికల ద్వారా తెలుస్తుందని వెల్లడించారు. వ్యాధి సోకిన వారి ఇండ్ల నుంచి సేకరించిన నీటి, ఆహార నమూనాలను ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. కాచి వడకట్టిన నీటిని తాగాలని ప్రజలకు ఆమె సూచించారు.