దేశంలో కరోనా వైరస్ మరో 3 వేల మందిని మింగేసింది. అలాగే, కొత్తగా మరో 1.30 లక్షల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో నమోదైన కేసుల వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ఆ ప్రకారంగా మొన్నటితో పోల్చితే నిన్న కాస్త పెరిగింది. మొన్న దేశంలో 1,27,510 కరోనా కేసులు నమోదుకాగా, నిన్న 1,32,788 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, నిన్న 2,31,456 మంది కోలుకున్నారు.
ఇకపోతే, దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,83,07,832కు చేరింది. మరో 3,207 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,35,102కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,61,79,085 మంది కోలుకున్నారు. 17,93,645 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
దేశవ్యాప్తంగా 21,85,46,667 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 35,00,57,330 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. మంగళవారం 20,19,773 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.