తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన మాజీ మంత్రి, తెరాస ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మెడపై అనర్హత కత్తి వేలాడుతుంది. ఆయన బీజీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైంతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా బీజేపీలో చేరితే, ఆయనపై అనర్హత వేటు వేయాలని అధికార టీఆర్‌ఎస్ అధిష్టానం అసెంబ్లీ స్పీకర్‌ను కోరనుంది.
భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తర్‌ఫకు గురైన టీఆర్‌ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సోమవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. దీంతో ఆయన బీజేపీలో చేరటం ఖాయమైందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఒకవేళ ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే, బీజేపీ చేరితే మాత్రం చూస్తూ ఊరుకోవద్దని వారు భావిస్తున్నారు. ఈటల బీజేపీలో చేరిన వెంటనే, ఆయనపై అనర్హత వేటు వేయాలని తమ పార్టీ నాయకత్వం అసెంబ్లీ స్పీకర్‌ను కలిసి లిఖితపూర్వకంగా కోరుతుందని చెబుతున్నారు.