ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు విరుగుడుగా కొన్ని టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ టీకాల వినియోగం త్వరలోనే ప్రారంభంకానుంది. అయితే, భారత్ బయోటెక్ కొవాగ్జిన్‌తో పాటు ముక్కుద్వారా వేసే టీకా అభివృద్ధి చేస్తోంది. ఇది ఫిబ్రవరి - మార్చిలో అందుబాటులోకిరానుంది.
తొలిదశ క్లినికల్ ట్రయల్ ఫిబ్రవరి - మార్చి నెలల్లో పూర్తి చేయనుంది. వాషింగ్టన్ వర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి ఈ టీకాను అభివృద్ధి చేసినట్టు సమాచారం. పైగా, ఇప్పటికే దేశంలో అత్యవసర వినియోగానికి కొవాగ్జిన్‌కు డీసీజీఐ అనుమతి ఇచ్చింది కూడా.
అయితే, ఫిబ్రవరిలో అందుబాటులోకి రానున్న నాజల్ టీకా ఒక్క డోసు మాత్రమే వేసుకుంటే సరిపోతుందని వైద్యులు అంటున్నారు. ఇప్పటికే ముక్కుద్వారా ఇచ్చే టీకా ప్రీక్లినికల్ పరీక్షలు విజయవంతమయ్యాయి. ఈ నాజల్ టీకా అందుబాటులోకి వస్తే మెడికల్ వ్యర్థాలు గణనీయంగా తగ్గుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలావుంటే, ఏపీలో మరోసారి కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైరన్ నిర్వహించారు. ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి 12 వరకూ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగింది. రాష్ట్రంలో శుక్రవారం మరోసారి కరోనా వ్యాక్సినేషన్ డ్రైరన్ ప్రక్రియ నిర్వహించారు.
ప్రభుత్వం ఎంపిక చేసిన కేంద్రాల్లో డ్రై రన్ ఏర్పాటు చేశారు. కడప జిల్లాలోని 108 వైద్య కేంద్రాలు, గుంటూరులోని నరసరావుపేట, కృష్ణా జిల్లా నందిగామలోని ప్రభుత్వాస్పత్రిలో డ్రైరన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.
తొలుత టీకా వేయించుకునే వారికి వైద్యులు వ్యాక్సినేషన్ తీరుపై సూచనలు, సలహాలు ఇచ్చారు. టీకా వేసిన అరగంటసేపు పరిశీలన గదిలో ఉంచి.. ఎలాంటి ఇబ్బంది లేదని తెలిసాకే ఇంటికి పంపించినట్లు వైద్యులు తెలిపారు.