హెచ్ 1బి వీసాల జారీకి అవలభించే లాటరీ విధానానికి అమెరికా స్వస్తి పలికింది. జీతం, నైపుణ్యాలకు ప్రాధాన్యతనిస్తూ వీసా ఎంపిక ప్రక్రియను సవరించనున్నట్లు ప్రకటించింది.
కొత్త సవరణలను శుక్రవారం ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించనున్నట్లు తెలిపింది.తద్వారా అమెరికా కార్మికుల ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడం, అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణలు ప్రయోజనం పొందేలా ఈ సవరణలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
నాన్ ఇమిగ్రెంట్ వీసాలైన హెచ్-1బీ అమెరికాలోని పలు కంపెనీలు..విదేశీ ఉద్యోగుల నియమానికి వినియోగిస్తూ ఉంటాయి. భారత్, చైనా వంటి దేశాల నుండి ప్రతి సంవత్సరం వేలాది మంది ఉద్యోగులను నియమించుకునేందుకు పలు సంస్థలు హెచ్-1బీ వీసాల ద్వారా దేశంలోకి ప్రవేశాన్ని కల్పిస్తాయి.
ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించిన 60 రోజుల తర్వాత తుది నియమం అమల్లోకి వస్తుంది. తదుపరి హెచ్-1బి వీసా ప్రక్రియ ఏప్రిల్ నుండి మొదలు కానుంది. నిబంధనల ప్రకారం అమెరికా ప్రభుత్వం ఏడాదికి గరిష్టంగా 60 వేల హెచ్-బి వీసాలు జారీ చేస్తుంది.