ఢిల్లీకి చెందిన ఐఐటీ కరోనా టెస్ట్ కిట్ కరోష్యూర్‌ను తీసుకొచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యంత చౌకైన కోవిడ్19 టెస్ట్ కిట్ అని తెలిపింది. కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ కరోష్యూర్ కిట్‌ను ఆవిష్కరించారు. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో చౌక ధరలో కరోనా టెస్ట్ కిట్ ఆవిష్కరించడంపై ఢిల్లీ ఐఐటీ హర్షం వ్యక్త చేసింది.
ఈ కరోనా కిట్ ధర కేవలం రూ.399 అని, ఆపై ఆర్‌ఎన్‌ఏ ఐసోలేషన్, ల్యాబ్ చార్జీలు కలిపినా మొత్తం ధర రూ.650 అవుతుందని ఐఐటీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కిట్లతో అతి తక్కువ ధర కిట్ ఇదేనన్నారు.
ఈ కరోష్యూర్ కేవలం 3 గంటల్లోనే కోవిడ్19 టెస్టు ఫలితాలు అందించనుంది. కరోష్యూర్ కిట్ ఆవిష్కరించిన అనంతరం మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ మాట్లాడుతూ.. మేక్ ఇన్ ఇండియాలో ఇది ఒక గొప్ప ముందడుగు అని ప్రశంసించారు. ఈ కరోనా కిట్ అత్యధిక స్కోరుతో ఐసీఎంఆర్ అనుమతి పొందిందని, కచ్చితత్వంగా కూడిన ఫలితాలు వస్తాయంటూ డీసీజీఐకు ఆమోదం తెలిపిందని వెల్లడించారు.