ప్రపంచాన్ని ఒమిక్రాన్ వైరస్ భయపెడుతోంది. ఈ వైరస్ ధాటికి అన్ని ప్రపంచ దేశాలు భయంతో వణికిపోతున్నాయి. ముఖ్యంగా, అమెరికా, యూరప్ వంటి దేశాల్లో ఈ వైరస్ శరవేగంగా వ్యాప్తిస్తుంది. పాజిటివ్ కేసులు అమాంతం రెట్టింపు అవుతున్నాయి. దీంతో అమెరికాకు చెందిన అంటు వ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ తమ దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు. అనవసరంగా ప్రయాణాలు చేయొద్దని కోరారు. అలాగే, ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని బూస్టర్ డోస్ టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
చాపకిందనీరులా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వైరస్ ఇప్పటికే 90 దేశాలకు చుట్టేసిందని గుర్తుచేశారు. అమెరికాలో సగానికి పైగా ఈ వేరియంట్ కేసులు బయటపడ్డాయని పేర్కొన్నారు. ఒమిక్రాన్ కారణంగా న్యూయార్క్‌లోని పాజిటివిటీ రేటు 8 శాతం దాటింది. అయితే, ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్నప్పటికీ వ్యాధి తీవ్రత మాత్రం తక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.