Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో కరోనా సెంకడ్ వేవ్? అత్యవసరమైతేనే బయటకు రండి.. సర్కారు ఆర్డర్

తెలంగాణాలో కరోనా సెంకడ్ వేవ్? అత్యవసరమైతేనే బయటకు రండి.. సర్కారు ఆర్డర్
, మంగళవారం, 23 మార్చి 2021 (07:20 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. అత్యవసరమైతేనే ప్రజలకు బయటకు రావాలని పిలుపునిచ్చారు. 
 
అలాగే, రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని, ఆర్టీపీసీఆర్‌ టెస్టుల సంఖ్యను పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కేసులు పెరిగితే రోగులకు సరిపడా ఆస్పత్రులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. గాంధీ ఆస్పత్రి కొవిడ్‌ వార్డుల్లో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
 
‘పీపీఈ కిట్లు, మాస్క్‌లు, ఔషధాలు అందుబాటులో ఉంచాలి. ఇప్పటికే రోజుకు 50వేల కరోనా పరీక్షలు చేస్తున్నాం. కొవిడ్‌ పరీక్షల సంఖ్యను మరింత పెంచాలి. టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌ పకడ్బందీగా జరగాలి. కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దు.’ అని మంత్రి పేర్కొన్నారు.
 
మరోవైపు, తెలంగాణలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న తీరును చూస్తుంటే రాష్ట్రంలో సెకండ్ వేవ్ ప్రారంభమైందని చెప్పవచ్చని అన్నారు.
 
కరోనా కట్టడికి గత ఏడాది ఎలాంటి చర్యలను చేపట్టామో... మళ్లీ అలాంటి చర్యలనే ప్రారంభించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రజల మద్దతు కావాలని అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులను ధరించాలని సూచించారు. వ్యాక్సిన్ కు అర్హులైన ప్రతి ఒక్కరూ దాన్ని తీసుకోవాలని చెప్పారు. టీకా వల్ల కరోనా తీవ్రత ఎక్కువ కాకుండా చూడొచ్చని అన్నారు.
 
మరోవైపు తెలంగాణలోని గురుకులాలు, స్కూళ్లు, హాస్టళ్లలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై శ్రీనివాసరావు స్పందిస్తూ, స్కూళ్లలో కరోనా కేసులు వస్తుండటంతో... మళ్లీ లాక్ డౌన్, రాత్రి కర్ఫ్యూ పెడతారనే ప్రచారం జరుగుతోందని.. అయితే, అలాంటి ప్రపోజల్ ఇంత వరకు పెట్టలేదని చెప్పారు. విద్యా సంస్థల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని... విద్యార్థుల వల్ల ఇంట్లో ఉన్న వృద్ధులకు, దీర్థకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రమాదం పొంచి ఉందని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో కరోనా వైరస్ గట్టు తెంచుకుందా? ఒకే కాలేజీలో 163 మందికి కరోనా?