ఊళ్లో ఉన్నది వెయ్యిమందే. మనిషికి మనిషికి మధ్య.. ఊరికీ ఊరికీ ఉండేంత దూరం. అయినా సోషల్ డిస్టెన్సింగ్‌ను పాటిస్తున్నారు. మాస్కులు వేసుకుంటున్నారు. శానిటైజర్లు వాడుతున్నారు. స్థానిక గిరిజనులు, శ్రీలంక నుంచి వచ్చి స్థిరపడిన తమిళ కుటుంబాలు ఉండే గవి గ్రామం అది. కేరళలోని పట్టణంతిట్ట జిల్లాలో ఉంది.
ఆ గ్రామంలో ఇప్పుడు లేనిది ఒక్కటే. వైరస్! అవును. ఇంతవరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదవలేదు. అక్కడ ఇంకా లేనివి చాలా ఉన్నాయి. టీవీలు, పేపర్లు, సెల్ ఫోన్ లు, ఇంటర్నెట్ లేవు! అభివృద్ధికి దూరంగా ఉన్నా, ఆరోగ్యానికి దరిలో ఉన్న గవి అనే ఆ ఆటవీ గ్రామం గురించి తెలుసుకోవలసిందే.
క్రమశిక్షణ వల్లే...
స్వల్ప విరామంతో గత ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి కేరళలోని ప్రకృతి పర్యాటక గ్రామం గవి తిరిగి స్వాగత తోరణాలు కట్టుకున్నప్పుడు నిరంతరం పచ్చదనాన్ని వెతుక్కుంటూ వెళ్లేవారికి గుండె నిండా ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఆ ముందు వరకు గవి గ్రామం కట్టడిలో ఉంది. ఇప్పుడు మళ్లీ సందర్శకుల రద్దీ తగ్గింది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు మాత్రమే గ్రామంలోనికి వెళ్లి వస్తున్నారు. గవిలో ఇప్పటివరకు ఈ రెండో వేవ్‌లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు అవలేదు! అందుకు వైద్యాధికారులు చెబుతున్న కారణం.. గవి పాటిస్తున్న క్రమశిక్షణ!! గవి అటవీ గ్రామం. పఠానంతిట్ట జిల్లాలోని సీతతోడు పంచాయితీ పరిధిలో ఉంది. గ్రామ జనాభా వెయ్యి. ఇది పాత లెక్క కావచ్చు. అందులో 163 మంది మాత్రమే స్థానిక గిరిజనులు.
మిగిలిన వారంతా శ్రీలంక నుంచి వలస వచ్చి అక్కడ స్థిరపడిన తమిళ కుటుంబాల వాళ్లు. సీతతోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్ విన్సెంట్ జేవియర్ ఒక కిట్టుతో రోజూ గవికి వెళ్లొస్తుంటారు. గ్రామంలో ఎవరైనా జ్వరాలు, ఇతర అనారోగ్యాలతో ఉన్నారేమో ఆరా తియ్యడం, అవసరం అయితే మందులు మింగించడం, ఇంజక్షన్ వేయడం అయన ముఖ్య విధులు. ఇప్పుడీ వైరస్ ఉద్ధృతి సమయంలో ఆయన పని మరింత ఎక్కువ అవాల్సింది, మరింతగా తగ్గిపోయింది!
గవి అంతటా పచ్చదనమే...
ఇందుకు మేము చేసిందేమీ లేదు. గ్రామస్థులే జాగ్రత్తలు పాటిస్తున్నారు అని విన్సెంట్ చెబుతున్నారు. వస్తున్న ఒకటీ అరా జ్వరాలు కూడా మామూలువే. వాటికి మందులు ఇవ్వడంతో పాటు, అవసరాన్ని బట్టి వ్యాధినిరోధక శక్తిని కలిగించే ఇంజక్షన్‌లు ఇస్తున్నారు విన్సెంట్. గవి అంతటా పచ్చదనమే. ఊరి మధ్యలో చెరువు. స్వచ్ఛమైన జలాలు. ప్రభుత్వం కల్పించిన అవగాహన అక్కడివాళ్లలో బాగా పనిచేస్తోంది.
వెయ్యి జనాభా అంటే మనిషికి మనిషికి మధ్య ఊరికీ ఊరికీ ఉన్నంత దూరం ఉంటుంది. ఆ దూరంలోనే మళ్లీ సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తున్నారు గవి గ్రామస్థులు. అంతేకాదు, మాస్కులు ముక్కుల పైకి పెట్టుకుంటున్నారు. చేతుల్ని శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటున్నారు. ఇక వైరస్ వంటిది ఏదైనా వస్తే బయటి నుంచి రావాలి. లేదా బయటికి వెళ్లి వచ్చిన వారి నుంచి రావాలి.
ఈ రెండు పాయింట్ల దగ్గర మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. ఇక ఒకరి ఇళ్లకు ఒకరు పోవడమన్నదే లేదు.
ఎవరూ వెళ్లకపోతే రానివ్వకపోవడం అనేది ఏముంటుంది! ఎవరింటికి వారు, ఎవరి మనుషులకు వాళ్లు పరిమితం అయ్యారు. 19 యేళ్లుగా గవిలో పని చేస్తున్నారు విన్సెంట్.
ఎప్పుడూ కూడా వీళ్లు ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘించినది లేదు. ఆరోగ్య కార్యకర్తల మాటల్ని పెడచెవిన పెట్టిందీ లేదు అంటారు విన్సెంట్. ఆయనకు తోడు హెల్త్ ఇన్‌స్పెక్టర్ షరాఫుద్దీన్ కూడా మరింత తరచుగా గవి గ్రామానికి వెళ్తున్నారు. వీళ్లిద్దరూ కాకుండా వారానికోసారి ఒక వైద్య బృందం వాహనాలు వేసుకుని వచ్చి, ఇంటింటికీ తిరిగి గ్రామస్థుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది.
గవిలో ఒక్క పాజిటివ్ అయినా లేకపోవడానికి.. మేము చేస్తున్నది చేస్తున్నా.. గ్రామస్థులు వారికై వాళ్లు జాగ్రత్తలు తీసుకోవడమే ఎక్కువగా పని చేస్తోంది అని వైద్యాధికారులు అంటున్నారు! అయితే ఇంత కల్లోలంలోనూ గవి గ్రామం ఆరోగ్యంగా, పచ్చగా, ప్రశాంతంగా ఉండటానికి వేరే కారణం కూడా ఉంది.
వాళ్లకు బ్రేకింగ్ న్యూస్‌లు అక్కర్లేదు
గవి గ్రామంలోని ఏ ఇంట్లోనూ టీవీలు ఉండవు! అందుకని వైరస్ వార్తల్ని వినడం చూడడం ఉండదు. ఎవరి దగ్గరా స్మార్ట్ ఫోన్‌లు ఉండవు. అసలు నెట్ వర్కే ఉండదు. అందుకని ఆందోళన కలిగించే తాజా సమాచారాలేమీ వాళ్ల జీవితాలను ప్రభావితం చేయవు. వైద్యాధికారులు మాత్రం చెబుతుంటారు.. బయట పరిస్థితేమీ బాగోలేదు అని. ఆ ఒక్క మాట చాలు ఇక్కడి వారికి. చక్కగా అర్థం చేసుకోగలరు. బ్రేకింగ్ న్యూస్‌లు ఏమీ అక్కర్లేదు అని గవిలోని శ్రీలంక తమిళ కుటుంబానికి చెందిన చంద్రకుమార్ అనే యువకుడు అంటాడు.
ఇంటర్నెట్ లేని గవిలో మందుల దుకాణం ఉంది. వ్యాక్సినేషన్ కూడా మొదలైంది. ప్రారంభంలో ఇక్కడ 700 శ్రీలంక తమిళ కుటుంబాలు ఉండేవి. వాళ్లంతా 1964లో భారత్-శ్రీలంక దేశాల మధ్య జరిగిన ఒప్పందం తర్వాత భారత్‌కు తిరిగొచ్చి గవిలో స్థిరపడినవారు. ఇప్పుడా కుటుంబాలు 360కి తగ్గిపోయాయి. వ్యవసాయం వారి జీవనాధారం. కేరళ అడవుల అభివృద్ధి సంస్థ, గవి పర్యావరణహిత పర్యటన ప్రాజెక్టు కలిపి నిర్వహిస్తున్న యాలకుల తోటల పెంపకంలో మిగతావాళ్లకు ఉపాధి దొరుకుతోంది.