Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో కరోనా కల్లోలం : సీఎం హైలెవల్ మీటింగ్

తెలంగాణాలో కరోనా కల్లోలం : సీఎం హైలెవల్ మీటింగ్
, గురువారం, 19 మార్చి 2020 (12:32 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు గురువారం అత్యవసర, అత్యున్నత రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్.పిలను ఆహ్వానించారు. 
 
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు, పంచాయతిరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్  రావు, హైదరాబాద్‌కు చెందిన మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లా రెడ్డి, డిప్యూటి స్పీకర్ పద్మారావు, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతిరాజ్, మున్సిపల్ శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లను ఈ సమావేశానికి ఆహ్వానించారు. 
 
ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన కొంతమంది విదేశియులకు కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలియడంతో రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తలెత్తిన పరిసితిని, తీసుకవలసిన జాగ్రత్తలను, పాటించాల్సిన నియంత్రణ పద్ధతులను గురువారం నాటి సమావేశంలో విస్త్రుతంగా చర్చిస్తారు. 
 
విదేశాల నుండి వచ్చిన వారి ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున ఎట్టి పరిస్థితుల్లోను విదేశాల నుండి వచ్చిన వారు సంపూర్ణ వైద్య పరీక్షలు చేసుకోవాలని కోరారు. ఈ విషయంలో ప్రజలు కూడా అప్రమత్తమై ప్రభుత్వానికి సమాచారమందించాలని, స్వీయ ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. 
 
విదేశాల నుండి వచ్చిన ఎవరినైనా సరే సంపూర్ణ పరీక్షలు జరిపిన తర్వాతనే ఇండ్లకు పంపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వుండేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొన్ని అంశాల్లో 15 రోజుల కార్యాచరణ, మరికొన్ని అంశాల్లో వారం రోజుల కార్యాచరణ ప్రకటించి అమలు చేస్తున్నది. 
 
గురువారం జరిగే అత్యవసర, అత్యున్నత సమావేశంలో మరిన్ని నియంత్రణ చర్యలు తీసుకునే అవకాశం వుంది. రాష్ట్రంలో ప్రజలు ఎక్కువగా గుమి గూడే కార్యక్రమాలన్నింటిని రద్దు చేయాలని నిర్ణయించింది. సామూహికంగా జరిగే పండుగలు, ఉత్సవాలకు కూడా దూరంగా ఉండాలని ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. 
 
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలను ప్రజలు అర్థం చేసుకుని రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, జనం ఒకే చోట గుమిగూడవద్దని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో 169కి చేరిన కరోనా కేసులు... దేశ వ్యాప్తంగా రైళ్ల రద్దు