ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులన్నీ కాంటాక్ట్ కేసులుగా భావిస్తున్నారు. వీటిలో సింహ భాగం కేసులు చెన్నై కోయంబేడు మార్కెట్‌కు లింకు ఉన్నట్టు అధికారులు తేల్చారు. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నమోదవుతున్న కొత్త కరోనా కేసులన్నీ ఈ ప్రాంతానికి చెందిన కేసులే కావడం గమనార్హం.
ఇదిలావుంటే, తాజాగా ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు.. గత 24 గంటల్లో 9,284 శాంపిళ్లను పరీక్షించగా మరో 48 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అదేసమయంలో 86 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,137గా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 948 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,142 మంది డిశ్చార్జ్ అయ్యారు.
గత 24 గంటల్లో నమోదైన 48 కొత్త కేసుల్లో అనంతపురంలో 3, చిత్తూరులో 11, తూర్పు గోదావరిలో 4, గుంటూరులో 12, కృష్ణాలో 3, కర్నూలులో 7 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు మరో 8 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కర్నూలులో కరోనా నిర్ధారిత కేసులు 591కి చేరాయి.
ఇకపోతే జిల్లాల వారీగా నమోదైవున్న మొత్తం కేసుల వివరాలను పరిశీలిస్తే, అనంతపూరం 118, చిత్తూరు 142, ఈస్ట్ గోదావరిలో 51, గుంటూరు 399, కడప 97, కృష్ణ 349, కర్నూలు 591, నెల్లూరు 111, ప్రకాశం 63, శ్రీకాకుళం 5, విశాఖపట్టణం 66, విజయనగరం 4, వెస్ట్ గోదావరి 68, ఇతరులు 73 చొప్పున కేసులు నమోదయ్యాయి.