ఇటీవల మరణించిన ఇండియన్ బ్యాంక్ మాజీ ఛైర్మన్, తమిళనాడు యాదవ మహాసభ అధ్యక్షులు ఎం.గోపాలకృష్ణన్ యాదవ్ సంస్మరణ సభ ద్రావిడ దేశం తరపున అంతర్జాలం మూలంగా నిర్వహించడం జరిగింది. ముందుగా "ద్రావిడ దేశం" అధ్యక్షుడు వి. కృష్ణారావు ప్రసంగిస్తూ గోపాలకృష్ణన్‌తో గత 30 సంవత్సరాలుగా తనకు పరిచయాన్ని వివరించారు. 1990వ సంవత్సరం చెన్నై శివార్లలోని మీంజూరులో జరిగిన ఉత్తర చెన్నై యాదవ మహాసభ కార్యక్రమంలో గోపాలకృష్ణన్‌తో పాటు మాజీ మంత్రి తమిళ్ కుడిమగన్, అప్పటి తాంబరం శాసనసభ్యులు వైద్యలింగంతో తాను కూడా పాల్గొన్నాట్టు చెప్పారు.
గత ఆగస్టు 6వ తేదీ ద్రావిడ దేశం తరపున అంతర్జాలం ద్వారా ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో గోపాలకృష్ణన్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారని అన్నారు. ఎల్లప్పుడూ ద్రావిడ దేశం కార్యక్రమాలను వారు ప్రోత్సహిస్తూ ఉంటారని నెమరువేసుకున్నారు. అతి సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే ఏకైక నాయకులు గోపాలకృష్ణన్ అని కొనియాడారు.
తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ఆర్.ఎమ్.ఆర్.పాసరై నిర్వాహకులు విశ్రాంత ఐఏఎస్ అధికారి రామమోహన రావు ప్రసంగిస్తూ చాలా సంవత్సరాలుగా గోపాలకృష్ణన్‌తో తనకు అనుబంధం ఉందని, తాను చెంగల్పట్టు కలెక్టరుగా ఉన్న సమయంలో తన కోరిక మేరకు అరివోళి ఇయక్కం కార్యక్రమానికి కావాల్సిన సహాయం అందించి విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడ్డారని చెప్పారు.
రాజకీయాల కారణంగా ఆయనకు శిక్ష పడినా ఎవరి సహాయం లేకుండా అన్ని కేసులనుంచి బయటపడ్డారని వారి మనో ధైర్యాన్ని కొనియాడారు. వారి ఆత్మకు శాంతి కలగాలని గోపాలకృష్ణన్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఆ తర్వాత మాజీ ఎంపీ, మాజీ మంత్రి గోకుల ఇందిరా ప్రసంగిస్తూ 2004వ సంవత్సరం జరిగిన సాతాన్‌కుళం నియోజకవర్గం శాసనసభ ఉప ఎన్నికల్లో గోపాలకృష్ణన్‌తో ఎంపీగా ఉన్న నేను కూడా కృషిచేసి అత్యంత ఓట్ల వ్యత్యాసంతో అన్నాడీఎంకే అభ్యర్థిని గెలిపించి అప్పటి ముఖ్యమంత్రి జయలలిత అభినందనలు పొందిట్టు చెప్పారు. గోపాలకృష్ణ మృతి యాదవ సమాజానికి తీరనిలోటని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విశ్రాంత ఐఏఎస్ అధికారి పి.కృష్ణయ్య, మాజీ పోలీసు అధికారి మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ బి.వి.రమణకుమార్, ఇండియన్ మారిటైం విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి డాక్టర్ విజయన్, యాదవ మహాసభకు చెందిన అనేక మంది నేతలు పాల్గొని, గోపాలకృష్ణన్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఏపీ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి పి.కృష్ణయ్య ప్రసంగిస్తూ ఒకటి రెండు సందర్భాలలో గోపాలకృష్ణన్‌ని కలుసుకునే సందర్భం ఏర్పడిందని, కావలి నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు బీద మస్తాన్ రావు ద్వారా ఇండియన్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ గోపాలకృష్ణన్ అనేక సేవలను గురించి తెలుసుకున్నానని తెలిపారు. ఈ రోజున మనమధ్య లేకపోవడం సమాజానికి తీరని లోటని చెప్పుకొచ్చారు.
అలాగే, మాజీ పోలీస్ ఐజీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ బి.వి.రమణకుమార్ ప్రసంగిస్తూ ఈ సంవత్సరం ఆగస్టు నెల ఆరవ తేదీ ద్రావిడ దేశం అధ్యక్షులు కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఒక అంతర్జాల సదస్సులో నాతో పాటు ముఖ్య అతిథిగా గోపాలకృష్ణన్ కూడా పాల్గొన్నారని, అప్పుడు ఎంతో ఆరోగ్యంగా కనిపించిన వారు ప్రస్తుతం మనం మధ్య లేకపోవడం తీరని లోటని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.