చెన్నై మహానగరంలో ఉన్న తెలుగు ప్రముఖుల్లో వి.కృష్ణారావు ఒకరు. ఈయన ద్రవిడ దేశం అనే రాజకీయ పార్టీ వ్యవస్థాపకులు. తమిళనాడు ప్రభుత్వంలో వివిధ శాఖల్లో కీలకమైన ఉద్యోగ బాధ్యతలను నిర్వహించిన కృష్ణారావు.. ఆ తర్వాత తమిళనాడులోని తెలుగు ప్రజల సంక్షేమం కోసం, వారి కష్టనష్టాల్లో చేదోడువాదోడుగా ఉండేందుకు, తన వంతు సాయం చేసేందుకు వీలుగా ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఈ పార్టీ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ముఖ్యంగా, తమిళనాట నానాటికీ నశించిపోతున్న మాతృభాష తెలుగును కాపాడుకునేందుకు ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇందుకోసం ఆయనే స్వయంగా పలు ప్రాంతాల్లో తెలుగు భాషా కోసం సదస్సులు, సెమినార్లు నిర్వహిస్తూ ప్రజల్లో తెలుగు భాష పట్ల అవగాహన కల్పిస్తూ, వారిని చైతన్య పరుస్తున్నారు.
ప్రధానంగా తెలుగు మీడియంలో చదువుతున్న తెలుగు విద్యార్థులకు పదో తరగతి ప్రశ్నపత్రాన్ని తెలుగులో ముద్రించేలా కృషి చేయడంలో కృష్ణారావు తన వంతు పాత్రను పోషించారు. అంతేకాకుండా, పలు తమిళనాడు మంత్రిత్వ శాఖల్లో పని చేసిన సమయంలో ఆయన ఎంతోమంది తెలుగు వారికి తనవంతు సాయం చేశారు.
అలాంటి కృష్ణారావుకు ఇటీవల ఓ అరుదైన గౌరవం లభించింది. దేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టి, అశువులు బాసిన జాతిపిత మహాత్మా గాంధీకి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన, స్వాతంత్ర్య సమరయోధుడు వి. కళ్యాణంతో సమావేశమయ్యారు. స్థానిక తేనాంపేటలో ఉన్న ఆయన నివాసంలో ఈ అరుదైన భేటీ జరిగింది.
1922 ఆగస్టు 15వ తేదీన జన్మించిన వి.కళ్యాణం 98 యేళ్ల వయసులోనూ ఎంతో చెలాకీగా, తన పనులు మాత్రమేకాదు.. ప్రతి రోజూ ఉదయం తన వంతు సమాజసేవలో భాగంగా తన ఇంటికి ఎదురుగా ఉన్న రహదారిని శుభ్రం చేస్తున్నారని కృష్ణారావు చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా, ప్రస్తుత దేశంలో నెలకొన్న కాలమాన, రాజకీయ పరిస్థితులపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని గుర్తుచేశారు. గాంధీ కలలుగన్న స్వరాజ్యం ప్రస్తుతం మచ్చుకైనా కనిపించడం లేదని వి.కళ్యాణం వాపోయినట్టు కృష్ణారావు తెలిపారు.