Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమిళనాడులో తెలుగు విద్యార్థుల సమస్య పరిష్కారం కోసం కృషి : వి.కృష్ణారావు

krishna rao
, మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (19:12 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తెలుగు విద్యార్థుల, ఉపాధ్యాయుల సమస్యలపై ద్రావిడ దేశం త్వరలో ఒక కార్యాచరణ రూపొందించాలని నిర్ణయం తీసుకుంది. 2006వ సంవత్సరం తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్బంధ విద్య చట్టం వల్ల వేలాది మంది తెలుగు విద్యార్థులు తమ మాతృభాష తెలుగులో విద్యాభ్యాసం చేయటానికి అనేక సమస్యలు ఎదురవుతున్నాయని వాటి పరిష్కారానికి కృషి చేయవలసిందిగా ద్రావిడ దేశం కార్యాలయానికి అనేక విన్నపాలు వస్తున్నాయి. 
 
అదేవిధంగా హోసూరు, పళ్ళిపట్టు, తిరుత్తణి, చెన్నై తదితర ప్రాంతాల్లోని తెలుగు స్కూళ్లు మరియు కళాశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను మా దృష్టికి నేరుగా రావడం జరిగింది. మాతృభాషలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విద్యాభ్యాసం కొనసాగించాలని మన రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నా, అనేకసార్లు కోర్టు తీర్పులు మైనారిటీ భాషా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అనుకూలంగా వచ్చినా ప్రభుత్వాధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ తెలుగు, కన్నడ, మలయాళం ఉర్దూ భాషా విద్యార్థుల భవిష్యత్తుపై నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అక్కడ తమిళంలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు సకాలంలో అందిస్తూ వారి విద్యాభ్యాసానికి చేయూతను అందిస్తున్నారని, కానీ తమిళనాడు రాష్ట్రంలో తెలుగు విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించడం లేదని ఎంతో ఆవేదనతో తెలియజేస్తున్నాం. తెలుగు ఉపాధ్యాయుల ప్రమోషన్లు కూడా ఏదో ఒక కారణం చూపి సకాలంలో రాకుండా ఇబ్బందులు పెడుతున్నారు. 
 
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు లాంటి మేధావులు, తెలుగు భాషాభిమానులు తెలుగు భాష ప్రాముఖ్యత గురించి అనేక సభలలో ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారని, వారి మాటలను ఆదేశాలుగా స్వీకరిస్తూ తమిళనాడు రాష్ట్రంలో తెలుగు భాషను బతికించుకోవడానికి "ద్రావిడ దేశం" కంకణం కట్టుకొని రాష్ట్రం నలుమూలలా ఉన్న తెలుగు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను నేరుగా కలుసుకొని వారి సమస్యల పరిష్కారానికి కృషిచేసేందుకు తెలుగు ప్రజలందరూ మా ఈ మహోద్యమానికి అండదండలు అందించాలని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.కృష్ణారావు మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైలులో ఇఫ్తార్ విందు - రైల్వే శాఖపై ప్రశంసల వర్షం