దేశంలోని ప్రతిష్టాత్మక ఐ.ఐ.టి, ఎన్.ఐ.టీల్లోని ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ (ఉమ్మడి ప్రవేశ పరీక్ష) తొలి విడద ప్రవేశ పరీక్ష నేటి నుంచి ప్రారంభంకానుంది. గురువారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా అనేక లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఒక్క తెలంగాణా నుంచే 50 వేల మందికిపైగా అభ్యర్థులు హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పరీక్ష జరుగనుంది. రెండో విడత జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలు వచ్చే నెల 21 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
మరోవైపు, జేఈఈ మెయిన్‌కు హాజరయ్యే విద్యార్థులను సొంత మాస్క్‌తో పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేది లేదని అధికారులు ప్రకటించారు. పరీక్ష కేంద్రాల్లో ఉచితంగా మాస్క్‌ను అందిస్తామన్నారు. గత యేడాది మాస్క్‌ను ధరించి ఒకరికి బదులుగా ఒకరు పరీక్ష రాస్తూ పట్టుబడిన నేపథ్యంలో ఎన్టీఏ ఈ జాగ్రత్త తీసుకుంది.
విద్యార్థులు తమ వెంట 2 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను తీసుకురావాలని, వాటిని ఏదేని ఐడీ ఫ్రూఫ్‌తో సరిపోల్చి చూస్తామని అధికారులు తెలిపారు. గుర్తింపు కార్డులుగా ఒరిజినల్ పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 12వ తరగతి అడ్మిట్‌కార్డుల్లో ఒక దాన్ని తీసుకురావాలన్నారు.