Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విద్యార్థులకు శుభవార్త... మరో 20 శాతం తగ్గనున్న సిలబస్

విద్యార్థులకు శుభవార్త... మరో 20 శాతం తగ్గనున్న సిలబస్
, ఆదివారం, 11 అక్టోబరు 2020 (10:51 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు పాఠశాలలు పూర్తి స్థాయిలో ప్రారంభంకాలేదు. కొన్ని రాష్ట్రాల్లో కాలేజీలు తెరుచుకోగా, ప్రాథమిక పాఠశాలలు మాత్రం ఇంకా తెరుచుకోలేదు. ఎపుడు తెరుస్తారో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. 
 
ఈ క్రమంలో ఇప్పటికే పాఠ్యాంశాల సిలబస్‌ను 30 శాతం తగ్గించిన సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ, మరో 20 శాతం... అంటే, మొత్తం 50 శాతం మేరకు సిలబస్‌ను తగ్గించాలని నిర్ణయించింది. తీసేసిన పాఠ్యాంశాల నుంచి ఈ సంవత్సరం పరీక్షల్లో ఎటువంటి ప్రశ్నలూ ఉండబోవని స్పష్టం చేసింది.
 
విద్యార్థులు ఇంతవరకూ స్కూళ్లకు వెళ్లకపోవడం, ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో పాఠశాలలు తిరిగి తెరచుకుంటాయన్న విషయమై స్పష్టత లేకపోడవంతో సిలబస్‌ను మరింత తగ్గించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
పరిస్థితి మరింతకాలం పాటు అదుపులోకి రాకపోతే, 70 శాతం వరకూ సిలబస్‌ను తగ్గించి, ఎంపిక చేసిన 30 శాతం పాఠ్యాంశాలతోనే ఈ విద్యా సంవత్సరాన్ని ముగించే ఆలోచనలో ఉన్నామని సీబీఎస్ఈ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
 
ఈ విషయంలో తుది నిర్ణయాన్ని త్వరలో జరిపే సమావేశం తర్వాత తీసుకునే అవకాశాలు ఉన్నాయని, బోర్డు పరీక్షలు కూడా నెలన్నర నుంచి, రెండు నెలలు ఆలస్యంగా జరిపే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. 
 
ఈ సంవత్సరం బోర్డు పరీక్షలు 2021 ఏప్రిల్ లో జరగవచ్చని అంచనా వేశారు. కాగా, పాఠశాలలను తిరిగి తెరిచేందుకు కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసినప్పటికీ, మహమ్మారి విజృంభిస్తున్న దృష్ట్యా, ఇప్పట్లో స్కూళ్లు పూర్వపు స్థితికి వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు.
 
ఇదేసమయంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా, రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని స్కూళ్లను తెరిపించుకునే అవకాశాలు ఉన్నా, చాలా మంది తమ పిల్లలను స్కూళ్లకు పంపేందుకు నిరాకరిస్తూ ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీరమణను టార్గెట్ చేసిన సీఎం జగన్!!