Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీరమణను టార్గెట్ చేసిన సీఎం జగన్!!

సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీరమణను టార్గెట్ చేసిన సీఎం జగన్!!
, ఆదివారం, 11 అక్టోబరు 2020 (10:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో దుస్సాహసానికి శ్రీకారం చుట్టింది. సాక్షాత్ న్యాయ వ్యవస్థనే లక్ష్యంగా చేసుకుంది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయూర్తి మహేశ్వరితో పాటు... సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బాబ్డేకు ఏకంగా లేఖ రాశారు. 
 
నిజానికి సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. అలాంటి న్యాయమూర్తిపై సంచలన ఆరోపణలు చేస్తూ, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు లేఖ రాశారు. ఏపీ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులపై ఆయన ఒత్తిడి తెస్తున్నారని తన లేఖలో జగన్ ఆరోపించారు.
 
మొత్తం 8 పేజీలున్న లేఖలో, తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడికి అనుకూలంగా ఎన్వీ రమణ ప్రయత్నిస్తున్నారని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ఎన్వీ రమణ ఇద్దరు కుమార్తెలు అక్రమంగా అమరావతి ప్రాంతంలో భూ లావాదేవీలు చేశారని, వారు కొన్న భూ లావాదేవీలపై ఎన్నో అనుమానాలు, ప్రశ్నలు ఉన్నాయని అన్నారు. 
 
రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు వారిద్దరూ భూమిని కొన్నారని అవినీతి నిరోధక శాఖ గుర్తించిందన్నారు. అక్టోబర్ 6వ తేదీతో ఈ లేఖ ఉండగా, శనివారం సాయంత్రం సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లాం, హైదరాబాద్‌లో దీన్ని మీడియాకు విడుదల చేశారు. ఈ లేఖపై స్పందించాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ను సంప్రదించగా, స్పందన ఇంకా రాలేదు. 
 
కాగా, ఇటీవల మాజీ న్యాయమూర్తి ఆర్ భానుమతి రాసిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎన్వీ రమణ, ఆపై ప్రసంగిస్తూ, న్యాయమూర్తులను విమర్శించడం పరిపాటిగా మారిందని, సామాజిక మాధ్యమాలు విస్తరించిన తర్వాత, జడ్జీలపై ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారని, తమను తాము సమర్ధించుకునే అవకాశం మాత్రం న్యాయమూర్తులకు లేదని అన్నారు. 
 
కాగా, ఏపీ సర్కారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయంపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలవుతూ వస్తోంది. వీటిపై విచారించే హైకోర్టు... స్టేలు విధిస్తూ వస్తోంది. ఫలితంగా ప్రభుత్వ నేతల్లో అసహనం పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుని వైకాపా నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్ ఇవే... తెలంగాణాలో శాంతించిన వైరస్