తమిళనాడు రాష్ట్రంలో వ్యాపారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యాపారులు 24 గంటల పాటు వ్యాపారం చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు ఆ సర్కారు ఓ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీచేసింది. అయితే, మహిళా ఉద్యోగులకు పూర్తి రక్షణ బాధ్యతను కల్పించాలని స్పష్టంచేసింది. రాత్రిపూట తెరిచివుంచే వ్యాపార సంస్థలు, మాల్స్‌లలో పని చేసే ఉద్యోగుల పేర్లు అందరికీ తెలిసివుంచేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచన చేసింది. నైట్ షిఫ్టుల్లో పని చేసే మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌పోర్టు సౌకర్యం కూడా కల్పించాలని ఆ గెజిట్‌లో పేర్కొంది.
అదేసమయంలో ఉద్యోగుల కోసం విశ్రాంతి గదులు, వాష్‌రూములు, సేఫ్టీ లాకర్లతోపాటు కనీస మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించిన వివరాలను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని కూడా పేర్కొంది. ఉద్యోగులతో 8 గంటలకు మించి పనిచేయించరాదని, వారంలో 48 గంటలు దాటరాదని స్పష్టంగా పేర్కొంది. ఓవర్ టైమ్ కూడా రోజులే 10.5 గంటలు దాటరాదని ప్రభుత్వం పేర్కొంది. వారంలో 24 గంటలు పని చేసే ఈ వెసులుబాటును తొలుత మూడేళ్ళకు మాత్రమే అనుమతించారు.