దేశంలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో అనిల్ అంబానీ ఒకరు. అడాగ్ గ్రూప్ అధినేతగా, ఆర్‌కామ్ ఛైర్మన్‌గా ఉన్న ఈయన ఆస్తి ఇపుడు హారతి కర్పూరంలా తరిగిపోయింది. ఫలితంగా ఈయన ధనవంతుల జాబితా నుంచి స్థానం కోల్పోయారు.
నిజానికి గత 2008లో ఫోర్బ్స్ జాబితా ప్రకటించిన జాబితాలో అనిల్ అంబానీ ఓ బిలియనీర్. ఆ సమయంలో ఈయన ఆస్తి విలువ 42 బిలియన్ డాలర్లుగా ఉండేది. అంటే.. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో అనిల్ అంబానీది ఆరో స్థానమన్నమాట. కానీ దశాబ్దకాలం గడిచిపోయేసరికి ఆయన ఆస్తి కర్పూరంలా కరిగిపోయింది. ప్రస్తుతం అనిల్ అంబానీ మొత్తం ఆస్తి విలువ కేవలం రూ.3651 కోట్లు (523 మిలియన్ డాలర్లు) మాత్రమే.
దీనికి ఆయన సారథ్యంలోని అనేక కంపెనీలు అప్పుల్లో కూరుకునిపోవడం ప్రధాన కారణం. ఫలితంగా ఆయా కంపెనీల షేర్ల ధరలు గణనీయంగా పడిపోయాయి. దీనికితోడు అప్పులు మాత్రం భారీగా పెరిగిపోయాయి. దీంతో ఆయన వ్యాపార సామ్రాజ్యం విలువ పాతాళానికి చేరిపోయింది.
మ్యూచుఫల్ ఫండ్ జాయింట్ వెంచర్ అయిన, రిలయన్స్ - నిప్సాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్‌లోని తమ 43 శాతం వాటాలను విక్రయించాలని బ్యాంకులు నిర్ణయించుకోవడం, గడచిన 14 నెలల కాలంలో రూ.35 వేల కోట్లకు పైగా రుణాలను తీర్చడంతోనే అనిల్ అంబానీ ఆస్తి హారతికర్పూరమైందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.