కరోనా వైరస్ కారణంగా దేశం యావత్తూ లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. దీంతో అన్ని రకాల సేవలు బంద్ అయ్యాయి. అలాగే, దేశ ప్రజలంతా తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. కరోనా బాధితులతో పాటు పేదలు, మధ్యతరగతి ప్రజలు, చిరు, మధ్యతరగతి వ్యాపార రంగాలను ఆదుకునేందుకు కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. అలాగే, రుణ చెల్లింపుల దారులకు ఊరట కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐని కేంద్ర విత్తమంత్రి ఆదేశించారు.
దీంతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ రంగంలోకి దిగారు. శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. రుణ చెల్లింపుదారులకు శుభవార్త చెప్పారు. వచ్చే మూడు నెలలు ఈఎంఐలు చెల్లించకపోయిన ఫర్వాలేదని తెలిపారు. బ్యాంకులతో పాటు అన్ని ఫైనాన్స్ సంస్థలు అన్ని రకాల రుణాలపై ఈఎంఐలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని శక్తికాంతదాస్ సూచించారు.
హౌసింగ్‌లోన్లతో పాటు అన్ని రకాల రుణాలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. అయితే ఇప్పుడు చెల్లించాల్సిన ఈఎంఐలు తర్వాత పీరియడ్‌లో ఎప్పుడైనా చెల్లించవచ్చన్నారు. అటు ఈఎంఐ కట్టకపోయిన సిబిల్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం చూపబోదని స్పష్టం చేశారు.
అంతేకాకుండా, కరోనా విస్తరణతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా చర్యలు తీసుకుంది. గడచిన నాలుగు రోజులుగా పరపతి సమీక్షను జరిపిన ఆర్బీఐ, రెపో రేటును ముప్పావు శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఇదేసమయంలో రివర్స్ రెపో రేటును ఏకంగా 90 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు.
ఇటీవలి కాలంలో ఇంత అధిక మొత్తంలో వడ్డీ రేటు కోతను ప్రకటించడం ఇదే తొలిసారి. ఈ తగ్గింపు తర్వాత రెపో రేటు 4.4 శాతానికి చేరుతుంది. బ్యాంకులకు మరిన్ని రుణాలు ఇచ్చేందుకు వెసులుబాటు కలుగుతుందన్న ఉద్దేశంతోనే రెపో, రివర్స్ రెపోల మధ్య వ్యత్యాసాన్ని పెంచామని ఈ సందర్భంగా శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపైనా కన్నేసి ఉంచామని తెలిపారు.