కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రాలన్నీ పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించాయి. కొన్ని చోట్ల పరీక్షలు యథాతథంగా జరుగుతుంటే.. ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షలు కూడా వాయిదా పడుతున్నాయి.
విశాఖపట్నంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ 188 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు 2020 మార్చి 22న ఆన్‌లైన్ టెస్ట్ జరగాల్సి ఉంది. కానీ... కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ పరీక్షను వాయిదా వేస్తున్నామని, మళ్లీ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తామో త్వరలో ప్రకటిస్తామని వైజాగ్ స్టీల్ ప్లాంట్ నోటీస్ విడుదల చేసింది.
సెంట్రల్ ఎయిర్‌మెన్ సెలక్షన్ బోర్డ్-సీఏఎస్బీ ఎయిర్‌మెన్ స్టార్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్‌ను మార్చి 19 నుంచి 23 వరకు నిర్వహించాల్సి ఉండగా ఎగ్జామ్‌ను ఏప్రిల్ చివరి వారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
మార్చి 22 ఆదివారం దేశవ్యాప్తంగా 11 నగరాల్లో జరగాల్సిన రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్‌ను వాయిదా వేస్తున్నట్టు ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ) ప్రకటించింది. అలాగే ఆర్బీఐ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న మెయిన్స్ ఎగ్జామ్‌ను వాయిదా వేసింది. కొత్త తేదీలను త్వరలో ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో ప్రకటిస్తామని తెలిపింది.