Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆధార్ లింక్ పేరుతో రూ.6లక్షలు స్వాహా.. దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది..

Advertiesment
ఆధార్ లింక్ పేరుతో రూ.6లక్షలు స్వాహా.. దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది..
, మంగళవారం, 8 జూన్ 2021 (10:46 IST)
ఆధార్ లింక్ పేరుతో సైబర్ క్రిమినల్స్ ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఓ ఉద్యోగి నుంచి ఏకంగా రూ.6లక్షలు స్వాహా చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అశ్వాపురం మండలం గౌతమీగర్‌ కాలనీకి చెందిన ఉద్యోగి దామోదర్‌రావు మొబైల్‌కు గత నెల 20న ఒక ఫోన్ కాల్‌ వచ్చింది. మీ మొబైల్ నంబర్‌కు ఆధార్ లింక్ చేయాలని వారు చెప్పారు. ఒక మేసేజ్ వస్తుంది.. దాని లింక్‌ను క్లిక్ చేయండని సూచించారు. వారు చెప్పినట్టే దామోదర్ ఆ లింక్ మీద క్లిక్ చేశారు. 
 
మొబైల్ నంబర్‌కు ఆధార్ లింక్ అయిందో లేదో తెలుసుకునేందుకు రూ. 10 ట్రాన్స్‌ఫర్ చేయమని అడిగారు. ఆ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన కాసేపటికే ఉద్యోగికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.6.20 లక్షలు విత్ డ్రా అయ్యాయి. దీంతో ఆయన బిత్తరపోయాడు. తాను మోసపోయానని తెలుసుకోవడానికి ఎంతో సేపు పట్టలేదు.
 
వెంటనే అలర్ట్ అయిన బాధిత ఉద్యోగి.. అశ్వాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కొత్తగూడెం సైబర్ క్రైమ్ పోలీసుల సాయంతో దర్యాప్తు చేశారు. సైబర్‌ నేరగాళ్లు దామోదర్‌ రావు ఖాతా నుంచి కొల్లగొట్టిన డబ్బుతో ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేశారు. సైబర్‌ క్రైం పోలీసులు ఆ వస్తువులు డెలివరీ కాకుండా నిలుపుదల చేసి.. వారి నుంచి రూ 4.5 లక్షలను రికవరీ చేశారు. దీంతో దామోదర్ రావుకి కాస్త అయినా ఊరట దక్కినట్టైంది.
 
గుర్తు తెలియని నెంబర్ల నుంచి కాల్, మేసేజ్ వస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. వారు చెప్పే మాటలు గుడ్డిగా నమ్మడం మంచిది కాదన్నారు. సైబర్ క్రిమినల్స్ మాయలో పడి సొమ్ము పొగొట్టుకోవద్దన్నారు. ఏదైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. 
 
ఏదైనా పని చేసే ముందుకు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలన్నారు. మన అప్రమత్తతే మనకు శ్రీరామరక్ష అని చెప్పారు. కాగా, సైబర్ నేరాల గురించి పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, జాగ్రత్తలు చెబుతున్నా, చైతన్యం కల్పిస్తున్నా.. ఇంకా కొందరు అడ్డంగా మోసపోతూనే ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాంధీ మనవరాలికి ఏడేళ్ళ జైలుశిక్ష... ఎక్కడ.. ఎందుకు?