Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెట్రో ధరల పోటు తప్పదు.. క్లారిటీగా చెప్పిన కేంద్రం

Advertiesment
పెట్రో ధరల పోటు తప్పదు.. క్లారిటీగా చెప్పిన కేంద్రం
, మంగళవారం, 16 మార్చి 2021 (12:03 IST)
దేశ ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. పెట్రో ధరల పోటు తప్పదని తేల్చింది. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి ముడిచమురు, పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధనం(ఏటీఎఫ్‌), సహజవాయువు(గ్యాస్‌)ను తీసుకొస్తే పన్నుల భారం తగ్గే అవకాశం ఉంటుందని, ధరల నుంచి కాస్త రిలీఫ్ పొందొచ్చని ప్రజలు భావించారు. అయితే వీటిని ఇప్పటికిప్పుడు జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. 
 
ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు. అంటే, మండిపోతున్న చమురు ధరల నుంచి దేశ ప్రజలకు ఇప్పట్లో ఉపశమనం కలిగే మార్గం లేదని ఆమె తేల్చిపారేశారు. 
 
రాష్ట్రాలకూ ప్రాతినిధ్యం ఉన్న జీఎస్టీ మండలిలో ఇప్పటి వరకూ ఎవరూ కూడా ఆయా ఇంధనాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదించలేదని, ఒకవేళ అలాంటి ప్రతిపాదన వస్తే చర్చించి నిర్ణయం తీసుకుంటుందని నిర్మల వివరించారు. 
 
ఆదాయ ప్రభావాల అంచనా సహా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఐదు పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి చేర్చే ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్‌ పరిశీలించవచ్చని ఆమె అన్నారు. పెట్రో ధరల పెంపు నుంచి వినిమయదారులకు ఊరట కల్పించేలా పన్నులు తగ్గించేందుకు కేంద్రం, రాష్ట్ర ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాలన్నారు. 
 
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల పన్నులను కలిపేస్తూ 2017 జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ పరిధి నుంచి ముడిచమురు, పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధనం, గ్యాస్‌లను మినహాయించారు. వీటిపై కేంద్ర ప్రభుత్వం సుంకాలను, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను విడివిడిగా విధించడాన్ని కొనసాగిస్తున్నాయి. దీంతో వీటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
 
పెట్రో ధరలు రికార్డు స్ధాయికి చేరాయి. కొన్ని చోట్ల లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటింది. పెరిగిన ధరలతో సామాన్యులు విలవిలలాడిపోతున్నాడు. ఈ క్రమంలో పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తారని, దీంతో ధరలు తగ్గుతాయని వార్తలొచ్చాయి. అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన అందరినీ తీవ్రంగా నిరాశపరిచింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా హెల్త్ చెకప్.. ఎటిఎమ్ తరహాలో హెల్త్ కార్డు