Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎంత మొత్తుకున్నా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఖాయం : కేంద్రం

ఎంత మొత్తుకున్నా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఖాయం : కేంద్రం
, సోమవారం, 8 మార్చి 2021 (19:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో పిడుగులాంటి వార్తను చెప్పింది. ఆంధ్రుల ఆత్మగౌరవంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తథ్యమని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఏమాత్రం వెనక్కితగ్గే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించింది. 
 
విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరం చేయరాదంటూ రాష్ట్రంలోని అన్ని పార్టీలు (బీజేపీ మినహా) ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేస్తామని వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. 
 
మరోవైపు ఈ అంశంపై పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని కుండబద్దలు కొట్టింది.
 
వైసీపీ ఎంపీలు గొడ్డేటి మాధవి, ఎంవీవీ సత్యనారాయణ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ... స్టీల్ ప్లాంట్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వాటా లేదని స్పష్టం చేశారు. ఈ ప్లాంటు నుంచి 100 శాతం పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నామని సంచలన ప్రకటన చేశారు.
 
పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ జనవరి 27నే నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్లాంటులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వాటా లేకపోయినప్పటికీ... నిర్దేశించిన అంశాల్లో సంప్రదింపులు జరిపి, రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని కోరామని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య రెండు నెలల గర్భిణి, ఆమంటే భర్తకు ప్రాణం, కానీ?