Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అబ్బెబ్బె.. అలాంటి ప్రతిపాదనేదీ లేదు... పెట్రో భారం భరించాల్సిందే : అనురాగ్ ఠాకూర్

అబ్బెబ్బె.. అలాంటి ప్రతిపాదనేదీ లేదు... పెట్రో భారం భరించాల్సిందే : అనురాగ్ ఠాకూర్
, సోమవారం, 15 మార్చి 2021 (17:01 IST)
జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ధరలను తెచ్చే ప్రతిపాదనేదీ ఇప్పట్లో లేదని కేంద్రం ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. అందువల్ల పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని ప్రజలు భరించక తప్పదని ఆయన చెప్పకనే చెప్పారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా, విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధనం, గ్యాస్‌లను జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చే ప్రతిపాదన ప్రస్తుతం లేదని స్పష్టం చేశారు. 
 
వీటిపై జీఎస్‌టీ కౌన్సిల్‌ ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదన చేయలేదని లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చింది. పెట్రోలియం ఉత్పత్తులను వస్తు సేవల పన్నులోకి తెచ్చే అంశాన్ని జీఎస్‌టీ కౌన్సిల్‌ సరైన సమయంలో పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందన్నారు. 
 
అలాగే, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో వీటిని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని కోరారు. పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులను తగ్గించే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అదేసమయంలో రాష్ట్రాలు కూడా దీన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 
 
ఎక్సైజ్‌, వ్యాట్‌ తగ్గింపు విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పరస్పరం ఆలోచన చేయాల్సి ఉందని అనురాగ్‌ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. గతేడాది మార్చి నెలలో క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 19డాలర్లు ఉండగా, ప్రస్తుతం అది 65డాలర్లకు పెరిగిందని అనురాగ్‌ ఠాకూర్‌ గుర్తుచేశారు.
 
రికార్డు స్థాయిలో పెరిగిపోతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నియంత్రించేందుకు వీటిని జీఎస్‌టీలోకి తీసుకురావాలనే డిమాండ్‌ గత కొంతకాలంగా ఎక్కువైంది. ఇంధన ధరలను జీఎస్‌టీలోకి తీసుకురావడం వల్ల ధరలను తగ్గించవచ్చని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌లు గతంలో అభిప్రాయపడిన విషయం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికను రద్దు చేయాలి : సుప్రీంలో పిటిషన్