దేశంలో మండిపోతున్న చమురు ధరల నుంచి దేశ ప్రజలకు ఇప్పట్లో ఉపశమనం కలిగే మార్గం కనిపించడంలేదని కేంద్ర విత్తమంత్రి నిర్మాలా సీతారమన్ అభిప్రాయపడ్డారు. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి ముడిచమురు, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం(ఏటీఎఫ్), సహజవాయువు(గ్యాస్)ను తీసుకొస్తే పన్నుల భారం తగ్గే అవకాశం ఉంటుందని గతంలో ఆమె వ్యాఖ్యానించారు.
అయితే, వీటిని ఇప్పటికిప్పుడు జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదన ఏదీ లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు. రాష్ట్రాలకూ ప్రాతినిధ్యం ఉన్న జీఎస్టీ మండలిలో ఇప్పటి వరకూ ఎవరూ కూడా ఆయా ఇంధనాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదించలేదని గుర్తుచేశారు.
ఒకవేళ అలాంటి ప్రతిపాదన వస్తే చర్చించి నిర్ణయం తీసుకుంటుందని ఆమె వివరించారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల పన్నులను కలిపేస్తూ 2017 జులై ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చిన జీఎస్టీ పరిధి నుంచి ముడిచమురు, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, గ్యాస్‌లను మినహాయించారు. వీటిపై కేంద్ర ప్రభుత్వం సుంకాలను, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను విడివిడిగా విధించడాన్ని కొనసాగిస్తున్నాయి. దీంతో వీటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి.