వచ్చే నెల ఫిబ్రవరి ఒకటో తేదీన 2025-26 సంవత్సరానికిగాను ఆర్థిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై వేతన జీవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా, ఆదాయ పన్ను పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచవచ్చని భావిస్తున్నారు. అంటే రూ.10 లక్షల వరకు ఎలాంటి పన్ను లేకుండా చూడాలని కోరుతున్నారు.
ప్రస్తుతం వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలు ఉండటంతో రూ.7.75 లక్షల వార్షిక ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఉంది. రానున్న బడ్జెట్‌లో దీన్ని రూ.10 లక్షలకు పెంచబోతున్నట్టు సమాచారం.
అలాగే, ఆదాయపు పన్ను శ్లాబుల్లో కూడా మార్పులు కూడా చేయబోతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు 30 శాతం పన్నును విధిస్తున్నారు. దీనిని రూ.25 శాతానికి తగ్గించబోతున్నట్టు సమాచారం. దీనివల్ల రూ.15 లక్షలకు మించి వార్షిక ఆదాయం ఉన్నవారికి ఊరట లభించనుంది. అంతేకాకుండా, కొనుగోదారుల చేతిలో డబ్బులు ఉండటం వల్ల వారు మరింత వ్యయం చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని, దీనివల్ల అంతిమంగా ప్రభుత్వానికే మేలు జరుగుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆదాయపన్నుతో పాటు ఐటీ శ్లాబుల్లో మార్పులు చేసే అవకాశం ఉంది.