దేశంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయిలో వసూలయ్యాయి. గత యేడాది డిసెంబరు నెలలో వసూలైన పన్నుల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం వెల్లడించింది. గత నెల డిసెంబరులో మొత్తం 1.77 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు పేర్కొంది. అంతకుముందు యేడాదితో పోల్చితే 7.3 శాతం వృద్ధి నమోదైనట్టు పేర్కొంది. 2023 డిసెంబరులో జీఎస్టీ వసూళ్లు రూ.1.65 లక్షల కోట్లుగా నమోదైయ్యాయి.
సీజీఎస్టీ రూపంలో రూ.32836 కోట్లు, ఎస్జీఎస్టీ రూపంలో రూ..40499 కోట్లు వచ్చాయి. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ కింద రూ.91200 కోట్లు వచ్చాయి. సెస్‌ల రూపంలో రూ.12300 కోట్లు వచ్చినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. ఇందులో దిగుమతులపై విధించిన పన్నుల నుంచి వచ్చిన రెవెన్యూ 4 శాతం పెరిగి రూ.44268 కోట్లుగా ఉంది.
జీఎస్టీ వసూళ్లు రూ.1.7 లక్షల కోట్లు దాటటం వరుసగా ఇది పదో నెల. మార్చి నెల నుంచి జీఎస్టీ వసూళ్లు ఈ స్థాయిని దాటుతున్నాయి. నవంబరు నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.82 లక్షల కోట్లు నమోదయ్యాయి. గత యేడాది అత్యధికంగా ఏప్రిల్ నెలలో రూ.2.10 లక్షల కోట్లు జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.