చాలామంది ఐటీ ఉద్యోగులు గంటల కొద్దీ కుర్చీలకు అతుక్కునిపోయి పని చేస్తుంటారు. ఇలాంటి వారికి ప్రాణముప్పు పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిశ్చలమైన లైఫ్ స్టైల్ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదంటున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయామం చేయాలని సలహా ఇస్తున్నారు. అయితే, రోజుకు పదిన్నర గంటలకు పైగా కూర్చునే వారిని వ్యాయామం కూడా కాపాడలేదని తాజా అధ్యయనం తేల్చి చెప్పింది.
రోజులో దాదాపు సగం గంటలు కూర్చుంటే వ్యాయామం చేసినా ఎందుకూ కొరగాకుండా పోతుందని ఎంఐటీ, హార్వర్డ్ యూనివర్సిటీ తాజా అధ్యయనం పేర్కొంది. మిగతా వారితో పోలిస్తే రోజులో 10.6 గంటల కంటే ఎక్కువ సేపు కూర్చునే వారిలో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువని తేలింది. వారానికి సిఫార్సు చేసిన 150 నిమిషాల వ్యాయామం చేసినప్పటికీ ఇటువంటి వారిలో ఎలాంటి ప్రభావం ఉండదని తేల్చి చెప్పింది.
రోజులో పదిన్నర గంటలకుపైగా కూర్చునే వారిలో గుండె వైఫల్యం కారణంగా 15 శాతం, హృద్రోగాలతో మరణించే అవకాశం 33 శాతం ఎక్కువని పేర్కొంది. వ్యాయామం అలవాటు లేని వారిలో ఈ ముప్పు మరింత ఎక్కువని అధ్యయనం తెలిపింది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీకి చెందిన ఫ్లాగ్లిప్ జర్నల్ జేఏసీసీలో ఈ అధ్యయనం ప్రచురితమైంది.