అతి త్వరలో బిజెపి ప్రభుత్వం చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. అయితే ఈ ప్రభుత్వానికి ఇది ఆఖరు బడ్జెట్ కావడం, మరికొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సాధారణంగా ఎన్నికల ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ పూర్తి స్థాయిలో కాకుండా కేవలం నాలుగు నెలల కోసం ప్రవేశపెడతారు, ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను తీసుకొస్తుంది. అయితే ఈ విధానాన్ని పక్కన పెట్టి ప్రభుత్వం ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం.
అయితే ఎన్నికలు దగ్గరలో ఉండటంతో ఈ బడ్జెట్‌లో అన్ని రకాల వర్గాలకు వరాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు వినికిడి. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను పరిమితిని పెంచడం, గృహ రుణాలపై వడ్డీ తగ్గించడం, దీర్ఘకాలిక పెట్టుబడి ఆదాయాలపై పన్నులను తగ్గించడం, జాతీయ పెన్షన్ సిస్టమ్ మరియు ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్‌లను సులభతరం చేయడం వంటి ముఖ్యమైన మార్పులు చేయనున్నట్లు సమాచారం.
భారతదేశంలో ఎక్కువ శాతం మధ్యతరగతి ప్రజలే ఉన్నందున ఈ బడ్జెట్‌ను మధ్య తరగతి వర్గాలకు అనుకూలంగా ఉండేలా ప్రవేశపెట్టే యోచనలో మోదీ సర్కారు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.