రాబోయే కాలంలో డిజిటల్ పేమెంట్లు ఫ్రీగా చేసుకునే అవకాశం వుండదని అర్థమవుతోంది. ఎందుకంటే... తాజాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ... భవిష్యత్తులో డిజిటల్ పేమెంట్లు ఉచితంగా లభించకపోవచ్చు అని అన్నారు. ఎందుకంటే, ఆర్థికంగా యూపీఐ వ్యవస్థ స్థిరంగా సాగాలంటే ఛార్జీలు వసూలు తప్పదని ఆయన అన్నారు. ఈ ఛార్జీలను ప్రస్తుతం ప్రభుత్వం భరిస్తోందనీ, దాంతో ఇవి క్రమంగా భారంగా మారుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ స్థిరంగా వుండాలంటే అదనపు ఛార్జీలను అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రజలు కానీ ఎవరో ఒకరు భరంచక తప్పదంటూ చెప్పుకొచ్చారు.
ఇదిలావుంటే... డిజిటల్ పేమెంట్లు తమ బతుకులకు గుదిబండల్లా మారుతున్నాయని చిరువ్యాపారులు ఇప్పటికే పెదవి విరుస్తున్నారు. రోజువారీ తాము జరిపే అమ్మకాలు లెక్కకు వస్తున్నాయి కానీ వాటిలో తమకు మిగిలేది చాలా తక్కువ అని అంటున్నారు. ఎందుకంటే తాము కొనుగోలు చేసే సరుకుకి డిజిటల్ పేమెంట్స్ అంటే చాలామంది అంగీకరించడంలేదనీ, అందువల్ల డిజిటల్ పేమెంట్లు కంటే క్యాష్ తీసుకోవడమే బెటర్ అని వారు అంటున్నారు. తాజాగా ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలతో ఇక మళ్లీ కరెన్సీ పేమెంట్లు తప్పని పరిస్థితి వచ్చేట్లు వుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.