యూపీఐ పేమెంట్స్ సేవలకు మరోమారు అంతరాయం కలిగింది. దేశ వ్యాప్తంగా ఈ సేవలు నిలిచిపోయాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌లు పని చేయలేదు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొందరు వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
యూపీఐ చెల్లింపులు జరగడం లేదని, నెట్‌వర్క్ స్లో అని వస్తుందంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి వేల మంది యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు ఫిర్యాదు చేసినట్టు డౌన్ డిటెక్టర్ అనే వెబ్‌సైట్ తెలిపింది.
ఇక ఇటీవల యూపీఐ పేమెంట్స్‌లో తరచూ ఆటంకం ఏర్పడుతున్న విషయం తెల్సిందే. గత నెల 26వ తేదీన ఇలాంటి పరిస్థితి తలెత్తగా, సాంకేతిక కారణంతో ఇలా జరిగిందని, ఎన్.పి.సి.ఐ అప్పట్లో వివరణ ఇచ్చింది. ఆ తర్వాత ఈ నెల 2వ తేదీన కూడా ఇదే తరహాలో యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడగా శనివారం మరోమారు అంతరాయం ఏర్పడింది.