సాధారణంగా జిడ్డు చర్మం కలవారు ఎంత అందంగా తయారయినా కొద్దిగా చెమట పట్టగానే ముఖం నునుపుదనం తగ్గిపోతుంది. ఇలాంటి వారు కొన్ని చిట్కాలను పాటించి ఈ సమస్య నుండి తప్పించుకోవచ్చు. ఆ చిట్కాలేమిటో చూద్దాం.
1. గింజలు తీసివేసిన టమోటా గుజ్జు పావు కప్పు, కీరదోస గుజ్జు ఒక టీస్పూను, ఓట్ మీల్ పొడి నాలుగు టీస్పూన్లు, పుదీనా మిశ్రమం ఒక టీస్పూను తీసుకుని బాగా కలిపి ముఖానికి ప్యాక్ లాగా వేసుకోవాలి. పూర్తిగా ఆరిన తరువాత చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా తరచూ చేయడం వలన చర్మంపై ఉండే జిడ్డు తొలగిపోయి కాంతివంతంగా అవుతుంది.
2. ఒక టీస్పూను తేనెకు గుడ్డులోని తెల్ల సొన, రెండు స్పూన్లు గ్లిజరిన్, కొద్దిగా శనగపిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని పదిహేను నిమిషముల తరువాత కడిగేయాలి. అలాగే అరకప్పు పుల్లని పెరుగును ముఖ చర్మానికి రాసుకుని సున్నితంగా మర్దనా చేయాలి. ఇరవై నిమిషముల తరువాత వేడి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వలన ముఖ చర్మం మృదువుగా మారుతుంది.
3. తేనె చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌లా పని చేస్తుంది. అరకప్పు ద్రాక్షాపండ్లు గుజ్జుకు మూడు టీస్పూన్ల నిమ్మరసం, ఒక టీ స్పూను యాపిల్ గుజ్జు, పావుకప్పు గుడ్డులోని తెల్లసొన కలపాలి. దీనిని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషముల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.