ఎడిసన్: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్).. న్యూజెర్సీలోని తెలుగు కళా సమితి(టీ ఫాస్)తో కలిసి తెలుగు సాహిత్యంలో చమత్కారం అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. తెలుగు సాహితీ ఉద్దండులు, తెలుగువేదకవి, శతకానందకారక, విచిత్ర కవి, పద్యవాద్య సృష్టికర్త, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ప్రముఖ కవి వడ్డేపల్లి కృష్ణ ఈ కార్యక్రమానికి విచ్చేసి తెలుగు సాహిత్య చమత్కారాలతో తెలుగు ప్రజలను కడుపుబ్బా నవ్వించారు.
వివిధ అంశాలపై జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అలవోకగా చెప్పిన శతకాలకు తెలుగు ప్రేక్షకులకు కరతాళధ్వనులతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. శతకాలను వన్స్ మోర్ అంటూ మరొక సారి చెప్పించుకుని తెలుగుసాహిత్య చమత్కారాన్ని ఆస్వాదించారు. తెలుగు భాష గొప్పతనాన్ని, మాధుర్యాన్ని జొన్నవిత్తుల, వడ్డేపల్లి కృష్ణ ఎంతో చక్కగా వివరించి.. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవశ్యకతను స్పష్టం చేశారు.
ప్రముఖ వీణా విద్వాంసులు ఫణి నారాయణ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేశారు. నాట్స్ మాజీ అధ్యక్షులు, నాట్స్ బోర్డు డైరెక్టర్ మోహన కృష్ణ మన్నవ, తెలుగు కళా సమితి అధ్యక్షులు సుధాకర్ ఉప్పల నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి న్యూజెర్సీలో తెలుగువారి నుంచి మంచి స్పందన లభించింది.
నాట్స్ జాయింట్ సెక్రటరీ రంజిత్ చాగంటి, తెలుగుకళా సమితి సెక్రటరీ మధు రాచకుళ్ల అతిథులకు సాదర స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను మోహన కృష్ణ మన్నవ వివరించారు. తెలుగు కళా సమితి చేపట్టే కార్యక్రమాలను సుధాకర్ ఉప్పల తెలిపారు. తెలుగు సాహిత్యం కోసం రెండు సంస్థలు కలిసి పనిచేస్తున్నాయని, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు అమెరికాలో కూడా పరిఢవిల్లేలా చేసేందుకు కృషి చేస్తున్నాయని రెండు సంస్థల నాయకులు తమ సందేశంలో పేర్కొన్నారు.
భావితరాలకు తెలుగు భాషను, సాహిత్య మధురిమలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు వారు తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి నాట్స్ నాయకత్వం నుంచి వంశీ వెనిగళ్ల, శ్రీహరి మందాడి,రంజిత్ చాగంటి, రమేష్ నూతలపాటి, శ్యాం నాలం, శేషగిరి కంభమ్మెట్టు, విష్ణు ఆలూరు, రాజేశ్ బేతపూడి, చందు ఉప్పాల, రమేశ్ బాబు కర్న తదితురులు హాజరయ్యారు.
అటు తెలుగు కళా సమితి నాయకత్వం నుంచి రేణు తాడేపల్లి, దాము గేదెల, ప్రమీలగోపు,జ్యోతి గండి, ఉషా దర్శిపుడి, ఆనంద్ పాలూరి, హరి ఇప్పనపల్లి, గురు అలంపల్లి, రామకృష్ణ ఏలేశ్వరపు తదితరులు హజరయ్యారు. దాదాపు 200మందికి పైగా స్థానిక తెలుగువారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తానా, సిలికానాంధ్ర మనబడి ప్రతినిధులు కూడా విచ్చేసి నాట్స్, తెలుగు కళా సమితి.. చేపట్టిన ఈ కార్యక్రమంపై ప్రశంసల వర్షం కురిపించారు.