జీలకర్రను జుట్టుకు అప్లై చేసి..?

శనివారం, 20 ఏప్రియల్ 2019 (10:37 IST)
చర్మం ఎంత ఆరోగ్యంగా ఉండాలో అదేవిధంగా జుట్టు కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలి. ఈ రెండింటిని కాపాడుకునేందుకు ఏవేవో మందులు, క్రీములు వాడుతుంటారు. వీటి వాడకం వలన సమస్య ఎక్కువైందే తప్ప కాస్త కూడా తగ్గుముఖం పడలేదని సతమతమవుతుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. ఇంట్లోని పదార్థాలతోనే వీటిని కాపాడుకునే అవకాశం చాలావరకూ ఉంది. మనం వంటల్లో వాడుకునే జీలకర్రలో ఔషధగుణాలు చాలా ఉన్నాయి. జీలకర్రతో మన జుట్టు, చర్మాన్ని ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకుందాం..
 
జుట్టు రాలిపోవడం ఓ పెద్ద సమస్య. ఇందుకు ఎన్నో మందులు వాడినా ఉపయోగం ఉండదు. అందుకు పరిష్కారంగా కూడా జీలకర్రను వాడొచ్చు. నిద్రకు ఉపక్రమించే ముందుగా జీలకర్ర నూనెను తలకు బాగా పట్టేలా రాసుకుని, ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి. ఇలా తరచు చేస్తుంటే.. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.
 
ముఖం మీద అలర్జీలు, కాలిన గాయాలు చేసే మచ్చలు చాలాకాలం పాటు ఉంటాయి. ఇలాంటప్పుడు జీలకర్ర మంచి ఔషధంగా పనిచేస్తుంది. నిద్రించే ముందుగా జీలకర్రను నీళ్లలో నానబెట్టుకోవాలి. ఉదయాన్నే లేచి దాన్ని పేస్ట్‌గా తయారుచేసుకుని ఆపై ముఖానికి, మెడకు అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల పాటు అలానే ఉండి ఆ తరువాత వెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కుంటే.. ముఖం తాజాగా మారుతుంది.
 
తరచు జుట్టు రాలిపోవడానికి మొదటి కారణం చుండ్రు. కాలుష్యం కారణంగా చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. మూడు స్పూన్ల జీలకర్రను ఓ 10 నిమిషాల పాటు నీటిలో ఉడికించాలి. ఈ మిశ్రమం చల్లబడ్డాక, దాన్ని జుట్టుకు పట్టించాలి. అప్పుడు జుట్టు నిగనిగలాడుతూ, ఆరోగ్యంగా ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అసలు నిద్రలో ఏం జరుగుతుందంటే..?