Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 29 April 2025
webdunia

క్రికెట్ వరల్డ్ కప్-2019: 1992 మాదిరిగా ఆడుతున్న పాక్... అప్పట్లాగే ఇప్పుడూ కప్ కొడుతుందా?

Advertiesment
World cup 2019
, మంగళవారం, 2 జులై 2019 (14:24 IST)
''మాటు వేసిన పులుల్లా తలపడండి. ఎందుకంటే, దానికి మించి ప్రమాదకరమైందేదీ లేదు''. 1992లో క్రికెట్ వరల్డ్ కప్ గెలిచేలా పాకిస్తాన్ జట్టులో స్ఫూర్తి రగిల్చేందుకు ఆ జట్టు కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పలికిన మాటలివి. ఆయన అన్నట్లుగానే పోరాడి, ఆస్ట్రేలియాలో జరిగిన ఆ టోర్నీలో పాక్ అనూహ్యంగా నెగ్గింది. ఆ టోర్నీలో పాక్ సాగించిన ప్రయాణం క్రికెట్ చరిత్రలోని గొప్ప విజయగాథల్లో ఒకటిగా నిలిచిపోయింది. 27 ఏళ్ల తర్వాత, ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ పాక్‌కు ప్రధానిగా ఉన్నారు.

 
ఇంగ్లండ్‌లో జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్‌లో పాక్ జట్టు కూడా మళ్లీ అప్పటి రోజులను గుర్తుచేస్తూ ఆడుతోంది. లీగ్ దశ మధ్యలో ఉన్నప్పుడు పాకిస్తాన్ పాయింట్స్ టేబుల్‌లో తొమ్మిదో స్థానంలో ఉంది. చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో భారీ ఓటమి ఎదుర్కొంది. కానీ, మరో నాలుగు మ్యాచ్‌ల తర్వాత ఆ జట్టు కథ పూర్తిగా మారిపోయింది. ఆతిథ్య ఇంగ్లండ్‌కు ఎసరుపెడుతూ పాక్ సెమీస్ రేసులోకి వచ్చింది.

 
అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌ను పాకిస్తాన్ ఆఖరి ఓవర్‌లో నెగ్గింది. ఈ విజయం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. 1992 వరల్డ్ కప్‌లో తొమ్మిది జట్లు ఉంటే, ప్రస్తుతం పది జట్లు ఉన్నాయి. 

 
1992లో పాకిస్తాన్ తొలి ఎనిమిది మ్యాచ్‌ల ఫలితాలు ఇవి: ఓటమి, గెలుపు, రద్దు, ఓటమి, ఓటమి, గెలుపు, గెలుపు, గెలుపు.

 
ఈ ఫలితాలతో ఆ జట్టు సెమీస్‌కు వెళ్లింది. అక్కడ న్యూజీలాండ్‌ను ఓడించింది. ఆ తర్వాత ఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయం సాధించి, కప్ అందుకుంది. ప్రస్తుత టోర్నీలో పాక్ తొలి ఎనిమిది మ్యాచ్‌ల ఫలితాలు కూడా అచ్చంగా 1992లానే ఉన్నాయి.

 
రెండు టోర్నీల్లోనూ పాక్ మొదటి మ్యాచ్‌ వెస్టిండీస్‌తోనే ఆడింది. ఆరంభంలో నెమ్మదించే అలవాటు వల్ల పాక్ ఆట ఇలా ఒకేలా ఉండొచ్చు. రెండేళ్ల క్రితం ఇంగ్లండ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో పాక్ 127 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.
14 రోజుల అనంతరం ఓవల్‌లో జరిగిన ఫైనల్‌లో అదే భారత్‌ను ఏకంగా 180 పరుగుల తేడాతో ఓడించి పాక్ టైటిల్ గెలిచింది.
webdunia
 
అదే పాకిస్తాన్ అంటే...
శనివారం ఉదయం హెడింగ్లీలో వెళ్తుంటే, వేల సంఖ్యలో పాక్ అభిమానులు వాళ్ల జాతీయ జెండాలు పట్టుకుని కనిపించారు. 'పాక్‌ను ఎన్నడూ తక్కువ అంచనా వేయకండి. మేం మళ్లీ పైకి లేస్తాం. లేస్తూనే ఉంటాం' అన్న వ్యాఖ్యతో ఓ బోర్డు కూడా కనిపించింది. చాలా మంది 1992 టోర్నీలోని పాక్ జట్టు జెర్సీలను తలపించే టీషర్టులు వేసుకుని కనిపించారు. పులి బొమ్మలున్న బ్యానర్లు, జెండాలను కూడా వాళ్లు ప్రదర్శించారు. 1992లో ఇమ్రాన్ పలికిన మాటలు ఇప్పుడు మళ్లీ వినిపిస్తున్నాయి.

 
1992లో పాక్ జట్టులో సభ్యుడిగా ఉన్న రమీజ్ రాజా కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. '1992లాగే ఇప్పుడు కూడా కొత్త హీరోలు వెలుగులోకి వస్తున్నారు. అప్పటి టోర్నీలో వసీం అక్రమ్ టాలెంట్ బయటపడింది. ఇప్పుడు బాబర్ ఆజం, షహీన్ అఫ్రీదీ లాంటి వారు అలాగే తెర మీదకి వచ్చారు. జట్టు చక్కగా ఉంది. నైపుణ్యం, స్ఫూర్తి, అభిమానుల మద్దతు.. పాక్‌కు అన్నీ ఉన్నాయి'' అని ఆయన అన్నారు.

 
పాక్ జట్టు ఎంపిక ఆదరబాదరగా జరిగింది. ఏళ్ల కొద్దీ ప్రణాళికలేవీ దీని వెనుక లేవు. వరల్డ్ కప్‌కు ముందు సన్నాహకంగా జరిగిన వన్డే సిరీస్‌లో పేసర్ మహమ్మద్ ఆమిర్‌కు జట్టులో చోటే లేదు. వరల్డ్ కప్‌కు తొలుత ఎంపిక చేసిన 15 మంది ఆటగాళ్ల జాబితాలోనూ అతడు లేడు. పరుగులు తీసేందుకు కష్టపడుతున్న షోయబ్ మాలిక్‌కూ జట్టులో చోటు దక్కింది. చాలా సమయం గడిచాక గానీ, వాహబ్ రియాజ్‌ను జట్టులో చేర్చలేదు.

 
టోర్నీలో ఎక్కువ వికెట్లు పడగొడుతున్న బౌలర్లలో ఆమిర్ కూడా ఒకడు. వాహబ్ కూడా అద్భుత స్పెల్స్ వేస్తున్నాడు. మాలిక్ స్థానంలోకి హారిస్ సొహైల్‌ను తీసుకువచ్చాక మిడిల్ ఆర్డర్ బలపడినట్లు కనిపిస్తోంది.

 
ఇంజమామ్ ఉల్ హఖ్
1992లో యువ ఆటగాడిగా పాక్ జట్టులో ఉన్న ఇంజమామ్ ఉల్ హఖ్ ఇప్పుడు ఆ జట్టుకు చీఫ్ సెలెక్టర్. అతడి సోదరుడి కుమారుడు ఇమామ్ ఉల్ హఖ్ ప్రస్తుత జట్టులో ఓపెనర్‌గా ఉన్నాడు. ఈ పోలికల గురించి పాక్ ఆటగాళ్లు, సిబ్బంది బయటకు పెద్దగా మాట్లాడటం లేదు. మ్యాచ్‌లోని ప్రతి క్షణాన్నీ ఆస్వాదించే అభిమానుల్లో మాత్రం 1992 వరల్డ్ కప్ స్ఫూర్తి అలాగే ఉందని పాక్ బౌలింగ్ కోచ్ అజహర్ మహమూద్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారం వెల‌గ‌బెడుతున్న‌ది వైకాపానా? తెదేపానా? : లోకేశ్