Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్రికెట్ వరల్డ్ కప్: పాకిస్తాన్ పనైపోయిందా, లేదా.. సెమీస్‌ అవకాశాలు ఎవరికి ఎలా

Advertiesment
క్రికెట్ వరల్డ్ కప్: పాకిస్తాన్ పనైపోయిందా, లేదా.. సెమీస్‌ అవకాశాలు ఎవరికి ఎలా
, సోమవారం, 1 జులై 2019 (18:42 IST)
క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్‌ను పాకిస్తాన్ అభిమానులు ఆసక్తిగా చూశారు. మ్యాచ్‌లో భారతే గెలవాలని ప్రార్థనలు కూడా చేశారు. ఎందుకంటే, మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓడితే వాళ్ల సెమీస్ అవకాశాలకు గండిపడుతుంది. అయితే, వారి ప్రార్థనలు ఫలించలేదు. వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ చేతుల్లోనే భారత్ తొలి పరాజయం చవిచూసింది. మరి, ఈ ఫలితంతో పాక్ సెమీస్ ఆశలపై నీళ్లు పడ్డాయా, పాక్‌కు ఇంకా సెమీస్ చేరే ఛాన్స్ ఉందా, ఏయే జట్లకు అవకాశాలు ఎలా ఉన్నాయంటే..

webdunia
పాకిస్తాన్‌కు ఇంకా సెమీస్ చేరే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో ఆ జట్టు 9 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. టోర్నీలో ఆ జట్టు ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్‌తో శుక్రవారం ఆ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో ఆ జట్టు తప్పకుండా నెగ్గాలి. అలా జరిగితే పాక్‌కు మొత్తంగా 11 పాయింట్లు ఉంటాయి. అప్పుడు ఇంగ్లండ్, న్యూజీలాండ్ మధ్య జరిగే మ్యాచ్ పాక్‌కు చాలా కీలకం అవుతుంది. ఈ మ్యాచ్‌లో న్యూజీలాండ్ గెలిస్తే నేరుగా పాక్ సెమీస్ చేరుకోవచ్చు. ఇంగ్లండ్ గెలిస్తే మాత్రం పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే.
 
ఎందుకంటే, అప్పుడు న్యూజీలాండ్, పాక్ పాయింట్లు సమం అవుతాయి. వీటిలో మెరుగైన నెట్ రన్‌రేట్‌ ఉన్న జట్టు సెమీస్ చేరుతుంది. కానీ, న్యూజీలాండ్ నెట్‌రన్ రేట్ (+0.572)ను అధిగమించడం పాక్ (-0.792)కు చాలా చాలా కష్టం.
 
భారత్...
భారత్ 11 పాయింట్లతో టేబుల్‌లో రెండో స్థానంలో ఉంది. ఇంకా టోర్నీలో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఒకటి బంగ్లాదేశ్‌తో, మరొకటి శ్రీలంకతో. ఇందులో ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా, భారత్ సెమీస్ చేరుతుంది. రెండూ ఓడిపోయినా, భారత్‌ సెమీస్ చేరే అవకాశాలే చాలా ఎక్కువ. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోతే భారత్‌కు.. పాక్, బంగ్లా మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచే జట్టుతో పాటు న్యూజీలాండ్‌ నుంచి సెమీస్ స్థానం కోసం పోటీ రావొచ్చు. ఆ రెండు జట్లలో ఏ ఒక్క దాని కన్నా నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్నా భారత్ సెమీస్‌కు వెళ్తుంది.
 
న్యూజీలాండ్
న్యూజీలాండ్‌ది కూడా భారత్ లాంటి పరిస్థితే. ఆ జట్టు కూడా 11 పాయింట్లతో టేబుల్‌లో మూడో స్థానంలో ఉంది. తమ చివరి మ్యాచ్‌ను ఇంగ్లండ్‌తో ఆడనుంది. ఇందులో గెలిస్తే న్యూజీలాండ్ నేరుగా సెమీస్ చేరుకుంటుంది. ఓడినా అవకాశాలు మెండుగానే ఉంటాయి. పాక్, బంగ్లా మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచే జట్టు కన్నా లేదా భారత్ కన్నా నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంటే చాలు.
 
ఇంగ్లండ్
10 పాయింట్లతో టేబుల్‌లో నాలుగో స్థానంలో ఉంది ఇంగ్లండ్. న్యూజీలాండ్‌తో ఆడే చివరి మ్యాచ్‌లో గెలిస్తే ఆ జట్టుకు సెమీఫైనల్ బెర్త్ పక్కా. ఓడితే మాత్రం పెద్ద ముప్పు పొంచి ఉంది. అలాంటప్పుడు బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ విజయం సాధిస్తే ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఒకవేళ బంగ్లాదేశ్ నెగ్గితే, ఆ తర్వాతి మ్యాచ్‌లో అదే జట్టు భారత్‌ చేతిలో ఓడిపోవాలి. అప్పుడే ఇంగ్లండ్ టోర్నీలో కొనసాగొచ్చు. అప్పుడు కూడా ఒకవేళ శ్రీలంక తమ తదుపరి రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే, నెట్ రన్ రేట్ విషయంలో ఆ జట్టు కన్నా ఇంగ్లండ్‌ మెరుగ్గా ఉండాలి.
 
బంగ్లాదేశ్
టేబుల్‌లో 7 పాయింట్లతో బంగ్లాదేశ్ ఆరో స్థానంలో ఉంది. మిగిలున్న రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు భారత్, పాకిస్తాన్‌లను ఢీకొట్టాల్సి ఉంది. ఈ రెండూ మ్యాచ్‌ల్లో గెలిస్తేనే బంగ్లాకు సెమీస్ చేరే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కూడా ఇంగ్లండ్‌పై న్యూజీలాండ్ గెలవాలి. ఒకవేళ ఇంగ్లండ్ గెలిస్తే.. న్యూజీలాండ్‌ కన్నా బంగ్లాదేశ్ మెరుగైన రన్ రేట్‌ను సాధించాల్సి ఉంటుంది. అది కష్టమే.
 
శ్రీలంక
శ్రీలంక 6 పాయింట్లతో టేబుల్‌లో ఏడో స్థానంలో ఉంది. టోర్నీలో మిగిలున్న రెండు మ్యాచ్‌ల్లో వెస్టిండీస్, భారత్‌లను ఆ జట్టు ఎదుర్కొంటోంది. ఈ రెండు మ్యాచ్‌లు గెలిచినా, శ్రీలంక సెమీస్ చేరే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఇంగ్లండ్‌పై న్యూజీలాండ్ గెలవాలి. బంగ్లాదేశ్ పాకిస్తాన్‌పై నెగ్గి, భారత్ చేతిలో ఓడిపోవాలి. ఇవన్నీ జరిగినా.. ఇంగ్లండ్ కన్నా మెరుగైన నెట్ రన్ రేట్ ఉంటేనే శ్రీలంకకు సెమీస్ బెర్తు దక్కుతుంది.
 
14 పాయింట్లతో టేబుల్‌లో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్‌లో చోటు ఖాయం చేసుకుంది. వరుసగా చివరి మూడు స్థానాల్లో ఉన్న దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్‌లు సెమీస్ రేసు నుంచి నిష్క్రమించాయి. సెమీఫైనల్స్‌లో టేబుల్‌లో మొదటి స్థానంలో ఉన్న జట్టు నాలుగో స్థానంలో ఉన్న జట్టును, రెండో స్థానంలో ఉన్న జట్టు మూడో స్థానంలో ఉన్న జట్టును ఢీకొంటాయి.
 
గమనిక: ఏవైనా కారణాలతో మ్యాచ్‌లు రద్దైతే పైన వివరించిన పరిస్థితుల్లో మార్పులు రావొచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్రీగా చికెన్ ఇవ్వలేదంటూ కోళ్లను చంపేశారు.. ఎక్కడ...?