Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరల్డ్ కప్ 2019 : నంబర్ 4పైనే ఆందోళన... తుస్‌మంటున్న తమిళ తంబి

వరల్డ్ కప్ 2019 : నంబర్ 4పైనే ఆందోళన... తుస్‌మంటున్న తమిళ తంబి
, శనివారం, 29 జూన్ 2019 (17:56 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీలు ఇంగ్లండ్ వేదికగా రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ మెగా ఈవెంట్‌లో లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. ముఖ్యంగా, భారత్ మాత్రమే మూడు మ్యాచ్‌లు ఆడాల్సివుండగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, ఆప్ఘనిస్థాన్ జట్లు మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సివుంది. సౌతాఫ్రికా మాత్రం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది.

ఈ క్రమంలో భారత్ - ఇంగ్లండ్ జట్ల అత్యంత కీలకమైన మ్యాచ్ బర్మింగ్ హామ్ వేదికగా ఆదివారం జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సెమీస్‌కు చేరే రెండో జట్టుకానుంది. అదేసమయంలో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు సెమీస్ దారులు మరింత సక్లిష్టంకానున్నాయి. ఎందుకంటే ఇంగ్లండ్ జట్టు ఒక్క మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. అందువల్ల ఇతర జట్ల జయాపజయాలపై ఇంగ్లండ్ సెమీస్ ఆశలు ఆధారపడివుంటాయి. అందుకే ఆదివారం జరిగే మ్యాచ్ ఇంగ్లండ్‌కు చావోరేవోగా మారింది.
 
అదేవిధంగా భారత్ ఈ మెగా ఈవెంట్‌లో ఇప్పటివరకు మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఐదు మ్యాచ్‌లలో విజయం సాధించింది. న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ మాత్రం వర్షం దెబ్బకు ఒక్క బంతికూడా పడకుండా రద్దు అయింది. ఫలితంగా భారత్ ఖాతాలో ప్రస్తుతం మొత్తం 11 పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పరంగా చూస్తే భారత్ సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకున్న రెండో జట్టుగా ఉంది. అయితే, ఇంగ్లండ్‌పై గెలిస్తే మాత్రం రారాజులా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంటుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, భారత్‌ను వేధిస్తున్న అసలు సమస్య మిడిల్ ఆర్డర్ ఫామ్‌లో లేకపోవడం. 
 
ఈ టోర్నీలో కోహ్లీ సేన ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడింది. వీటిలో విజయం సాధించిన ఐదు మ్యాచ్‌ల తీరును గమనిస్తే.. తొలి మూడు మ్యాచ్‌లు టాపార్డర్ (ఓపెనర్లిద్దరూ, కోహ్లీ) రాణించడం వల్ల విజయం సాధించాయి. తొలి, మూడు మ్యాచ్‌లలో రోహిత్ శర్మ సెంచరీ చేస్తే, రెండో మ్యాచ్‌లో శిఖర్ ధావన్ సెంచరీ చేశాడు. ఫలితంగా భారత్ సునాయాసంగా విజయం సాధించింది.

ఇక ఐదు, ఆరు (ఆప్ఘాన్, వెస్టిండీస్) మ్యాచ్‌లను పరిశీలిస్తే బౌలర్లు అద్భుతంగా రాణించడంతో గెలుపొందారు. ఈ రెండు మ్యాచ్‌లలో టాపార్డర్‌తో పూర్తిగా విఫలమైంది. మూడో నంబరుగా బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కోహ్లీ కొంతమేరకు రాణించాడు. కానీ నాలుగు, ఐదు డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగే విజయ్ శంకర్ (తమిళనాడు కుర్రోడు), మాజీ కెప్టెన్ ధోనీలు మాత్రం ఆశించిన మేరకు రాణించలేదు. 
 
ముఖ్యంగా, విజయ్ శంకర్‌పై సెలెక్టర్లు గంపెడాశలు పెట్టుకుని జట్టులోకి ఎంపిక చేశారు. విజయ్ శంకర్ కోసం హైదరాబాద్ సీనియర్ ఆటగాడు అంబటి రాయుడుకు మొండిచేయి చూపించారు. ఆల్‌రౌండర్ కావాలని భావించిన సెలెక్టర్లు విజయ్ శంకర్‌పై మొగ్గు చూపారు. కానీ, నాలుగో నంబరు బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగే విజయ్ శంకర్ ఇప్పటివరకు ఇటు బ్యాటు లేదా అటు బంతితో ఏమాత్రం రాణించలేదు.

దీంతో అతని స్థానంలో స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్లుగా ఎంపిక చేసిన దినేశ్ కార్తీక్ లేదా రిషబ్ పంత్‌లలో ఒకరిని తుది జట్టులోకి తీసుకుని నాలుగో స్థానంలో ఆడించాలని శ్రీకాంత్ వంటి మాజీ క్రికెటర్లు సలహా ఇస్తున్నారు. స్వదేశంలో జరిగిన ఐపీఎల్ పోటీల్లో రిషబ్ పంత్ అద్భుతంగా రాణించాడు. ఇదే ఐపీఎల్‌లో విజయ్ శంకర్ ఏమాత్రం పేలలేదు. దినేష్ కార్తీక్ కూడా ఐపీఎల్‌లో రాణించాడు. అందువల్ల పంత్ లేదా కార్తీక్‌లలో ఒకరిని జట్టులోకి తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. 
 
అయితే, కోహ్లీ మాత్రం విజయ్ శంకర్‌పై నమ్మకాన్ని ఉంచాడు. పైగా, రిషబ్ పంత్ వంటి ఆటగాడిని నాలుగో స్థానంలో ఆడించడం ఏమాత్రం మంచిది కాదని మరికొందరు ఆటగాళ్లు అంటున్నారు. ఓపెనర్లు విఫలైతే జట్టు బ్యాటింగ్ భారాన్ని మూడు, నాలుగు నంబర్ స్థానాల్లో క్రీజ్‌లోకి వచ్చే ఆటగాళ్లు మోయాల్సి ఉంటుందని అందువల్ల ఆ స్థానంలో దినేశ్ కార్తీక్ అయితే సరిపోతాడని ఇంకొదరు అంటున్నారు. మొత్తంమీద కోటి ఆశలతో జట్టులోకి తీసుకున్న తమిళనాడు ఆల్‌రౌండర్ విజయ్ పేలలేదనే విమర్శలు బాహాటంగానే వినొస్తున్నాయి. మరి ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఏ మేరకు రాణిస్తాడో వేచిచూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టార్ హోటళ్ళలో ఫోటోలు తీసిన ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు?