Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లు కావాలని కొందరు నేతలు ఎందుకు అంటున్నారు?

Advertiesment
ys jagan

బిబిసి

, గురువారం, 20 జూన్ 2024 (14:36 IST)
ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లనే ఉపయోగించడం మంచిదని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ట్వీట్ చేశారు. "ప్రపంచవ్యాప్తంగా దాదాపు అభివృద్ధి చెందిన ప్రతీ ప్రజాస్వామ్య దేశంలో నిర్వహించే ఎన్నికల పద్ధతుల్లో ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్‌లు ఉపయోగిస్తున్నారు. మన ప్రజాస్వామ్య నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకుంటూ మనం కూడా అదే దిశగా పయనించాలి" అని వైఎస్ జగన్ జూన్ 18న ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అయితే ఐదేళ్ల క్రితం ఈవీఎంలపై జగన్ స్పందన మరోలా ఉంది.
 
2019 ఎన్నికల్లో వైసీసీ 151 సీట్లు గెలిచి, అధికారం చేజిక్కించుకుంది. ఈవీఎంల వినియోగాన్ని సమర్థిస్తూ వైఎస్ జగన్ మాట్లాడారు. “ఈవీఎంలో నొక్కిన ఓటు ఏ పార్టీకి వెళ్లిందో ఓటరుకు కనిపిస్తుంది. నేను పోలింగ్ బూత్‌లోకి పోయి ఫ్యాన్ గుర్తుకు ఓటేశా, కానీ వీవీప్యాట్‌లో సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఊరుకుంటానా? అక్కడే గొడవ చేస్తా కదా. అలా జరగలేదు. కౌంటింగ్ కేంద్రాలలో కూడా అన్ని పార్టీల పోలింగ్ ఏజెంట్లు ఈవీఎంలను చెక్ చేస్తారు. మరి ఏ రకంగా ఈవీఎంలు బాగోలేవని చెప్తారు. ఓడిపోతే ఈవీఎంల మీద నెపాన్ని నెట్టడం సరికాదు” అని 2019లో జగన్ అన్నారు. అప్పట్లో ఫలితాల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు.
 
ఆ ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఇలా ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు ఈవీఎంలపై నెపాన్ని నెట్టడం తరచూ కనిపిస్తోంది. ఈ పరిస్థితి ఏపీలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. అయితే, ఈవీఎంలను హ్యాక్ చేయడం లేదా, అందులో ఉన్న ఫలితాలను తారుమారు చేయడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం తరచూ చెబుతూనే ఉంది.
 
మహారాష్ట్రలో కూడా..
ఏపీతో పాటు మహారాష్ట్రలో కూడా ఈవీఎంల వినియోగంపై వివాదం రాజుకుంది. ముంబయి వాయువ్య లోక్‌సభ నియోజకవర్గం స్థానం నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికైన రవీంద్ర వాయకర్, ఆయన బంధువులపై కేసు నమోదైంది. ఈవీఎంలకు అనుసంధానించిన మొబైల్ ఫోన్‌ను ఉపయోగించారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. లోక్‌సభ ఎన్నికల్లో శివసేనకు చెందిన రెండు వర్గాలు ఈ స్థానం నుంచి పోటీ చేయగా ఏక్‌నాథ్‌ శిందే వర్గానికి చెందిన రవీంద్ర వాయకర్ 48 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. ఇప్పుడు ఆయన గెలుపుపై వివాదం నెలకొంది.
 
జూన్‌ 4న ఇక్కడి నెస్కో కౌంటింగ్‌ కేంద్రంలోని ఈవీఎంను అన్‌లాక్‌ చేయడానికి రవీంద్ర బావమరిది మంగేశ్‌ పాండిల్కర్‌ మొబైల్‌ ఫోన్‌ను ఉపయోగించారని ఆరోపణలు వచ్చాయి. ఆ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీకి పంపించారు. మంగేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘ఈవీఎం అన్‌లాక్‌ చేయడానికి ఓటీపీ అవసరం లేదు. ఇది ప్రోగ్రామింగ్‌ చేసిన యంత్రం కాదు. అలాగే ఇది ఎలాంటి వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ సామర్థ్యాలను కలిగి ఉండదు.” అని ముంబయి వాయువ్య లోక్‌సభ స్థానం రిటర్నింగ్‌ అధికారి వందన సూర్యవంశీ అన్నారు.
 
కాగా, ఈవీఎంలను ట్యాపరింగ్ లేదా హ్యాకింగ్‌ చేయలేమని సీనియర్ ఐటీ నిపుణులు ఉమా మహేష్ అంటున్నారు. “క్యాలిక్యులేటర్‌లో ఎటువంటి కమ్యూనికేషన్ చిప్ ఉండదు. దీనిని రిమోట్‌గా ట్యాంపర్ చేయలేరు. అలాగే పోలింగ్ రోజున అయా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో మాక్ పోలింగ్ జరుగుతుంది. అక్కడ ఎవరు మోసం చేయలేరు. పోలింగ్ తర్వాత ఈవీఎంలను సీల్ చేసి స్ట్రాంగ్ రూంలకు తరలిస్తారు. అక్కడ కూడా ట్యాంపరింగ్‌కు అవకాశం ఉండదు. ఫిజికల్‌గా ఈవీఎంలను పట్టుకుని, అందులో ఏదైనా చిప్ పెట్టగలిగితే తప్ప...ఈవీఎంలను కూడా క్యాలిక్యూలేటర్ల మాదిరే ట్యాంపరింగ్ లేదా హ్యాకింగ్ చేయలేం” అని ఉమా మహేశ్ అన్నారు.
 
ఎలాన్ మస్క్‌కు పురందేశ్వరీ కౌంటర్
ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశముందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా చెప్పారు. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. ఈవీఎంలను హ్యాక్ చేయాలని ఎలాన్ మస్క్‌ను భారత ఎన్నికల సంఘం ఆహ్వానించాలని, ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయవచ్చో నిరూపించేందుకు ఆయనకు ఓ అవకాశం ఇవ్వాలని ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈవీఎంలపై పరిశోధనలకు ఎన్నికల సంఘం చాలామందికి అవకాశం ఇచ్చిందని, కానీ ఎవరూ హ్యాక్ చేయలేకపోయారని పురందేశ్వరి తెలిపారు.
 
రాహుల్ కామెంట్స్...
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఈవీఎంలపై వ్యాఖ్యానించారు. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు రేకెత్తుతున్నవేళ వాటికి పారదర్శకత ఉండేలా చూడాలని, లేని పక్షంలో ఎన్నికల్లో ఈవీఎంల వాడకం ఆపేయాలని సూచించారు. ఈవీఎంలు బ్లాక్ బాక్సుల వంటివని రాహుల్ గాంధీ ఎక్స్‌లో తెలిపారు.
ఈవీఎంల వినియోగంపై వివాదాలున్నాయని మాజీ ఐఎస్ అధికారి ఈఏఎస్ శర్మ బీబీసీతో అన్నారు.
 
''ఓటరు ఓటు వేసేటప్పుడు ఎవరికి పడిందనేదానికి వీవీ ప్యాట్ మాత్రమే ఆధారం. ఆ వీవీ ప్యాట్ కూడా ఒకరు తయారు చేసిన ప్రోగ్రాంపైనే ఆధారపడి ఉంటుంది. అలా కాకుండా ఓటు వేసిన వెంటనే డైరెక్టుగా ప్రూప్ కావాలి. కౌంటింగ్‌కు ఎక్కువ సమయం కేటాయిస్తే బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ నిర్వహించడమే మంచిది'' అని శర్మ అభిప్రాయపడ్డారు.
 
ఈవీఎంల చరిత్ర ఇదీ..
1979లో ప్రొటో టైప్ ఈవీఎంను హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, 1980లో మెక్రో కంప్యూటర్ ఆధారంగా పని చేసే ఈవీఎంను బెంగళూరులోని భారత ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ తయారు చేశాయి.
భారత దేశ ఎన్నికల్లో 1982లో ఈవీఎంల ప్రస్థానం మొదలైంది. కేరళలోని పరూర్‌ అసెంబ్లీ స్థానానికి 1982 మే 19న జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలను ఉపయోగించారు.
1984లో ఈవీఎంలపై ఆరోపణలు వచ్చాయి, వాటి వినియోగంపై ఎటువంటి చట్టం లేదని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం 1989లో ప్రజాప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ 61-ఏని చేర్చింది.
1998లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, దిల్లీలలో 25 అసెంబ్లీ స్థానాలకు, 1999లో 45 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించారు.
అలా క్రమంగా ఈవీఎంల వినియోగం పెరగడంతో 2004 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ స్థానాలలో వాటిని వినియోగించారు.
ఎన్నికల్లో తిరిగి బ్యాలెట్ విధానాన్నే అనుసరించాలనే పిటిషన్‌ను సుప్రీంకోర్టు 2019లో తిరస్కరించింది.
 
ఈవీఎంల వినియోగంపై తరచూ ఆరోపణలు రావడంతో పారదర్శకత కోసం ఎవరికి ఓటు వేశామో, కనిపించే విధంగా వీవీ ప్యాట్ కూడా అందుబాటులోకి వచ్చింది.
విద్యుత్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలలో కూడా ఈవీఎంలను వినియోగించేందుకు వీలుగా బ్యాటరీ ఆధారంగా కూడా ఇవి పని చేసేలా రూపొందించారు.
 
హ్యాకింగ్ లేదా ట్యాంపరింగ్ చేయవచ్చా?
ఈ విషయంలో భిన్నవాదనలు ఉన్నాయి. కొందరు హ్యాకింగ్‌ సాధ్యమేనని చెబుతుంటే.. మరికొందరు అది సాధ్యం కాదని వాదిస్తుంటారు. ప్రభుత్వం కూడా ఈవీఎంలను హ్యాక్‌ చేయడం లేదా ట్యాంపర్‌ చేయడం వీలు కాదని చెబుతోంది. అయితే ఈవీఎంలను హ్యాకింగ్ చేయవచ్చునని ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ వీవీ రావు బీబీసీతో అన్నారు.
 
“ఆధారాలు దొరకని దొంగతనమే ఈవీఎంల హ్యాకింగ్. ముఖ్యంగా డిజిటల్ రూపంలో ఉన్న ఇన్ఫర్మేషన్ అధికారిక సమాచారానికి పనికి రాదు. అటువంటప్పుడు ఈవీఎంలను ఎలా నమ్ముతారు. అధికారంలో ఉన్నవారే కాదు విపక్షంలో ఉన్నవారు కూడా హ్యాకింగ్ చేయవచ్చు. ఎన్నికలు రెండు నెలలు నిర్వహిస్తున్నప్పుడు... కౌంటింగ్ కోసం వారం రోజులు సమయం కేటాయిస్తే తప్పేముంది.” అని వీవీ రావు బీబీసీతో చెప్పారు. నెట్ ఇండియా గ్రూప్ ఎండీ హరిప్రసాద్ కూడా ఈవీఎంలను హ్యక్ చేయడానికి అవకాశముందని బీబీసీతో చెప్పారు.
 
“ఎలక్ట్రానిక్స్‌తో ఏదైనా సాధ్యమే. హ్యాకింగ్‌కు అవకాశమున్నప్పుడు ఈవీఎంలను ఎందుకు వాడాలి? ఈవీఎంలనే వాడాలని అనుకుంటే ఓటు ఎవరికి వేశారనే ఒక్క విషయం తప్ప... మిగతావన్ని అంటే డిజైన్, వాడిన పరికరాలు, పని చేసే విధానం అన్ని విషయాలను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి” అని ఆయన తెలిపారు. వీళ్లు చెప్పిన విషయాలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
 
ఎన్నికల సంఘం ఏమంటోంది?
ఈవీఎంల వినియోగం మొదలైనప్పటీ నుంచి వాటిపై వివాదాలు, వినియోగంపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. వీటిపై ఎలక్షన్ కమిషన్ స్పందిస్తూ... ఈవీఎంలను ఎవరు హ్యాకింగ్ చేయలేరని చెబుతోంది. బయట నుంచి అంటే దూరంగా ఉంటూ ఈవీఎం ప్రోగ్రాంను డిస్టర్బ్‌ చేయలేరు. ఏం చేసినా ఫిజికల్‌గానే చేయాలి. అలా చేయాలంటే ఈసీ సిబ్బంది, పార్టీ నేతలు, ఏజెంట్ల ముందే చేయాలి. అలా చేయడం కుదరదు కాబట్టి ఈవీఎం హ్యాక్‌ అనేది రాజకీయ విమర్శలు చేసుకోవడానికి తప్ప దేనికి పనికి రాదని ఈసీ అంటోంది.
 
ఇండియాలో ఈవీఎంలు ఏ నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయ్యి ఉండవు. ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ ఉండదు. రీ ప్రోగ్రామ్‌ చేసే అవకాశమే ఉండదని ఎలక్షన్ కమిషన్ చెబుతోంది. “ఓడిపోయిన పార్టీలు, నాయకులు ఈవీఎంలపై ఆరోపణలు చేయడం పరిపాటిగా మారింది. 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు కరెక్టుగానే పని చేశాయని చెప్పి, ఇప్పుడు 11 సీట్లు గెలిచినప్పుడు మాత్రం అవి సరిగా పని చేయలేదని చెప్పడం సరి కాదు. గతంలో చంద్రబాబు కూడా ఈవీఎంలపై విమర్శలు చేశారు. కానీ ఆయనకు 160 సీట్లు వచ్చేసరికి ఈవీఎంలపై మాట్లాడటం లేదు. ఈవీఎంల వాడకంపై ఏ పార్టీకైనా ఒకే విధానం ఉంటే దానిని ప్రజలు నమ్ముతారు, ఫలితాన్ని బట్టి ఈవీఎంలపై వ్యాఖ్యాలు చేయడం సరికాదు” అని పొలిటికల్ అనలిస్ట్ ఊహ మహంతి అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రుషికొండలో ఉండాల్సిన ఖర్మ జగన్‌కి లేదు- కొడాలి నాని