Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"న్యాయం జరగడం మాత్రమే కాదు.. కనిపించాలి" ... జగన్ సంచలన ట్వీట్!!

Advertiesment
ys jagan

వరుణ్

, మంగళవారం, 18 జూన్ 2024 (09:53 IST)
దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం)పై విమర్శలు వస్తున్న వేళ మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పత్రాలను వినియోగించాలంటూ ఆయన ట్వీట్ చేసారు. నిజానికి గత ఎన్నికల్లో ఆయన పార్టీ ఏకంగా 151 సీట్లను గెలుచుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈవీఎంల పనితీరుపై ఆయన ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. కానీ, తాజాగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీ చిత్తుగా ఓడిపోయి కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. 
 
టీడీపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ఏకంగా 164 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ఘోర ఓటమిని జగన్‌తో పాటు ఆయన పార్టీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఈవీఎంలను హ్యాకింగ్ చేయొచ్చంటూ చేసిన వ్యాఖ్యలు భారత్‌లో వివాదాస్పదమయ్యాయి. ఇపుడు ఈ వ్యాఖ్యలను జగన్ సమర్థిస్తూ ట్వీట్ చేశారు. ఈవీఎంలపై నమ్మకం సన్నగిల్లుతున్న వేళ పేపర్ బ్యాలెట్లు ఉపయోగించడం మంచిందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
"న్యాయం జరగడం మాత్రమే కాదు.. కనిపించాలి. అలాగే ప్రజాస్వమ్యం బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా కనిపించాలి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అభివృద్ధి చెందిన ప్రతీ ప్రజాస్వామ్య దేశంలో నిర్వహించే ఎన్నికల పద్దతుల్లో ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పత్రాలను ఉపయోగిస్తున్నారు. మన ప్రజాస్వామ్య నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి" అని జగన్ ట్వీట్ చేశారు. 
 
ఈవీఎం హ్యాకింగ్... నిరూపించేందుకు ఎలాన్ మస్క్‌ను ఆహ్వానించాలి : పురంధేశ్వరి
 
ఎన్నికల సమయంలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)లు హ్యాకింగ్ చేయొచ్చంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా, మన దేశంలోని పలువురు అగ్ర రాజకీయ నేతలు ఎలాన్ మస్క్ వ్యాఖ్యలను సమర్థిస్తుంటే, భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం కొట్టిపారేస్తున్నారు. ఇలాంటి వారిలో బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఉన్నారు. ఈవీఎం‌ను ఎలా హ్యాకింగ్ చేస్తారో నిరూపించేందుకు ఎలాన్ మస్క్‌ను ఆహ్వానించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆమె సూచించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చంటున్న మస్క్‌ను భారత ఎన్నికల సంఘం ఆహ్వానించాలని కోరుతున్నాం. ఈవీఎంలను ఎలాహ్యాక్ చేయవచ్చో నిరూపించేందుకు ఆయనకు ఓ అవకాసం ఇవ్వాలంటూ ఆమె సెటైర్లు వేశారు. ఈవీఎంలపై పరిశోధనలకు ఎన్నికల సంఘం చాలా మంది అవకాశం ఇచ్చిందని, కానీ ఎవరూ హ్యాక్ చేయలేకపోయారని పురంధేశ్వరి గుర్తు చేశారు. 
 
కాగా, ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని ప్రపంచ దేశాలు బహిష్కరించాలని, కొంతమేర ఈవీఎంలను హ్యాకింగ్ చేసే అవకాం ఉందని, మనుషులు కానీ, ఏఐ టూల్స్‌తో కానీ ఈవీఎంలను హ్యాకింగ్ అసాధ్యమేమీ కాదని ఎలాన్ మస్క్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు భారత్‌లో పెను దుమారమే రేపాయి. మస్క్ వ్యాఖ్యలు ఇండియా కూటమి నేతలకు ఓ ఆయుధంలా మారాయి. భారత్‌లో ఈవీఎంలు బ్లాక్ బాక్స్‌ల వంటివని వాటిని కనీసం పరిశీలించేందుకు కూడా ఎవరినీ అనుమతించరని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు బీజేపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈవీఎంలు వద్దు.. పేపర్ బ్యాలెట్‌‌లే ముద్దు.. ఏపీ మాజీ సీఎం జగన్