Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అటల్ బిహారీ వాజ్‌పేయి మాటల్ని జవహర్‌లాల్ నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?

atal bihari vajpayee
, మంగళవారం, 16 ఆగస్టు 2022 (16:24 IST)
లోక్‌సభ మాజీ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్ ఓ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంగ్లిష్‌లో హీరేన్ ముఖర్జీ, హిందీలో అటల్ బిహారీ వాజ్‌పేయిని మించిన వక్తలు లోక్‌సభలో మరెవరూ లేరని అన్నారు. వాజ్‌పేయికి దగ్గరి మిత్రుడైన అప్పా ఘటాటే.. వాజ్‌పేయి ముందు ఈ విషయం ప్రస్తావించగా, ఆయన గట్టిగా నవ్వి, "మరైతే నన్ను ఎందుకు మాట్లాడనివ్వరు" అన్నారు. నిజానికి ఆ రోజుల్లో వాజ్‌పేయి బ్యాక్ బెంచర్‌గానే ఉండేవారు. అయితే ఆనాటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ మాత్రం వాజ్‌పేయి లేవనెత్తే అంశాలను చాలా శ్రద్ధగా వినేవారు.

 
ఓసారి భారత పర్యటనకు వచ్చిన బ్రిటిష్ ప్రధానమంత్రికి వాజ్‌పేయిని పరిచయం చేయిస్తూ నెహ్రూ.. "ఈయన ఎదుగుతున్న విపక్ష నాయకుడు. ఎప్పుడూ నన్ను విమర్శిస్తుంటారు. అయితే నా దృష్టిలో చాలా భవిష్యత్తు ఉన్న నాయకుడు" అని అన్నారని కింగ్షుక్ నాగ్ తన 'అటల్ బిహారీ వాజ్‌పేయి - ఎ మ్యాన్ ఫర్ ఆల్ సీజన్స్' అనే పుస్తకంలో రాశారు.

 
మాయమైన నెహ్రూ చిత్రపటం
మరో సందర్భంలో మరో విదేశీ అతిథికి వాజ్‌పేయిని ‘భవిష్యత్తులో ప్రధాని కాగల వ్యక్తి’గా కూడా నెహ్రూ పరిచయం చేశారు. 1977లో వాజ్‌పేయి విదేశాంగ మంత్రిగా పదవీ స్వీకారం చేశాక, సౌత్ బ్లాక్‌లోని తన కార్యాలయానికి వెళ్లగా అక్కడ గోడపై ఉండాల్సిన నెహ్రూ చిత్రపటం లేకపోవటాన్ని గమనించారు. వెంటనే ఆయన నెహ్రూ చిత్రపటం ఎక్కడని తన కార్యదర్శిని అడిగారని కింగ్షుక్ నాగ్ చెప్పారు. నిజానికి అక్కడ ఆ చిత్రపటం ఉండటం వాజ్‌పేయికి నచ్చకపోవచ్చునని భావించి అధికారులు దానిని అక్కడి నుంచి తొలగించారు. అయితే వెంటనే ఆ చిత్రపటాన్ని తీసుకొచ్చి అది ఎక్కడ ఉండేదో అక్కడే దానిని ఉంచాలని ఆయన ఆదేశించారు.

 
webdunia
లోక్‌సభ ప్రసంగాల కోసం కసరత్తు
"ఏదో ఒక రోజున నేను ఈ గదిలో కూర్చుంటానని కలలో కూడా అనుకోలేదు." వాజ్‌పేయి ఆ కుర్చీలో కూర్చున్న వెంటనే ఆయన నోటి వెంట ఈ మాటలు వెలువడ్డట్టు ఆ సమయంలో అక్కడున్న వారు చెప్పారు. విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నెహ్రూ కాలం నాటి విదేశాంగ విధానంలో ఎలాంటి మార్పూ చెయ్యలేదు. బహిరంగ సభల కోసం వాజ్‌పేయి ప్రత్యేకంగా సిద్ధమయ్యేవారు కాదని ఆయన వ్యక్తిగత కార్యదర్శి శక్తి సిన్హా తెలిపారు. కానీ లోక్‌సభ ప్రసంగాల కోసం మాత్రం ఆయన చాలా కసరత్తు చేసేవారు. ''ఇందుకోసం ఆయన రాత్రి చాలా పొద్దు పోయేవరకు పార్లమెంటరీ లైబ్రరీలోని పుస్తకాలు, పత్రికలు అన్నిటినీ తిరగేసేవారు. పాయింట్లు నోట్ చేసుకునేవారు. మొత్తం ప్రసంగాన్ని రాసుకునేవారు కాదు కానీ మరుసటి రోజు సభలో ఏం మాట్లాడాలనేది ఆయన మెదడులో ఉండేది'' అని సిన్హా తెలిపారు.

 
మీ అంత బాగా మాట్లాడలేను: ఆడ్వాణీ
అంత అద్భుతంగా మాట్లాడగలిగే వాజ్‌పేయి ఆగస్టు 15న మాత్రం ఎందుకు ముందుగా సిద్ధం చేసుకున్న రాతప్రతిని చదివేవారని నేను సిన్హాను ప్రశ్నించాను. ఎర్రకోట నుంచి ఎలాంటి పొరబాటు మాట మాట్లాడకూడదనే ఆయన ముందుగా రాసి పెట్టుకున్న ప్రసంగాన్ని చదివేవారని సిన్హా జవాబిచ్చారు. ఆ ప్రదేశానికి ఆయన అంతటి ప్రత్యేక గౌరవం ఇచ్చేవారు. ‘‘మీరు మామూలుగా మాట్లాడే విధంగానే మాట్లాడండి అని మేం ఆయనకు చాలాసార్లు చెప్పే వాళ్లం. కానీ ఆయన మా మాట వినేవారు కాదు. అయితే ఆయన ఎవరో రాసి ఇచ్చిన ప్రసంగాన్ని చదివేవారు కాదు. మేం ఆయనకు చాలా సమాచారాన్ని సేకరించి ఇచ్చేవాళ్లం. ఆయన వాటిని తనదైన శైలిలోకి మార్చుకుని చదివేవారు.’’ అని సిన్హా తెలిపారు.

 
వాజ్‌పేయికి చాలా సన్నిహితులైన ఎల్ కే ఆడ్వాణీ వాజ్‌పేయి ప్రసంగం విని తాను ఆత్మన్యూనతకు లోనయ్యే వాణ్నని తెలిపారు. ''వాజ్‌పేయి నాలుగేళ్ల పాటు భారతీయ జన్‌సంఘ్‌కు జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో ఆయన నన్ను అధ్యక్షుడిగా ఉండమని కోరారు. అయితే నేను అందుకు నిరాకరించాను. వేలాది మంది ఎదుట నేను మీలాగే మాట్లాడలేనని చెప్పాను. నువ్వు పార్లమెంట్‌లో బాగానే మాట్లాడతావే అని ఆయన అన్నారు. పార్లమెంట్‌లో మాట్లాడ్డం వేరే, ప్రజల ముందు మాట్లాడ్డం వేరే అని నేనన్నాను. తర్వాత పార్టీ అధ్యక్షుణ్ని అయినా, నేను ఎన్నడూ వాజ్‌పేయిలాగ మాట్లాడలేననే భావన మాత్రం అలాగే ఉండిపోయింది'' అని ఆడ్వాణీ తెలిపారు.

 
అంతర్ముఖి, బిడియస్తులు
వేలాదిమందిని తన ప్రసంగంతో ఆకట్టుకోగలిగిన వాజ్‌పేయి, నిజజీవితంలో మాత్రం చాలా అంతర్ముఖులు, బిడియస్తులు. ఆయన చుట్టూ ఓ నలుగురైదుగురు చేరితే ఆయన నోటి నుంచి చాలా తక్కువ మాటలు వచ్చేవని శక్తి సిన్హా తెలిపారు. కానీ ఇతరుల మాటల్ని మాత్రం ఆయన చాలా శ్రద్ధగా ఆలకించేవారు. వాటిపై చాలా ఆలోచించి, ప్రతిస్పందించేవారు. కొద్దిమంది మిత్రుల సమక్షంలో ఆయన స్వేచ్ఛగా సంభాషించినా, వాటిలో చప్పట్లు చరిచేంత గొప్ప మాటలు ఉండేవి కావు.
1978లో వాజ్‌పేయి మొదటిసారి విదేశాంగ మంత్రిగా పాకిస్తాన్‌కు వెళ్లినపుడు అక్కడ ఆయన ఉర్దూలో చాలా బాగా ప్రసంగించారని మణి శంకర్ అయ్యర్ గుర్తు చేసుకున్నారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఆఘా షాహీ చెన్నైలో జన్మించారు. ఆయనకు వాజ్‌పేయి చేసిన ఉర్దూ ప్రసంగం అర్థం కాలేదు.

 
స్కూటరెక్కిన వాజ్‌పేయి
ఒకసారి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ న్యూయార్క్‌లో వాజ్‌పేయితో మాట్లాడుతున్నారు. మరికొంచెం సేపటి తర్వాత వాళ్లిద్దరూ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించాల్సి ఉంది. సంభాషణ ముగిస్తే తాను ప్రసంగానికి వెళతానని వాజ్‌పేయి షరీఫ్‌కు చిట్టీ పంపారు. చిట్టీ చూసిన నవాజ్ షరీఫ్ వాజ్‌పేయితో, ''ఇది విన్నపమా లేక ఆజ్ఞా?'' అన్నారు. దానికి నవ్వుతూ వాజ్‌పేయి విన్నపమే అన్నారు. వాజ్‌పేయి చాలా నిరాడంబరులు, కలివిడి స్వభావం కలిగినవారు.

 
కింగ్షుక్ తన పుస్తకంలో వాజ్‌పేయి నిరాడంబరతను ప్రస్తావిస్తూ ఓ సంఘటనను వివరించారు: ఒకసారి ప్రఖ్యాత జర్నలిస్ట్ హెచ్ కే దువా ప్రెస్ క్లబ్‌లో జరుగుతున్న సమావేశానికి తన స్కూటర్ పై వెళుతున్నారు. దువా అప్పుడు యువకుడు. ఆ సమావేశంలో వాజ్‌పేయి ప్రసంగించాల్సి ఉంది. ఆయన స్కూటర్‌పై వెళుతుండగా... జనసంఘ్ అధ్యక్షుడు వాజ్‌పేయి ఒక ఆటోను ఆపే ప్రయత్నంలో ఉన్నారు. దువా తన స్కూటర్‌ను ఆపి, ఎందుకు ఆ పని చేస్తున్నారని ప్రశ్నించారు. తన కారు చెడిపోయిందని వాజ్‌పేయి సమాధానమిచ్చారు. దానికి దువా 'మీకు అభ్యంతరం లేకుంటే నా స్కూటర్ వెనకాల కూర్చోండి' అని అడగ్గా, దానికి ఆయన అంగీకరించారు. దాంతో ఇద్దరూ స్కూటర్ మీద ప్రెస్ క్లబ్‌కు వెళ్లారు.

 
‘నవ్వుతూ నిర్లక్ష్యాన్ని క్షమించేశారు’
శివ కుమార్ 47 ఏళ్ల పాటు వాజ్‌పేయితో పాటు కలిసి ఉన్నారు. ఆయన వాజ్‌పేయికి ప్యూన్, వంటవాడు, బాడీగార్డ్, కార్యదర్శి. వాజ్‌పేయి ఎన్నడైనా కోపంగా ఉన్నారా అని నేను ప్రశ్నించినపుడు, ఆయనో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ''ఆ రోజుల్లో నేను ఆయనతో పాటు 1, ఫిరోజ్ షా రోడ్‌లో ఉండేవాణ్ని. ఆయన బెంగళూరు నుంచి దిల్లీకి తిరిగి వస్తున్నారు. నేను ఎయిర్ పోర్టుకు వెళ్లి ఆయనను తీసుకు రావాలి. జనసంఘ్ నేత జేపీ మాథూర్ నాతో, 'పద! వెళ్లి రీగల్‌లో ఓ ఇంగ్లీష్ సినిమా చూసొద్దాం' అన్నారు. చిన్న సినిమా, తొందరగా ముగుస్తుంది అన్నారు. ఆ రోజుల్లో బెంగళూరు నుంచి విమానాలు రోజూ ఆలస్యంగా వస్తుండేవి. దాంతో నేను మాథూర్‌తో కలిసి సినిమాకు వెళ్లాను.''

 
‘'అయితే సినిమా చాలా పెద్దది. దానికి తోడు ఆ రోజు బెంగళూరు ఫ్లయిట్ సమయానికే ల్యాండ్ అయింది. నేను ఎయిర్ పోర్టుకు వెళ్లేసరికి ఫ్లయిట్ దిగి చాలా సేపయిందని చెప్పారు. ఇంటి తాళం నా దగ్గరే ఉండింది. నేను దేవుళ్లందరినీ తల్చుకుంటూ, ఇంటికి చేరుకున్నా.’’ ‘‘వాజ్‌పేయి తన సూట్ కేసు పట్టుకుని లాన్‌లో తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్లావని నన్ను ప్రశ్నించారు. నేను సందేహిస్తూ, సినిమాకు వెళ్లా అని అన్నా. వాజ్‌పేయి నవ్వుతూ 'నన్ను కూడా తీసుకెళ్లాల్సింది' అన్నారు. 'సరేలే, రేపు వెళదాం' అన్నారు. నిజానికి ఆయన కోప్పడి ఉండవచ్చు. కానీ ఆయన నా నిర్లక్ష్యాన్ని కూడా నవ్వుతూ క్షమించేశారు.''

 
మిఠాయిలు ఆయన బలహీనత
వాజ్‌పేయి భోజనప్రియులు. వంట చేయడమన్నా ఆయనకు చాలా ఇష్టం. మిఠాయిలు ఆయన బలహీనత. రబ్రీ, ఖీర్, మాల్పువా ఆయనకు చాలా ఇష్టం. ఎమర్జెన్సీ సమయంలో ఆయన బెంగళూరు జైలులో ఉన్నపుడు ఆడ్వాణీ, శ్యామనందన్ మిశ్రా, మధు దండావతేలకు ఆయన స్వయంగా వంట వండేవారు. ''ఆయన ప్రధానిగా ఉన్నపుడు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు జనం ప్రవాహంలా వచ్చేవారు. వాళ్ల కోసం రసగుల్లా, సమోసాలు మొదలైనవి చేయించేవారు. ఆయన ఎదురుగా రసగుల్లా, సమోసా ప్లేట్‌లు ఉంచొద్దని మేం సర్వ్ చేసేవాళ్లకు ప్రత్యేకంగా చెప్పేవాళ్లం. మొదట ఆయన శాకాహారిగా ఉండేవారు, తర్వాత మాంసాహారిగా మారిపోయారు. చైనా వంటలంటే ఆయనకు ప్రత్యేకమైన ఇష్టం.''

 
''ఆయన మనలాగే ఒక సామాన్యమైన వ్యక్తి. హి వజ్ నైదర్ ఎ సెయింట్, నార్ ఎ సిన్నర్. సహృదయుడైన ఓ సాధారణ మానవుడు'' అని శక్తి సిన్హా తెలిపారు. సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా, హరివంశ్ రాయ్ బచ్చన్, శివమంగళ్ సింగ్ సుమన్, ఫైజ్ అహ్మద్ ఫైజ్ వాజ్‌పేయికి ఇష్టమైన కవులు. శాస్త్రీయ సంగీతం అంటే కూడా ఆయన చెవి కోసుకునేవారు. భీమ్ సేన్ జోషి, అమ్జాద్ అలీ ఖాన్, కుమార్ గంధర్వల సంగీతాన్ని వినే అవకాశాన్ని ఆయన వదులుకునే వారు కాదు. విదేశాంగ విధానంలో వాజ్‌పేయి జాడలు ఎక్కువగా కనిపిస్తాయి కానీ, ఆయన ఎక్కువగా ప్రభావం చూపింది ఆర్థికరంగంలో అనేది కింగ్షుక్ నాగ్ అభిప్రాయం. ''కమ్యూనికేషన్, రవాణా రంగంలో వాజ్‌పేయి పాత్రను విస్మరించలేం. ప్రస్తుత హైవేల వ్యవస్థ వెనుక ఉంది ఆయన ఆలోచనలే. షేర్ షా సూరి తర్వాత మన దేశంలో ఎక్కువ రహదారులు నిర్మించింది ఆయన కాలంలోనే అంటాను'' అన్నారు కింగ్షుక్.

 
‘గుజరాత్ అల్లర్లు అతి పెద్ద పాలనా వైఫల్యం’
'రా' మాజీ చీఫ్ ఎఎస్ దులత్ తన పుస్తకం 'ద వాజ్‌పేయి ఇయర్స్'లో, గుజరాత్ అల్లర్లను తన పాలనా సమయంలో జరిగిన అతి పెద్ద వైఫల్యంగా వాజ్‌పేయి పరిగణిస్తారని పేర్కొన్నారు. కింగ్షుక్ నాగ్ కూడా గుజరాత్ అల్లర్లపై వాజ్‌పేయి చాలా అసహనంతో ఉండేవారని తెలిపారు. ఆ విషయంలో నాటి గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని ఆయన భావించారు. ''మోదీ రాజీనామాకు సిద్ధపడ్డారని ఆ సమయంలో నాటి గవర్నర్ సుందర్ సింగ్ భండారికి బాగా సన్నిహితుడైన ఒక వ్యక్తి నాకు తెలిపారు. అయితే గోవాలో జరిగిన జాతీయ సదస్సు నాటికి వాజ్‌పేయి మనసు మార్చడంలో పార్టీలోని సీనియర్లు సఫలీకృతులయ్యారు'' అని నాగ్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జమ్మూకాశ్మీర్‌లో బోల్తాపడిన బస్సు - ఆరుగురు జవాన్లు మృతి