Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్ హంగ్ ఫలితాలకు, వైయస్ రాజశేఖర రెడ్డికీ ఉన్న సంబంధం ఏంటి?

హైదరాబాద్ హంగ్ ఫలితాలకు, వైయస్ రాజశేఖర రెడ్డికీ ఉన్న సంబంధం ఏంటి?
, బుధవారం, 9 డిశెంబరు 2020 (13:56 IST)
హైదరాబాద్ ఎన్నికలు ముగిశాయి. హంగ్ వచ్చింది. ఇప్పుడు ఎక్స్ అఫీషియో ఓట్ల ద్వారా మేయర్ ఎవరు అనేది నిర్ణయిస్తారు. అంటే మేయర్ పదవిని ఇప్పటి ప్రజల తీర్పు కాకుండా, పరోక్ష పద్ధతిలో ఎప్పుడో ఎన్నికయిన వారు తేలుస్తారు. ఇంతకీ ప్రజల తీర్పును తిరగరాసే శక్తి ఉన్న ఈ ఎక్స్ అఫీషియోలు ఎవరు? వారికి ఎందుకు ఇంత శక్తి వచ్చింది.

 
భారతదేశంలో గ్రామ పంచాయితీలు స్వాతంత్ర్యం తరువాత వచ్చాయి. కానీ, మున్సిపాలిటీలు మాత్రం బ్రిటిష్ కాలం నుంచీ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని 1965లోని మున్సిపల్ చట్టం ప్రకారం ఇవి నడుస్తాయి. ఈ చట్టంలోనే ఎక్స్ అఫీషియోల గురించి ప్రస్తావించారు. 1992 నాటి 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపాలిటీలకు రాజ్యాంగబద్ధత వచ్చింది. అందులో కూడా ఎక్స్ అఫీషియోలను గుర్తించారు.

 
ఆ మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ పరిధిలో నివసించే (ఓటు హక్కున్న) ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఎక్స్ అఫీషియోలుగా రావచ్చు. అంతేకాదు, ఆ మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే ప్రాంతాల ఎమ్మెల్యే, ఎంపీలు కూడా అందులో ఎక్స్ అఫీషియోలుగా ఉంటారు. మున్సిపల్ పరిపాలనలో సహాయంగా, సమన్వయం కోసం వీరికి కూడా ఆ సంస్థల్లో సభ్యత్వం ఇచ్చి ఓటు హక్కు ఇచ్చారు.

 
మామూలు ఓటర్లు వర్సెస్ ఎక్స్ అఫీషియో!
సాధారణంగా మున్సిపాలిటీలకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే అప్పుడు జనమే నేరుగా మేయర్ లేదా మున్సిపల్ చైర్మన్లను ఎన్నుకునే వారు. కేవలం డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్‌లను మాత్రమే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎన్నుకుంటారు. వారికి తోడు ఈ ఎక్స్ అఫీషియోలు కూడా ఆ వైస్ చైర్మన్ లేదా డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటు వేస్తారు. అంటే అసలు పదవికి మాత్రం ప్రజలు నేరుగా ఎన్నుకునే అవకాశం ఉండేది.

 
1987లో ఎన్టీఆర్ ప్రత్యక్ష ఎన్నికలను అమలు చేశారు. తరువాత నుంచీ అది కొనసాగింది. అప్పట్లో మేయర్‌ను నేరుగా ఎన్నుకునే వారు. ''ఈ విధానం ఉత్తమం. దీంతో హంగ్ అనే ప్రశ్న ఉత్పన్నం అయ్యేది కాదు. ప్రజలు తాము ఎవరికి ఓటేస్తున్నామో, తమ మేయర్ ఎవరో తెలుసుకుని ఓటు వేయగలుగుతారు. ఓటు వేశాక కార్పొరేటర్ పార్టీలు మారడం వంటి సమస్యలు దీనికి రావు'' అన్నారు లోక్ సత్తా ఉద్యమ సంస్థ నాయకులు బండారు రామ్మోహన రావు. అప్పట్లో పార్టీల మధ్య పోటీ, పంచాయితీ అంతా డిప్యూటీ మేయర్ పదవి కోసమే ఉండేది.

 
2002లో ఎంసీహెచ్ మేయర్ పదవికి జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో తీగల కృష్ణారెడ్డి తెలుగుదేశం తరపున గెలిచారు. అయితే, 2005లో వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిబంధనలు మార్చారు. మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులకు పరోక్ష ఎన్నికలు ప్రారంభించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సీన్ మారిపోయింది. ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మేయర్లను, మునిసిపల్ ఛైర్మన్లను ఎన్నుకోవడం ప్రారంభించారు.

 
ఈ పద్ధతిలో అధికారంలో ఉన్న పార్టీలకు సరైన మెజార్టీ వస్తే సరేసరి. లేదంటే, ఎక్స్ అఫీషియోలను రంగంలోకి దించుతారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఓకే. కానీ, ఆ పట్టణం వారు కాకపోయినా ఆ జిల్లాకు చెందిన, కొన్ని సందర్భాల్లో పక్క జిల్లాలకు చెందిన రాజ్యసభ సభ్యులనూ, ఎమ్మెల్సీలను కూడా తీసుకువచ్చిన తమకు బలం తక్కువ ఉన్న మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియోగా నమోదు చేయిస్తారు.

 
దీంతో ఆ సభ్యులు ఎక్కువ మంది ఉన్న పార్టీ బలం పెరుగుతుంది. మునిసిపల్ ఎన్నికలు జరిగిన తరువాత, వారం పది రోజుల్లోనే ఆ ప్రాంతంలో ఓటు రాయించుకుని, ఎక్స్ అఫీషియోలుగా నమోదై, ప్రజల తీర్పును తారుమారు చేసిన సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఉన్నాయి. అంటే ప్రజలు ఒక పార్టీని వద్దని తీర్పు ఇచ్చినా, ఆ పార్టీకి ఎక్కువ మంది రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటే చాలు, ప్రజల తీర్పును కాదని తమకు నచ్చిన వారిని మున్సిపల్ అధ్యక్ష పదవుల్లో కూర్చోబెట్టొచ్చు. అందుకే 2005లో వైయస్ రాజశేఖర రెడ్డి తెచ్చిన ఈ విధానాన్ని తరువాత రెండు రాష్ట్రాలూ కొనసాగిస్తున్నాయి.

 
''కానీ, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. దీనివల్ల ఖర్చు బాగా పెరిగిపోతుంది. క్యాంపు కల్చర్ తయారవుతుంది. లక్షలు, కోట్లు పెట్టి, అవతలి పార్టీ కార్పొరేటర్‌నీ, కౌన్సిలర్లనూ కొంటారు. మొత్తం వ్యాపారం అయిపోతోంది. అదే ప్రత్యక్ష ఎన్నిక అయితే ఈ తలపోటే ఉండదు. జనం కావాలనుకున్నవారికి ఓటస్తారు.'' అన్నారు రామ్మోహన రావు. ప్రస్తుతం బిహార్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు ఇంకా ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తున్నాయి.

 
ప్రత్యక్ష ఎన్నికలు అంటే ప్రభుత్వ పెద్దలకు ఎందుకు నచ్చదు?
దీనికి రెండు కారణాలు చెబుతారు విశ్లేషకులు. మొదటిది అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేక తీర్పు వస్తే అవమానం. అంటే అధికారంలో ఉన్న పార్టీ మున్సిపాలిటీల్లో ఓడిపోతే అవమానం కాబట్టి, పరోక్ష ఎన్నిక అయితే ఎలాగోలా ఎక్స్ అఫీషియోలను ఉపయోగించి ఫలితాన్ని తారుమారు చేయవచ్చు. రెండవ కారణం, ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రత్యక్ష ఎన్నికలు నచ్చకపోవడం. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికయ్యే మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే మండలాధ్యక్షులు, జెడ్పీ ఛైర్మన్లు తమ మాట వినరనే భయం ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఉంటుంది.

 
''గుంటూరు వంటి జిల్లాకు డైరెక్టుగా ఒక జెడ్పీ ఛైర్మన్ ఎన్నికయితే, వారు మూడు ఎంపీ నియోజకవర్గాలు, 17 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో డైరెక్టు ఎన్నిక ద్వారా గెలిచిన వ్యక్తి అవుతారు. అప్పుడు ఆ వ్యక్తి ఎమ్మెల్యే, ఎంపీల కంటే ఎక్కువ ఓట్లతో గెలిచినట్టు కదా. అలాగే హైదరాబాద్ మేయర్ అంటే 75 లక్షల పైగా ఓట్లకు నేరుగా ప్రాతినిధ్యం వహించే వ్యక్తి అవుతారు. స్థానిక సంస్థల అధిపతులు తమకంటే పవర్‌ఫుల్‌గా ఉండడం ఎమ్మెల్యేలు, ఎంపీలకు నచ్చదు కదా.. అందుకే ఒకప్పుడు జెడ్పీ చైర్మన్ పదవి అంటే మంత్రి పదవి కూడా కాదనుకుని వచ్చేవారు. ఇప్పుడా పరిస్థితిలేదు'' అని వివరించారు రామ్మోహన రావు.

 
నచ్చినప్పుడు ఎన్నికలు
స్థానిక సంస్థలకు ఐదేళ్లకోసారి తప్పనిసరిగా ఎన్నికలు జరపాలని రాజ్యాంగం చెబుతోంది. కానీ, ప్రతీసారీ ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తాయి. దానికి వారు చూపే కారణం శాంతిభద్రతలు. లేదంటే రిజర్వేషన్లు గొడవ ఉంటుంది. ప్రతీ ఎన్నికల ముందూ రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. కానీ ఆ రిజర్వేషన్ల ప్రక్రియ సరిగా లేదంటూ ఎవరో ఒకరు కోర్టుకు వెళతారు. దీంతో మొత్తం ప్రక్రియే ఆలస్యం అయిపోతుంది. గవర్నమెంటులో ఉన్న వారు తమకు నచ్చినప్పుడు ఎన్నికలు పెట్టుకోవచ్చు.

 
ఈసారి గ్రేటర్ హైదరాబాద్ పాలక మండలి గడువు ఫిబ్రవరి వరకూ ఉండగా ఏకంగా మూడు నెలల ముందు, నవంబరులోనే ప్రక్రియ పూర్తి చేసేసి డిసెంబరు నాలుగు నాటికి అంతా క్లియర్ చేసేశారు. ''నిజానికి గ్రేటర్ ఎన్నికల్లో మెజార్టీ వస్తే ప్రస్తుత పాలక మండలిని రద్దు చేసి, కొత్త పాలక మండలిని కొలువుదీర్చే వారని వార్తలు వచ్చాయి. కానీ ఫలితం తేడా వచ్చేసరికి, ఈ రెండు నెలలూ పాత పాలకమండలినే కొనసాగిస్తున్నారు'' అంటూ చెప్పుకొచ్చారు టీఆర్ఎస్ వ్యవహారాలు సుదీర్ఘంగా కవర్ చేసిన ఒక విలేకరి. తెలంగాణలోనే కాదు, ఆంధ్రలోనూ పంచాయితీ ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయి. విశాఖపట్నం మునిసిపల్ ఎన్నికలు కూడా గడవు తీరి చాలా కాలం అయినా ఇప్పటి వరకూ జరపలేదు.

 
ఎన్నికల ప్రక్రియను మార్చలేరా?
నిజానికి కేంద్రం మున్సిపాలిటీలకు రాజ్యాంగ బద్ధత కల్పించింది కానీ, ఆ సంస్థల్లో ఎవరు ఉండాలి? ఎన్నికలు ఎలా నిర్వహించాలి? వంటి అంశాలను రాష్ట్రాలకే వదిలిపెట్టింది. అంతకుముందు అయితే ఎన్నికలు కూడా నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించేవి. 1990ల తరువాతే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. కానీ, ఈ ఎన్నికల సంఘాలు ఉన్నా పెద్దగా బలంగా లేవు.

 
''రాష్ట్ర ఎన్నికల సంఘాల పరిస్థితి ఎలా ఉందో ఆంధ్ర, తెలంగాణల్లో చూస్తున్నాం. ఆంధ్రలో నిమ్మగడ్డ రమేశ్ వర్సెస్ ప్రభుత్వం నడుస్తోంది. ఇక తెలంగాణలో అయితే, తెల్లారితే కౌంటింగ్ అనగా, పెన్నుతో టిక్ పెట్టినా ఓటు చెల్లుతుంది అంటూ ఉత్తర్వులు ఇచ్చారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్. ఆ ఆదేశాలు చూసి షాక్ అయ్యాను. భారత ఎన్నికల సంఘం అంత స్వతంత్రంగా రాష్ట్రాల ఎన్నికల సంఘాలు లేవు'' అన్నారు రామ్మోహన రావు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుంటూరు.. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని.. భర్తను రోకలి బండతో మోది..?