Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తూర్పు పాకిస్తాన్‌ను బంగ్లాదేశ్‌గా మార్చిన ఆ యుద్ధంలో భారత పైలట్లు చివరి మూడు నిమిషాల్లో ఏం చేశారు?

webdunia
గురువారం, 10 అక్టోబరు 2019 (13:52 IST)
అది 1971 డిసెంబర్ 14. ఉదయం పదిన్నర కావస్తోంది. స్థలం గువాహటి ఎయిర్ బేస్. వింగ్ కమాండర్ బీకే బిష్ణోయ్ తూర్పు పాకిస్తాన్‌లో ఒక ఆపరేషన్ పూర్తి చేసి అప్పుడే వచ్చారు. అంతలోనే గ్రూప్ కెప్టెన్ వోలెన్ ఆయనకు అత్యంత ముఖ్యమైన ఆపరేషన్ కోసం వెంటనే బయల్దేరాలని చెప్పారు. 11.20 నిమిషాలకు ఆయన ఢాకాలోని సర్క్యూట్ హౌస్‌లో ఒక కీలక సమావేశం జరిగే సమయంలో బాంబులు వేసి దానిని ఆపాలి.

 
అంతకుముందు ఒకటి జరిగింది. ఉదయం ఢాకా గవర్నర్ హౌస్, పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మధ్య జరిగిన ఒక సంభాషణను భారత వైమానిక దళం మధ్యలో వినింది. వాటి ద్వారా తూర్పు పాకిస్తాన్ గవర్నర్ ఉదయం 11.30కు ఒక మీటింగ్ పెట్టబోతున్నారని, అందులో పాకిస్తాన్ పాలకులు, స్థానిక అధికారులు అందరూ పాల్గొంటున్నారనే విషయం తెలిసింది.

 
ఆ సమావేశం జరుగుతున్నప్పుడు సర్క్యూట్ హౌస్‌పై బాంబులు వేయాలని వైమానిక దళం హెడ్ క్వార్టర్స్ తూర్పు కమాండ్‌ను ఆదేశించింది. అక్కడ పాలకులు ఒక నిర్ణయం తీసుకునేలోపే వారిని అడ్డుకోవాలని నిర్ణయించింది. సర్క్యూట్ హౌస్ లొకేషన్ గురించి ఆపరేషన్ రూంలో ఎలాంటి మ్యాప్ లేదు. మ్యాప్ పేరుతో వారికి ఒక టూరిస్ట్ మ్యాప్ ఇచ్చారు. దాన్ని బిష్ణోయ్ తన సైడ్ పాకెట్‌లో పెట్టుకున్నారు.

 
కొత్త లక్ష్యం గవర్నమెంట్ హౌస్
ఆ రోజు గురించి బీబీసీతో మాట్లాడిన బిష్ణోయ్, "ఆ సమయంలో మాకు దాడి చేయడానికి 24 నిమిషాలే ఉంది. అందులో గువాహటి నుంచి ఢాకా చేరుకోడానికి 21 నిమిషాలు పడుతుంది. అంటే మొత్తం మా దగ్గర 3 నిమిషాలే మిగులుతాయి. నేను నా మిగ్ 21 ఇంజన్ స్టార్ట్ చేసి, దాని హుడ్ మూయబోతున్నాను. అప్పుడు నాకు మా స్క్వాడ్రన్ ఆఫీసర్ ఒక కాగితం ఊపుతూ నావైపు పరిగెత్తుకుని రావడం కనిపించింది.

 
ఆ ఆఫీసర్ బిష్ణోయ్‌తో, "ఇప్పుడు టార్గెట్ సర్క్యూట్ హౌస్ కాదు, గవర్నమెంట్ హౌస్" అన్నారు. బిష్ణోయ్ అతడితో "అదెక్కడుంది" అని అడిగాడు. దానికి ఆఫీసర్, "అది మీరే కనుక్కోవాలి" అన్నాడు. తనకు విమానం ఆపి టార్గెట్ వెతుక్కునేంత టైం కూడా లేదు అని బిష్ణోయ్ చెప్పారు. "టార్గెట్ మార్చేశారని నేను నా టీమ్‌లోని ఏ పైలెట్‌కూ చెప్పలేదు. నేను రేడియోలోనే వారికి ఆ విషయం చెప్పవచ్చు. కానీ, అలా చేస్తే మేం ఏం చేయబోతున్నామో మొత్తం ప్రపంచానికి తెలిసిపోతుంది" అని ఆయన చెప్పారు.

 
బర్మా షెల్ టూరిస్ట్ మ్యాప్
ఈలోపు గువహాటి నుంచి 150 కిలోమీటర్లు పశ్చిమంగా హాషిమారాలో వింగ్ కమాండర్ ఆర్వీ సింగ్, 37 స్క్వాడ్రన్ సీఓ వింగ్ కమాండర్ ఎస్కే కౌల్‌ను పిలిపించారు. ఢాకాలో గవర్నమెంట్ హౌస్‌ను ధ్వంసం చేయాలని ఆయనకు బ్రీఫ్ చేశారు. అప్పుడు కౌల్ వేసిన మొదటి ప్రశ్న "గవర్నమెంట్ భవనం ఎక్కడుంది". జవాబుగా ఆయనకు బర్మా షెల్ పెట్రోలియం కంపెనీ విడుదల చేసిన రెండు అంగుళాల టూరిస్ట్ మ్యాప్ ఇచ్చారు.

 
అప్పటికి, బిష్ణోయ్ గువాహటి నుంచి టేకాఫై 20 నిమిషాలవుతోంది. మూడు నిమిషాల్లో తన లక్ష్యాన్ని చేరగలనని ఆయన అనుకున్నారు. ఆయన తన జేబులోంచి మ్యాప్ తీశారు. దాన్లో చూశాక, తన సహచర పైలెట్లకు రేడియోలో "ఢాకా విమానాశ్రయానికి దక్షిణంగా లక్ష్యాన్ని వెతకడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు లక్ష్యం సర్కూట్ హౌస్ కాదు, గవర్నమెంట్ హౌస్" అని చెప్పారు.

 
ఆయన మూడో నంబర్ పైలెట్ వినోద్ భాటియా అందరికంటే ముందు గవర్నమెంట్ హౌస్‌ను గుర్తించారు. దాని చుట్టూ భారత్‌లోని రాష్ట్ర రాజధానుల్లో రాజ్‌భవన్ చుట్టూ ఉన్నట్లు పచ్చగడ్డితో ఒక కాంపౌండ్ కనిపించింది. బిష్ణోయ్ ఆరోజు గురించి చెబుతూ "నేను మా లక్ష్యం అదేనా, కాదా ధ్రువీకరించుకునేందుకు మిగ్‌ను బాగా కిందికి తీసుకొచ్చాను. అక్కడకు చాలా కార్లు వస్తుండడం కనిపించింది. చాలా సైనిక వాహనాలు కూడా ఉన్నాయి. ఆ భవనం గుమ్మటంపై పాకిస్తాన్ జెండా ఎగురుతోంది. నేను నా సహచరులతో మనం దీనిపైనే దాడి చేయాలి" అని చెప్పాను.

 
హోటల్లో తలదాచుకునే ప్రయత్నం
అప్పుడు గవర్నర్ హౌస్‌లో గవర్నర్ డాక్టర్ ఎ.ఎం. మలిక్ తన మంత్రిమండలి సభ్యులతో కలిసి చర్చల్లో బిజీగా ఉన్నారు. అప్పుడే ఐక్యరాజ్యసమితి ప్రతినిధి జాన్ కేలీ అక్కడకు చేరుకున్నారు. దాంతో, మలిక్ మంత్రిమండలి సమావేశం మధ్యలోనే వదిలిపెట్టి కేలీని రిసీవ్ చేసుకున్నారు.

 
మలిక్ కేలీతో "ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే, మీకు ఏమనిపిస్తోంది" అన్నారు. దాంతో కేలీ "మిమ్మల్ని, మీ మంత్రిమండలి సభ్యులను ముక్తివాహిని టార్గెట్ చేయవచ్చు" అన్నారు. కేలీ ఆయనతో, "మీరు నిర్ణయించిన తటస్థ ప్రాంతమైన ఇంటర్ కాంటినెంటల్ హోటల్లోకి వెళ్లి దాక్కోవచ్చు. కానీ అది చేయడానికి ముందు మీరు, మీ మంత్రిమండలి సభ్యులు మీ పదవులకు రాజీనామా చేయాలి" అన్నారు.

 
దానికి మలిక్ "మేం దాని గురించి ఆలోచిస్తున్నాం" అన్నారు. కానీ యుద్ధం మధ్యలో అక్కడ నుంచి పారిపోయాడని చరిత్రలో చెప్పుకుంటారని ఆయన అలా చేయలేదు. మలిక్ "నా భార్య, కూతురిని ఆ హోటల్‌కు పంపించవచ్చా అని కేలీని అడిగాడు. దానికి కేలీ, "అలా చేయచ్చు, కానీ దాని గురించి అంతర్జాతీయ ప్రెస్‌కు తెలుస్తుంది, గవర్నర్‌కు భవిష్యత్తుపై నమ్మకం పోయిందని కచ్చితంగా వార్తలు వస్తాయి" అన్నారు. దాంతో ఆయన తన కుటుంబాన్ని హోటల్లో ఉండడానికి పంపించేశారు.

 
జీప్ కింద దాక్కున్నారు
అక్కడ వారు మాట్లాడుతుండగానే గవర్నర్ హౌస్‌ భూకంపం వచ్చినట్లు కంపించింది. బిష్ణోయ్ వేసిన రాకెట్లు భవనంపై పడడం మొదలయ్యాయి. మొదటి రౌండ్‌లో పైలెట్ 16 రాకెట్లు వేశాడు. బిష్ణోయ్ ప్రధాన గుమ్మటం కిందున్న గదిని టార్గెట్ చేశారు. భవనం లోపల నుంచి హాహాకారాలు వినిపిస్తున్నాయి. కేలీ, ఆయన సహచరుడు వీలర్ ఆ భవనం నుంచి బయటికి వచ్చారు. బయట పార్కులో ఉన్న ఒక జీప్ కింద దాక్కున్నారు.

 
"జాన్ కేలీ త్రీడేస్ ఇన్ ఢాకా' అనే పుస్తకంలో కేలీ ఆ రోజు జరిగింది రాశారు. "దాడి చేసిన సమయంలో చీఫ్ సెక్రటరీ ముజఫర్ హుస్సేన్‌ నాకు ఎదురుపడ్డాడు. ఆయన ముఖం తెల్లగా పాలిపోయుంది. మేజర్ జనరల్ రావ్ ఫర్మాన్ అలీ నా కళ్ల ముందే పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ప్రాణాలు కాపాడుకోడానికి ఆయన చాటు కోసం వెతుకుతున్నాడు. పరిగెత్తుతూనే ఆయన నాతో 'భారతీయులు మాపై ఇలా ఎందుకు చేస్తున్నారు' అన్నారని చెప్పారు.

 
వింగ్ కమాండర్ బిష్ణోయ్ నేతృత్వంలో దూసుకొచ్చిన నాలుగు మిగ్ 21 విమానాలు, అప్పటికే దుమ్ము, ధూళి కప్పేసిన గవర్నర్ హౌస్‌పై 128 రాకెట్లు వదిలాయి. అవి అక్కడ్నుంచి వెళ్లిపోగానే, ఫ్లైట్ లెఫ్టినెంట్ జి.బాల నేతృత్వంలో 4 స్క్వాడ్రన్ నుంచి మరో రెండు మిగ్ 21లు అక్కడ బాంబులు వేయడానికి వచ్చాయి. బాల, ఆయన నంబర్ 2 హేమూ సర్దేశాయ్ గవర్నర్ హౌస్ మీద రెండు సార్లు తిరిగారు. ప్రతిసారీ నాలుగేసి రాకెట్లు భవనంపై వేశారు.

 
45 నిమిషాల్లో మూడో దాడి
మిగ్ 21 ఆరు దాడుల్లో, 192 రాకెట్లు వేసినా గవర్నర్ హౌస్ నేలమట్టం కాలేదు. అయితే ఆ దాడులకు దాని గోడలు, కిటికీలు, తలుపులు తట్టుకోలేకపోయాయి. దాడి ముగియగానే కేలీ, ఆయన సహచరుడు ఒక మైలు దూరంలో ఉన్న ఐక్యరాజ్యసమితి ఆఫీసుకు వెళ్లిపోయారు.
అక్కడ ఉన్న లండన్ అబ్జర్వర్ ప్రతినిధి గావిన్ యంగ్ "మళ్లీ గవర్నర్ హౌస్ వెళ్లి అక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేద్దాం" అని కేలీకి చెప్పాడు. భారత్ విమానాలు ఇప్పుడప్పుడే తిరిగి రావని, అవి మళ్లీ ఇంధనం, ఆయుధాలు నింపుకోడానికి కనీసం గంట పడుతుందని ఆయన అనుకున్నాడు.

 
కేలీ, గావిన్ మళ్లీ గవర్నర్ హౌస్ చేరుకునేసరికి మలిక్, ఆయన సహచరులు ఆ భవనంలోనే ఉన్న ఒక బంకరులో దాక్కుని కనిపించారు. మలిక్ అప్పటికీ తన రాజీనామా గురించి ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆయన అప్పటికీ వారితో చర్చలు జరుపుతూనే ఉన్నారు. అప్పుడే హఠాత్తుగా పైనుంచి బుల్లెట్ల శబ్దం వినిపించింది. భారత వైమానికదళం 45 నిమిషాల్లోనే గవర్నమెంట్ హౌస్‌పై మూడో దాడి కూడా ప్రారంభించింది.

 
కిటికీలే లక్ష్యం
ఈసారీ దాడికి హంటర్ నడుపుతున్న వింగ్ కమాండర్ ఎస్కే కౌల్, ఫ్లయింగ్ ఆఫీసర్ హరీశ్ మసంద్ నేతృత్వం వహిస్తున్నారు. కౌల్ తర్వాత వైమానిక దళం అధ్యక్షుడు కూడా అయ్యారు. ఆయన బీబీసీతో, "మాకు ఢాకాలో ఆ గవర్నమెంట్ హౌస్ ఎక్కడుందో తెలీదు. కలకత్తా, బొంబాయిలా ఢాకా పెద్ద నగరం. మాకు ఢాకా నగరం గురించి బర్మా షెల్ పాత రోడ్ మ్యాప్ ఇచ్చారు. అది మాకు చాలా ఉపయోగపడింది" అన్నారు. కౌల్ నేతృత్వంలోని వైమానిక దళం ఆ భవనం చుట్టుపక్కల ఉన్న వారికి ఎక్కువ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది.

 
"చుట్టుపక్కల ఉన్న వారందరూ చెల్లాచెదురయ్యేలా, వారికి నష్టం లేకుండా మేం మొదట బిల్డింగ్‌ను పాస్ చేశాం. మేం రాకెట్ అటాక్‌తోపాటు, గన్ అటాక్ కూడా చేశాం. వారి చిన్న ఆయుధాలకు అందకుండా ఉండేలా మా అటాక్‌ను ఒక హైట్‌లో ఉంచాం" అని చెప్పారు.

 
వింగ్ కమాండర్ కౌల్‌తో వెళ్లిన, వింగ్ మెన్ ఫ్లయింగ్ ఆఫీసర్ హరీశ్ మసంద్ కూడా బీబీసీతో "నాకు ఆ రోజు ఇప్పటికీ గుర్తుంది. గవర్నమెంట్ హౌస్ ఎదురుగా మొదటి అంతస్తుపై ఒక పెద్ద తలుపు లేదా కిటికీ లాంటిది ఉంది. దాంతో మేం అక్కడ ఏదైనా మీటింగ్ హాల్ ఉండచ్చని దాడి చేశాం. దాడి తర్వాత మేం కిందుగా ఎగురుతూ ఇంటర్ కాంటినెంటల్ హోటల్ పక్కనుంచి వెళ్తున్నప్పుడు దాని డాబా, టెర్రస్, బాల్కనీలో చాలా మంది అదంతా చూస్తుండడం కనిపించింది" అన్నారు.

 
వణికే చేతులతో రాజీనామా
అప్పుడు గవర్నర్ హౌస్‌లో ఉన్న గావిన్ తన పుస్తకంలో మరో విషయం కూడా రాశారు. "భారత జెట్ ఫైటర్లు గర్జిస్తూ దాడి చేశాయి. భూమి కంపించింది. మలిక్ నోటి నుంచి 'ఇప్పుడు మనం కూడా శరణార్థులమే అనే మాట వచ్చింది'. కేలీ నా వైపు చూసి 'మనం మళ్లీ ఇక్కడకు రావాలనుకుని తప్పు చేశాం' అన్నారు. హఠాత్తుగా మలిక్ జేబులోంచి పెన్ తీశారు. వణికే చేతులతో కాగితంపై ఏదో రాశారు. అది ఆయన రాజీనామా. దానిని ఆయన అధ్యక్షుడు యాహ్యా ఖాన్‌కు రాశారు" అని చెప్పారు.
 
 
"ఇప్పటికీ దాడి కొనసాగుతూనే ఉంది. మలిక్ తన బూట్లు, సాక్సులు తీశారు. పక్కనే ఉన్న టాయిలెట్‌లో కాళ్లూ చేతులు కడుక్కున్నారు. తలపై రుమాలు వేసుకుని బంకర్లో ఒక మూల కూర్చుని నమాజు చదవడం మొదలెట్టారు. ఇది గవర్నమెంట్ హౌస్ అంతం. ఇది తూర్పు పాకిస్తాన్ ఆఖరి ప్రభుత్వానికి ముగింపు" అని "గావిన్ యంగ్ వరల్డ్స్ అపార్ట్, ట్రావెల్స్ ఇన్ వార్ అండ్ పీస్" పుస్తకంలో రాశారు.

 
ఈ దాడి తర్వాత వెంటనే గవర్నర్ మలిక్ తన మంత్రిమండలి సభ్యులతో ఇంటర్ కాంటినెంటల్ హోటల్‌కు వెళ్లారు. భారత్ వైమానిక దాడి ఈ యుద్ధం సమయాన్ని తగ్గించడంతోపాటు, రెండో ప్రపంచ యుద్ధంలో బెర్లిన్‌లోలా వీధుల్లో ఘర్షణలు లేకుండా చేసింది. రెండు రోజుల తర్వాత పాకిస్తాన్ ఆర్మీ 93 వేల మంది సైనికులు భారత సైన్యం ముందు లొంగిపోయారు. ఆ చివరి మూడు నిమిషాల దాడితో బంగ్లాదేశ్ ఆవిర్భావానికి మార్గం సుగమం అయ్యింది. ఈ యుద్ధంలో అసాధరణ సాహసం చూపిన వింగ్ కమాండర్ ఎస్కే కౌల్‌కు మహావీర్ చక్ర్, వింగ్ కమాండర్ బీకే బిష్ణోయ్‌, హరీశ్ మసంద్‌కు వీర్ చక్ర్ ప్రదానం చేశారు.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

కేరళ : జాలీ ఖాతాలో మరికొన్ని హత్యలు..