ఆర్టీసీ సమ్మె ఉధృతం.. కేసీఆర్‌కు అల్టిమేటం... తడాఖా చూపిస్తామంటున్న కార్మికులు

శనివారం, 5 అక్టోబరు 2019 (15:34 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె తీవ్రతరమైంది. ఆర్టీసీ కార్మిక సంఘాలన్ని ఐకమత్యంతో ఈ సమ్మెను కొనసాగిస్తున్నాయి. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమై పోయాయి. అయితే, ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ వాటిని ఆర్టీసీ కార్మికులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సాయంత్రం 6 గంటల్లోపు విధుల్లో చేరాలని... విధుల్లో చేరని ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ ఆర్మీసీ కార్మికులు ఏమాత్రం తగ్గలేదు. తమ సమ్మెను యథాతథంగా కొనసాగిస్తున్నారు.
 
ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ యూనియన్ల జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ, సమ్మె విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని చెప్పారు. ఎంత మంది ఉద్యోగులను ప్రభుత్వం తొలగిస్తుందో తాము కూడా చూస్తామంటూ ధిక్కార స్వరాన్ని వినిపించారు.  
 
మరోవైపు, దసరా, దీపావళి పండుగల కోసం తమతమ సొంతూళ్ళకు వెళ్లేందుకు ముందుగా రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. వీరంతా తమ సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. గత రాత్రి నుంచి దూరప్రాంత సర్వీసులు నిలిచిపోగా, విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు చేయించుకున్న వారు గమ్యాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
ఇలాంటి వారి పరిస్థితి గందరగోళంగా మారగా, ప్రత్యామ్నాయ సర్వీసులను ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. టికెట్ డబ్బులను తిరిగి వెనక్కు ఇస్తారా? అనే విషయంలో స్పష్టత ఇచ్చేందుకు కూడా అధికారులు అందుబాటులో లేకపోయారు. హైదరాబాద్ నగరంలోని ఎంజీబీఎస్‌తో పాటు, పలు ప్రధాన నగరాల బస్టాండ్లలో ఎంక్వయిరీ కౌంటర్లు మూతపడ్డాయి.
 
ఇక నేటి నుంచి స్వస్థలాలకు వెళ్లేందుకు వేలాది మంది ఎన్నో రోజుల ముందుగానే టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు చేయించుకున్నారు. వారంతా తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులు కట్ అవుతున్నాయని, క్యాన్సిల్ చేయకుండా ఉంటే డబ్బులు తిరిగి ఇస్తారో, ఇవ్వరోనని ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇదిలావుండగా, రిజర్వేషన్ సర్వీసులకు ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసే పరిస్థితి లేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మోసం కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అరెస్టు??