Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూసీసీ: ఇక మేనరికం వివాహాలపై నిషేధమేనా? ఉమ్మడి పౌర స్మృతి అమలైతే పెళ్లి, విడాకులు, ఆస్తి పంపకాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

యూసీసీ: ఇక మేనరికం వివాహాలపై నిషేధమేనా? ఉమ్మడి పౌర స్మృతి అమలైతే పెళ్లి, విడాకులు, ఆస్తి పంపకాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
, శనివారం, 8 జులై 2023 (16:31 IST)
ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతోన్న ఉమ్మడి పౌర స్మృతి(యూనిఫామ్ సివిల్ కోడ్) చుట్టూ ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు ఉన్నాయి. చట్టం అమలు చేయడంలో సాధ్యాసాధ్యాలేమిటి? ఏ పార్టీ మద్దతిస్తుంది? ఏ పార్టీ మద్దతు ఇవ్వదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, అసలు ఈ చట్టం వస్తే ఏం జరుగుతుంది? సగటు భారతీయుడి మీద ఈ చట్టం ఏ ప్రభావాన్ని చూపిస్తుందనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం. భారతదేశంలోని పౌరుల వివాహాలు, విడాకులు, ఆస్తి పంపకాలు.. ఇలా అన్నింటి మీదా ఈ చట్టం ప్రభావం చూపుతుంది.
 
అసలేంటీ యూసీసీ
ఇప్పటివరకూ భారతదేశంలో పెళ్లి, విడాకులు, ఆస్తి హక్కు, ఆస్తి పంపకాలు, విడాకుల తరువాత భరణం, రెండో పెళ్లి, దత్తత, వీలునామా, ఆడవాళ్లకు ఆస్తి హక్కు- ఈ విషయాల్లో ఒకే రకమైన చట్టాలు లేవు. హిందువులకు ఒక రకంగా, ముస్లింలకు ఒక రకంగా, క్రైస్తవులకు ఒక రకంగా, ఆదివాసీలకు ఒక రకంగా ఉన్నాయి. మతాల వారీగానే కాకుండా రాష్ట్రాల వారీగా కూడా వేర్వేరు చట్టాలు ఉన్నాయి. అంటే గుజరాత్ ముస్లిం, తమిళనాడు ముస్లిం చట్టాలు ఒకలా లేవు. పంజాబ్ హిందూ, కేరళ హిందూ ఆస్తి పంపకాల విధానాల్లో తేడాలున్నాయి. మణిపూర్ ఆదివాసీ, గోవా క్రైస్తవుల పెళ్లి చట్టాలు వేర్వేరు. ఇలా వేర్వేరుగా ఉన్న అన్ని చట్టాలనూ రద్దు చేసేసి, దేశమంతా రాష్ట్రాలకూ, మతాలకూ అతీతంగా ఒకటే చట్టాన్ని తీసుకురావలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇది బీజేపీ చిరకాల స్వప్నం. దీని ద్వారా మత, కుల, లింగ వివక్ష లేకుండా అందరికీ ఒకటే న్యాయం వర్తిస్తుందని దీన్ని సమర్థించే వాళ్లు చెబుతున్నారు.
 
యూసీసీ వస్తే రద్దు అవడానికి అవకాశమున్న చట్టాలు
1. హిందూ వివాహ చట్టం
2. హిందూ వారసత్వ చట్టం
3. హిందూ మైనార్టీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్
4. హిందూ అడాప్షన్ అండ్ మెయింటినెన్స్ యాక్ట్
5. భారతీయ క్రైస్తవ వివాహ చట్టం
6. భారత విడాకుల చట్టం
7. పార్సీ వివాహ, విడాకుల చట్టం
8. షరియా చట్టాలు (ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ చట్టం (గోవా, కశ్మీర్ తప్ప)
9. డిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మేరేజ్ యాక్ట్ (గోవా, కశ్మీర్ తప్ప)
10. ది ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మేరేజ్ యాక్ట్ (త్రిపుల్ తలాక్ చట్టం)
11. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మారేజ్ యాక్ట్
12. కేథలిక్కుల కేనన్ లా
13. ఈశాన్య రాష్ట్రాల సంప్రదాయ చట్టాలు
14. కశ్మీర్ సంప్రదాయ చట్టాలు
 
ఇన్నాళ్లూ దేశంలో హిందువులకు ఒక రూల్, ముస్లింలకు ఒక రూల్ ఉండేదా?
ఇన్నాళ్లూ ముస్లింలకు వారి సొంత చట్టాల ప్రకారం జీవించే వెసులుబాటు ఇచ్చి, హిందువులకు మాత్రం కఠిన చట్టాలు అమలు చేశారని, ఇకపై అది చెల్లకుండా యూసీసీ వస్తోంది అని చాలామంది భావిస్తున్నారు. అయితే, దేశంలో క్రిమినల్ చట్టాలు, ప్రొసీజరల్ చట్టాలు అందరికీ సమానమే. అంటే నేరం చేస్తే, తప్పు చేస్తే విచారించే తీరు, శిక్షించే విధానం అందరికీ ఒకటే. దొంగతనం, హత్య, రోడ్డుపై ట్రాఫిక్ నిబంధనలు.. ఇలాంటివి అన్నమాట. వాటి కోసం ఉన్న చట్టాలైన ఐపీసీ, సీఆర్పీసీ, సీపీసీ వంటి వాటికి మతంతో పనిలేదు. భారతదేశంలో బతికే అందరికీ ఒకేలా వర్తిస్తాయి. సివిల్ కోడ్ లో ఉండే విషయాలు అంటే ముందుగా చెప్పుకున్నట్టు పెళ్లిళ్లు, ఆస్తి పంపకాలు, దత్తత, విడాకులు, భార్యకు వాటా.. ఇలాంటి విషయాల్లో మాత్రం చట్టాలు వేర్వేరుగా ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఉమ్మడిగా ఒకే చట్టం కిందకు తేవాలన్నది ప్రభుత్వ ఆలోచన.
 
దేశమంతా ఒకే చట్టంతో సమస్య ఏంటి?
ఒకటే సమస్య? ఈ కొత్త చట్టంలో ఏ మతం వారి సంప్రదాయాలకు ప్రాధాన్యం దక్కుతుంది? ఎందుకంటే ఇప్పటివరకూ ఉన్న చట్టాలు ఆయా మతాల వారీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న చట్టాలు స్థూలంగా ఆయా మత గ్రంథాల నుంచి తీసుకుని, వాటిని ప్రస్తుత పరిస్థితులకు అన్వయించి ఉపయోగిస్తున్నారు. హిందూ స్మృతులు, కొన్ని స్థానిక సంప్రదాయాల తీసుకుని వాటిని ప్రస్తుత పరిస్థితులకు మార్చి హిందూ కోడ్ బిల్ సిద్ధం చేశారు.
ఆ క్రమంలో పాత ఆచారాల్లో వివక్ష రూపాలను తీసుకోకుండా, ఆధునిక హక్కుల భావనలతో ఆ చట్టాలను రూపొందించారు. ఉదాహరణకు, హిందూ చట్టాల ఆస్తి ఎలా పంచాలి వంటి భావనలను మనుధర్మ శాస్త్రం, పరాశర ధర్మశాస్త్రం, యాజ్ఞవల్క్య ధర్మశాస్త్రం.. ఇలాంటి వాటి నుంచి తీసుకున్నారు. దయాభాగ, మితాక్షర వంటి సంప్రదాయల నుంచీ తీసుకున్నారు.
 
కానీ అదే సమయంలో హిందువులలో అంతకుముందు లేని విడాకులు, భరణం, స్త్రీలకు ఆస్తి హక్కు వంటివి చేర్చారు. అంటే యథాతథంగా తీసుకున్నారని కాదు. వాటిని సంస్కరించి తీసుకున్నారు. వాటికి అవసరమనుకున్న మౌలిక మార్పులు చేశారు. అలాగే ముస్లిం చట్టాల మూలాలు వారి సంప్రదాయ షరియాలో ఉంటాయి. దాని అర్థం పూర్తిగా షరియాను యథాతథంగా అమలు చేస్తున్నట్టు కాదు. స్థూలంగా షరియా పునాదిగా వారి చట్టాలు ఉంటాయి. రాజ్యాంగంలో పెట్టిన హక్కులకు భంగం కలగకుండా వాటిని అన్వయిస్తారు. క్రైస్తవ చట్టాలు కేథలిక్ చర్చి ఆదేశాల ప్రకారం, ఇతర క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం ఉన్నాయి.
 
ఆదివాసీలకు వారి వారి సంప్రదాయాలు వర్తిస్తాయి. ఆదివాసీలకు హిందూ మతం సహా ఏ మత సంప్రదాయమూ వర్తించదు. బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ పరిపాలనలో బెంగాల్‌కు చెందిన కొందరు బ్రాహ్మణ పండితుల చేత మొదటిసారి హిందూ చట్టాలు రాయించారు. వారు సంస్కృతంలోని స్మృతులను పరిశీలించి డ్రాఫ్ట్ చేశారు. అక్కడి నుంచి అది ఎన్నో మార్పులకు గురయింది. 1946-47 ప్రాంతాల్లో బీఎన్ రావు, ఆ తరువాత అంబేడ్కర్ వంటి వారు కొత్త హిందూ కోడ్ బిల్లు డ్రాఫ్టులు తెచ్చారు. అలా భారతదేశంలో హిందూ చట్టాలు మొదలయ్యాయి. ఆ తరువాత ప్రభుత్వాలు వాటిని క్రమంగా మారుస్తూ వచ్చాయి. ఆ మార్పుల వల్ల హిందూ చట్టాలు మారుతూ ఆధునికతను సంతరించుకున్నాయి.
 
ముఖ్యంగా కుల వివక్ష, స్త్రీ వివక్షకు వ్యతిరేకంగా చట్టాలను మార్చుకుంటూ వచ్చారు. ఉదాహరణకు ఒకప్పుడు హిందూ పురుషులు ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవడం మీద నిషేధం లేదు. తరువాత నిషేధం విధించారు. ఇంతకుముందు కట్నం మీద ఆంక్షలు లేవు. ఆ తరువాత తీసుకొచ్చారు. విడాకుల తరువాత భరణం, ఆడపిల్లకు ఆస్తిలో హక్కు వంటివి కూడా తరువాత కాలంలో చేర్చినవే. ఇలా హిందూ చట్టాలు అప్డేట్ అయినట్టు మిగతా వారి చట్టాలు అప్డేట్ కాలేదు. హిందూ చట్టాలే బౌద్ధులు, జైనులు, సిక్కులకు వర్తిస్తాయి. వారికి ప్రత్యేక చట్టాలు లేవు.
 
కానీ, మిగతా మతాల వారికి వర్తించే చట్టాలు అలా లేవు. మరీ ముఖ్యంగా ముస్లిం పర్సనల్ చట్టాల విషయంలో అనేక విమర్శలు ఉన్నాయి. ముస్లిం మహిళల విడాకుల తరువాత భరణం లేకపోవడం వంటి ఎన్నో వివాదాలు ఈ ముస్లిం పర్సనల్ లాతో ఉన్నాయి. దీంతో ఇవన్నీ రద్దు చేసి దేశమంతా ఉన్న మనుషులందరికీ ఒకే చట్టం తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా దేశమంతా ఒకే చట్టం తేవడం వల్ల హిందూ చట్టాల్లో కూడా చాలా మార్పులు వస్తాయి. కానీ ముస్లిం, క్రైస్తవ, పార్సీ, ఆదివాసీ చట్టాల్లో వచ్చే మార్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇతర మతాల్లో మరీ ముఖ్యంగా ముస్లిం వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కేథలిక్కులు, చర్చిలు కూడా తమ పట్టు కోల్పోవాల్సి వస్తుంది.
 
హిందూ చట్టాల్లో ఏ అంశాలు మారే అవకాశాలు ఉన్నాయి?
1. దగ్గరిబంధుత్వ సంబంధాలపై నిషేధం
a. మేనరికాలు: ఉత్తర భారతంలో మేనరికాలు తప్పు, దక్షిణ భారతదేశంలో తప్పు లేదు.
b. పంజాబ్ పరిసర ప్రాంతాల్లో అన్న చనిపోతే అప్పుడు అన్న భార్యను సోదరుడి వరుస అయ్యే వారు చేసుకోవడం ఉంది. అందులో మళ్లీ అనేక నిబంధనలు ఉన్నాయి.
 
2. కూతుళ్లతో పాటూ భార్యకూ ఆస్తిలో వాటా (ఇప్పటి వరకూ వారసత్వ ఆస్తిలో భార్యకు వాటా లేదు)
3. హిందూ ఉమ్మడి కుటుంబాల వ్యాపార హక్కులు, పన్ను వెసులుబాట్లు
 
ముస్లిం చట్టాల్లో ఏఏ అంశాలు మారే అవకాశాలు ఉన్నాయి
1. ఒకటే పెళ్లికి అనుమతించడం
2. పెళ్లి కూతురికి ఇచ్చే బహుమానం
3. విడాకుల తరువాత భరణం
4. ఆస్తి పంపకాలు
5. దత్తత స్వీకార హక్కు
 
సంప్రదాయామా చట్టమా- ఇకపై ఎవరిది పెత్తనం
యూసీసీ విషయంలో అందరి మనసులోనూ ఉన్న అతి పెద్ద సందేహం ఇదే. నిజానికి హిందూ కోడ్ బిల్లులో ఉన్న నిబంధనల కంటే సంప్రదాయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. దీన్నే ఇంగ్లీషులో కస్టమ్ ప్రివైల్స్ అంటారు. ఉదాహరణకు అసలు ప్రస్తుతం ఉన్న వివాహ చట్టం ప్రకారం మేనరికం అనే పెళ్లి చెల్లదు. దగ్గర బంధువుల బావా, మరదలు వరుస అయినప్పటికీ పెళ్లి చేసుకోవడం ఆ చట్టాల ప్రకారం నిషేధం. అలాంటి పెళ్లి చెల్లదు. కానీ మన చుట్టూ అలాంటి పెళ్లిళ్లు ఎన్నో జరుగుతాయి కదా? ఎందుకంటే భారతదేశం అంతా హిందువుల్లోనే ఒక రకమైన ఆచారాలు లేవు. తమిళనాడు వారి సంప్రదాయం పంజాబ్ వారికి పాపంలా కనిపించవచ్చు. వారి సంప్రదాయం బెంగాల్ వారికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు.
 
దీంతో హిందూ కోడ్ బిల్లులో ఒక క్లాజ్ పెట్టారు. అదేమిటంటే చట్టంలో రూల్స్ ఎలా ఉన్నప్పటికీ, స్థానిక ప్రాంత, కుల ఆచారాలను బట్టి నిర్ణయాలు తీసకోవాలని.. అంటే హిందూ కోడ్ బిల్లులో నిషేధం అయినది కూడా మీ కులంలో కానీ, మీ ప్రాంతంలో కానీ ఆచారంగా ఉంటే అది పాటించవచ్చన్నమాట. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే ఇప్పుడు వివాదం రాబోతోంది. యూసీసీ వస్తే అందులో చట్టం కంటే సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తారా వేయరా? చట్టం కంటే సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తే, అసలు అప్పుడు యూసీసీ వచ్చిన ఉపయోగమే ఉండదు. ఎందుకంటే ఏ ముస్లిం వివాహ, వారసత్వ సంప్రదాయాలకు విరుగుడుగా ఈ చట్టాన్ని తెస్తున్నారో, ఆ లక్ష్యమే నెరవేరదు.
 
అలా కాదని, అన్ని స్థానిక సంప్రదాయాలు, ఆచారాలు చెల్లవని కఠిన నిబంధనలు తెస్తే భారతదేశం లాంటి వైవిధ్యం ఉన్న చోట అది చెల్లుబాటు అవుతుందా? అనేది ఇప్పుడు యూసీసీ చుట్టూ అల్లుకున్న ప్రశ్న. ‘‘ఏదైనా చట్టం వస్తుంది అనగానే ముందుగా దాని డ్రాఫ్టు బయటకు వస్తుంది. డ్రాఫ్టు అంటూ వస్తే, అప్పుడు మనం ఏదైనా చెప్పగలం. ప్రస్తుతానికి యూసీసీ డ్రాఫ్టు కూడా లేదు. ఈ దశలో ఏ కామెంటూ చేయలేం’’ అని బీబీసీతో అన్నారు హైదరాబాద్‌కు చెందిన సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణ. ఈ చర్చ జరుగుతుండగానే ఒక వైపు ముస్లిం పర్సనల్ లా బోర్డు (ముస్లింల సంప్రదాయ చట్టాల మార్పులు చేర్పులు చేసే సంస్థ) వారు ఒక సొంత డ్రాఫ్టు చేసి కేంద్రానికి అందిస్తామని ప్రకటించారు.
 
ఆదివాసీలను మినహాయిస్తారా?
యూసీసీ విషయంలో ముస్లింలతో పాటూ, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఆందోళన మొదలైంది. విస్తృతంగా ఆదివాసీ జనాభా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో స్థానిక ఆచార, సంప్రదాయాల ప్రకారమే ఇప్పటి వరకూ పెళ్లిళ్లూ, ఆస్తి పంపకాలూ, విడాకులు జరుగుతున్నాయి. ఇప్పుడు యూసీసీ వస్తే మొత్తం తమ పద్ధతులన్నీ తలకిందులు అవుతాయని వారి ఆందోళన చెందుతున్నారు. ‘‘యూసీసీ మా సంప్రదాయాలు, పద్ధతులను కమ్మేస్తుంది.’’ అని మేఘాలయ ముఖ్యమంత్రి కన్రడ్ సంగ్మా అన్నారు. చాలా ఈశాన్య రాష్ట్రాల ఆదివాసీల్లో ఇంకా మాతృస్వామ్య వ్యవస్థ ఉంది. అంటే ఇంటి పెద్దగా ఆడవారే ఉంటారు. ఆస్తి ఆడవారి నుంచి కూతుళ్లకు వెళ్తుంది తప్ప ఆస్తిపై మగవారికి హక్కు ఉండదు. ఇలాంటి ఎన్నో వైవిధ్యాలపై యూసీసీ నీడలు పడ్డాయి. అయితే యూసీసీ వారికి మినహాయింపు ఇస్తుందని స్వయంగా కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ ప్రకటన చేశారు.
 
‘‘బీజేపీ ఆదివాసీల సంప్రదాయాలను గౌరవిస్తుంది. ఈ చట్టం వల్ల ఈశాన్య రాష్ట్రాల ఆదివాసీల హక్కులకు భంగం కలగదు. వారి మీద, వారి సంప్రదాయాలకు వ్యతిరేకమైన ఎటువంటి చట్టాలను రుద్దబోము. వారి మత, సామాజిక కట్టబాట్లను ఇబ్బంది పెట్టం. అదే సమయంలో బుజ్జగింపు రాజకీయాలూ సరికాదు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ ప్రకారం ఈశాన్య రాష్ట్రాల గిరిజన ప్రాంతాలకు కొన్ని హక్కులున్నాయి. కేంద్రం చేసే చట్టాలను ఆ రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదిస్తే తప్ప అమలు కావు. అలాగే ఇతర రాష్ట్రాల్లోని ఆదివాసీలను కూడా ఈ విషయంలో సంప్రదిస్తాం.’’ అన్నారు ఎస్పీ సింగ్. ఇక్కడ మళ్లీ వివాదం ఏంటి అంటే, ఆదివాసీల సంప్రదాయాలు హక్కుల పరిరక్షణ కోసం యూసీసీ నుంచి మినహాయింపు ఇస్తే, అదే రీతిలో తమకూ మినహాయింపు కావాలని దేశంలో వివిధ రకాల వైవిధ్యం ఉన్న కుల, మత గ్రూపులు కోరవు, అవసరమైతే సుప్రీంకు వెళ్లవు అన్న నమ్మకం లేదు. అలా మినహాయింపులు ఇస్తే, ఇక యూసీసీ ఉండీ ఉపయోగం లేదు.
 
యూసీసీ రాజ్యాంగంలోనే ఉందా?
రాజ్యాంగం రాసేటప్పుడు రాజ్యాంగ కమిటీలో యూసీసీపై విస్తృతంగా చర్చ జరిగింది. అప్పటి భారతదేశ పరిస్థితులను బట్టి ఇంత వైవిధ్యం ఉన్న దేశంలో ఒకేసారి ఒకే చట్టం అమలు సరికాదని భావించిన రాజ్యాంగ నిర్మాతలు ఈ విషయాన్ని ఆదేశిక సూత్రాల్లో పెట్టారు. సరిగ్గా ఈ ఆదేశిక సూత్రాలు అనే విషయాన్ని అర్థం చేసుకుంటే ఇప్పుడు జరుగుతోన్న చర్చకు చట్టబద్ధత గురించి తెలుస్తుంది. రాజ్యాంగం రాసేప్పుడు చాలా విషయాలు రాజ్యాంగంలో కచ్చితమైన నిబంధనగా పెట్టలేని పరిస్థితులు ఉండేవి. దాంతో కొన్ని నిబంధనలను ఆదేశిక సూత్రాలు (డైరెక్టివ్ ప్రిన్సిపిల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ) పేరుతో రాజ్యాంగంలో పెట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 36 నుంచి 51 వరకూ ఇవి ఉన్నాయి. వాటిలో పౌరులకు జీవన ఉపాధి కల్పించడం, పురుషులు, స్త్రీలకు సమాన ఆదాయం వచ్చేలా చూడడం, విద్య, వైద్యం, న్యాయం ఉచితంగా అందరికీ అందించడం వంటివెన్నో ఉన్నాయి.
 
వాటిలోని ఆర్టికల్ 44 ఈ ఉమ్మడి పౌర స్మృతి గురించి ఉంది. ‘‘ప్రభుత్వం పౌరులందరికీ దేశవ్యాప్తంగా ఒకే సివిల్ చట్టం ఉండేలా ప్రయత్నం చేయాలి.’’ అని అందులో ఉంది. రాజ్యాంగంలో ఇంగ్లీషులో ఎండీవర్ అనే పదాన్ని వాడారు. అంటే ఆ దిశగా, దాన్ని సాధించేలా తీవ్ర/మంచి ప్రయత్నం చేయాలి అని. రాజ్యాంగం రాసేనాటికి వీటిని నేరుగా అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి ఆదర్శ సూత్రంగా వీటిని పెట్టారు. వీటి అమలు తప్పనిసరి కాదు. వీటిని అమలు చేయాలని ఎవరకూ కోర్టుకు వెళ్లలేరు. దీంతో ఇప్పుడు ఆ ఉమ్మడి చట్టం తెచ్చే పని పెట్టుకుంది బీజేపీ ప్రభుత్వం.
 
ఇప్పుడే ఎందుకు?
సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో బీజేపీ సంప్రదాయ వైఖరిని వ్యతిరేకించే వర్గాలు బలంగా ఉంటాయి. కానీ, ఇక్కడ పరిస్థితి భిన్నం. ఎందుకు అంటే రైట్ వింగ్ ఆలోచనల్ని వ్యతిరేకించే లిబరల్ ఆలోచనావాదుల్లో కూడా యూసీసీపై భిన్నాభిప్రాయాలుంటాయి, కొందరు ఇన్ ప్రిన్సిపుల్ మద్దతు ఇస్తూనే ఇపుడున్న ప్రభుత్వం దాన్ని అమలు చేయడంపై వ్యతిరేకత వ్యక్తం చేయొచ్చు. ఇది హిందూత్వ భావజాల ఆధిపత్యాన్ని సమర్థించే పార్టీ ప్రభుత్వం కాబట్టి అది తేదల్చుకున్న మార్పులు కూడా ఇతర మతాల పట్ల వివక్ష చూపే అవకాశముందనే అనుమానాలను వ్యక్తం చేసేవారు లిబరల్స్లో కనిపిస్తున్నారు. నిజానికి స్వతంత్ర భారతదేశంలో యూసీసీ అమలు చేయాలని అంబేడ్కర్ వంటి వారు భావించారు. వారి వల్ల కాలేదు. స్వతంత్రానికి ముందు నుంచి దీనిపై చర్చ జరిగింది. 1933లో అఖిల భారత విమెన్స్ కాన్ఫరెన్స్ యూసీసీ కావాలని డిమాండ్ చేసింది. అప్పటికి హిందూ మహిళలకు విడాకుల హక్కు లేకపోవడం ఆ డిమాండ్ వెనుక ఉన్న కారణాల్లో ఒకటి.
 
నెహ్రూ హిందూ కోడ్ స్థానంలో మోడ్రన్ సివిల్ కోడ్ తేవాలనుకున్నప్పుడు కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా హిందూ సంఘాల నుంచి. తరువాత ఆ విషయంలో నెహ్రూ వెనక్కు తగ్గారు. తరువాత అంబేడ్కర్ హిందూ కోడ్ బిల్ రూపొందించారు. అంబేడ్కర్ కంటే ముందు బీఎన్ రావు కూడా హిందూ కోడ్ బిల్లులు డ్రాఫ్టు చేశారు. వాటిల్లోనే హిందువులకు బహు భార్యత్వం రద్దు చేయడం, విడాకులు చట్టబద్ధం చేయడం, కూతుళ్లకు వారసత్వ హక్కు ఇవ్వడం వంటివి ప్రతిపాదించారు. కాన్నీ అన్ని ప్రతిపాదనలూ ఆమోదం కాలేదు. దీంతో అంబేడ్కర్ తన మంత్రి పదవికి రాజీనామా కూడా చేశారు. అనేక సవరణలో 1956లో ఆధునిక హిందూ చట్టాలు వచ్చాయి.
 
అప్పటికి సమస్య సద్దుమణిగింది కానీ అప్పటి నుంచీ ఎవరో ఒకరు ఈ యూనిఫాం సివిల్ కోడ్ కోసం మాట్లాడుతూనే ఉన్నారు. మళ్లీ 1980లలో ఆ చట్టం చర్చ బయటకు వచ్చింది. ఈసారి చర్చకు కారణం ముస్లిం విడాకుల వ్యవస్థ. షాబానో అనే 73 ఏళ్ల మహిళకు త్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇచ్చిన భర్త, ఆమెకు భరణం ఇవ్వలేదు. చివరకు సుప్రీం కోర్టు ఆమెకు భరణం ఇవ్వాలని ఆదేశించింది. సీఆర్పీసీ అనే చట్టం ద్వారా ఆమెకు భరణం ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పింది. దీంతో ముస్లిం సంఘాలు రోడ్డెక్కాయి. దీంతో రాజీవ్ గాంధీ ప్రభుత్వం, ముస్లిం మహిళలకు భరణం ఇప్పించడానికి సీఆర్పీసీ చట్టం పనికిరాదంటూ మరో చట్టం చేసింది. ఆ సందర్భంలో అటు సుప్రీం కోర్టు, వివిధ సంఘాలూ విస్తృతంగా యూసీసీ కోసం మాట్లాడాయి. షాబానో విషయంలో రాజీవ్ గాంధీ తీసుకున్న చర్య ఇవ్వాల్టీకి చర్చల్లో కేంద్రకంగా ఉంటూ వస్తున్నది. ముస్లిం సంతృప్తీకకరణ ధోరణికి పరాకాష్ట అనే విమర్శలు రాజకీయ ప్రత్యర్థుల నుంచి కాంగ్రెస్ ఎదుర్కొంది. ఇప్పటికీ లిబరల్ చర్చల్లో కూడా ఆ ప్రస్తావన వస్తూనే ఉంటుంది.
 
ఆ తరువాత అనేక సందర్భాల్లో సుప్రీం కోర్టు యూసీసీ ఆవశ్యకతను చెప్పింది. అటు బీజేపీ కూడా తన మానిఫెస్టోలో యూసీసీ గురించి చెబుతూ వచ్చింది. అయితే నెహ్రూ, అంబేడ్కర్ ఇతర రాజ్యాంగ నిర్మాతలు యూసీసీని చూసిన విధానానికీ, బీజేపీ పార్టీ, మోదీ ప్రభుత్వం యూసీసీని చూసే విధానానికీ తేడా లేకపోలేదు. ‘‘యూసీసీ మంచిదే కానీ స్వచ్ఛందంగా ఉండాలి’’ అని అంబేడ్కర్ అన్నారు. ‘‘యూసీసీ ప్రాథమిక హక్కు కాదు’’ అని పటేల్ ప్రకటించారు. వారిద్దరూ ప్రకటించిన సందర్భాలు పద్ధతీ తీసుకున్న కోణాలు వేర్వేరు. రాజ్యాంగ సభలో కూడా 5-4 ఓట్ల తేడాతో యూసీసీ ప్రాథమిక హక్కు హోదాను కోల్పోయింది. యూసీసీ ఉంటే మత స్వాతంత్ర్యపు హక్కుకు వ్యతిరేకం అవుతుందని అప్పట్లో కొందరు భావించారు. వారే రాజ్యాంగసభలో పట్టు సాధించారు.
 
2018లో యూసీసీ అక్కర్లేదని లా కమిషన్ చెబితే, యూసీసీ తేవడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని 2019లో సుప్రీం కోర్టు అంది.. ఇలా యూసీసీ నిపుణుల మధ్య నలుగుతూనే ఉంది. ‘‘పర్సనల్ చట్టాలు రాష్ట్రాలను బట్టి మారవచ్చు. రాజ్యాంగ నిర్మాతలు దేశమంతా ఒకే చట్టం ఉండాలని కోరుకోలేదు. ఉదాహరణకు సీఆర్పీసీ, ఐపీసీలకు చాలా రాష్ట్రాలు వందలసార్లు మార్పులు చేశాయి. ఒక దేశం, ఒకే చట్టం అనే నినాదానికి ఇలాంటి ఎన్నో లోపాలు ఉన్నాయి. అన్నిటికంటే కీలకమైన భూమి చట్టాలు కూడా రాష్ట్రానికీ రాష్ట్రానికీ వేర్వేరు’’ అని అన్నారు నల్సార్ వీసీగా పనిచేసిన న్యాయ నిపుణులు ఫైజల్ ముస్తఫా.
 
‘‘హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం దగ్గర బంధువుల మధ్య పెళ్లి చెల్లదు. కానీ దక్షిణ భారతంలో మేనరికాలు చెల్లుతాయి. హిందూ కోడ్ బిల్ ప్రకారం హిందూ మతంలోని వేర్వేరు సంప్రదాయాల కింద జరిగిన పెళ్లిళ్లు చెల్లుబాటు అవుతాయి. ఇప్పటికీ హిందూ వారసత్వ ఆస్తిలో కూతురుకు వాటా ఉంది కానీ భార్యకు వాటా లేదు. అలాగే భార్యాభర్తలకు పిల్లలు లేకపోతే, భర్త ఆస్తితో పాటూ భార్య ఆస్తి కూడా భర్త తల్లితండ్రులకే వెళ్తుంది. హిందువులే కాదు. ఆ విషయంలో ముస్లిం, క్రైస్తవుల చట్టాల్లో కూడా అనేక తేడాలున్నాయి. అలాగే నాగాలాండ్, మేఘాలయ, మిజోరం రాష్ట్రాల్లో ఈ చట్టాలు పూర్తిగా వేరు. ఇప్పుడు యూసీసీకి ప్రాతిపదికగా ముస్లిం, క్రైస్తవ, హిందూ చట్టాల్లోని ఏ అంశాలను తీసుకుంటారు అనేది ప్రశ్న’’ అన్నారు ఫైజల్ ముస్తఫా.
 
గోవాలో పరిస్థితి ఏంటి?
ప్రస్తుతం గోవాలో యూసీసీ లాంటి వ్యవస్థ ఉంది. అది పూర్తిగా యూసీసీ కాదు. అయినప్పటికీ సుప్రీం కోర్టు అనేక సందర్భాల్లో గోవా ఉదాహరణ చూపిస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో గోవా నాయకులు కూడా ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు. ప్రస్తుతం పైన చెప్పిన హిందూ, ముస్లిం, క్రైస్తవ చట్టాలేవీ గోవా రాష్ట్రంలో పనిచేయవు. ఎందుకంటే అక్కడ పోర్చుగీసు వారు పెట్టిన సివిల్ కోడ్ అమల్లో ఉంది. 1867లో పోర్చుగీసు వారు గోవాలో ఒక సివిల్ కోడ్ అమలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అదే చట్టం అమల్లో ఉంది. గోవా భారతదేశంలో చాలా ఆలస్యంగా విలీనం అయిన సంగతి తెలిసిందే. దీంతో అంతకు ముందు నుంచీ గోవాలో ఉన్న ఈ చట్టాన్నే వారు కొనసాగిస్తున్నారు. అయితే అది అన్ని మతాలకూ కలిపి చేసిన చట్టమే అయినా, అందులో కూడా కొన్ని మతపరమైన మినహాయింపులు ఉన్నాయి.
 
ఉదాహరణకు గోవాలో హిందూ పురుషులు భార్య ఉండగానే రెండవ పెళ్లి చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని షరతులు ఉన్నాయి. మొదటి భార్యకు మగ పిల్లలు పుట్టకపోయినా, మొదటి భార్యకు 30 ఏళ్లు దాటి పోయినా, మొదటి ప్రసవం అయి పదేళ్లు దాటినా అప్పుడు హిందూ మగవారు కూడా రెండో పెళ్లి చేసుకునే విధంగా గోవాలో ఇప్పుడు చట్టం ఉంది. హిందువులకే కాకుండా కేథలిక్కులకు కూడా గోవా చట్టంలో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. గోవాలో కేథలిక్కులు తమ పెళ్లిళ్లు రిజిస్టర్ చేయనక్కర్లేదు. కేథలిక్ చర్చి ఫాదర్లే పెళ్లి రద్దు కూడా చేయవచ్చు. తరచూ సుప్రీం కోర్టు గోవా ఉదాహరణ చూపుతోంది. మరి గోవాలో వివిధ మతాలకు మినహాయింపులు ఇచ్చినట్టు కొత్త యూసీసీలో కూడా మినహాయింపు ఇస్తారా అన్నది ప్రశ్న.
 
ఏం జరగాల్సి ఉంది?
యూసీసీ మీద మీ అభిప్రాయం చెప్పండని లా కమిషన్ అడిగితే ఏకంగా ఎనిమిదిన్నర లక్షల మంది తమ అభిప్రాయాలు పంపారు. ఈ దేశంలో ఒకే మతంలో కూడా ఒకే ఆచారం లేదు. హిందువులు సరే, ముస్లిం క్రైస్తవుల్లో కూడా ఈ భిన్న ఆచారాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మాతృస్వామ్య వ్యవస్థ ఉంది. ఒడిశా ఆదివాసీ తెగల్లో రెండవ పెళ్లి చేసుకునే మగ వారు ఎందరో కనిపిస్తారు. ఇప్పటి వరకూ ఇలాంటి కేసుల్లో వారి సంప్రదాయాలకు ప్రాధాన్యత ఉండేది. మరి యూసీసీ వస్తే అవన్నీ పక్కకు పోతాయా లేదా మళ్లీ మతాల వారీ మినహాయింపులు ఇస్తారా అన్నది ప్రశ్న. ఎందుకంటే కేవలం రెండవ పెళ్లి చేసుకోవడం కోసం లేదా చేసుకున్న రెండో పెళ్లిని సమర్ధించుకోవడం కోసం హిందూ మతం నుంచి ఇస్లాం వైపు వెళ్లిన కేసులు కూడా చూసింది సుప్రీం కోర్టు.
 
ఉమ్మడి సివిల్ కోడ్ అనేది విస్తృతమైన అంశం. ఏయే చట్టాల్లో ఎంతమేర మార్పులు తెస్తారు, ఏదో ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అందరికీ సమానత్వం అనే విలువకు ఎంత ప్రాధాన్యమిస్తారు, మహిళ హక్కుల సంగతేమిటనే ప్రశ్నలకు ఈ ప్రక్రియలో తగిన సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్నికల వేళ రాజకీయాలకు అవసరమైన పరికరంగా దీనిని బయటకు తీసుకొచ్చారా లేక ఆధునిక చట్టం తేవాలనే చిత్తశుద్ధితోనే ఈ ప్రయత్నం జరుగుతోందా అన్నది అసలు సిసలు ప్రశ్న. ఇప్పుడు ఉన్న పర్సనల్ చట్టాలను పూర్తిగా రద్దు చేయడం కాకుండా, ఆయా చట్టల్లో ఉన్న వివక్ష తొలగించే విధంగా సవరణలు చేపడితే సరిపోతుందని వాదించే వారూ ఉన్నారు. ఇటీవలే భారత ప్రభుత్వం తెచ్చిన త్రిపుల్ తలాక్ రద్దు చట్టం తరహాలో, అన్ని మతాల పర్సనల్ లా లో ఉన్న వివక్షను రూపుమాపితే యూసీసీ అవసరం ఉండబోదని వారి వాదన.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజుకో ఘోరం.. ప్రతి చోటా ప్రభుత్వ టెర్రరిజం.. వైకాపాపై బాబు ఫైర్