Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంజినీరింగ్ విద్యార్థులకు అద్భుత అవకాశం, కోటి మందికి ఉచితంగా ఇంటర్న్‌షిప్

Advertiesment
students
, మంగళవారం, 27 జూన్ 2023 (18:12 IST)
ఇంజినీరింగ్ విద్యార్థులు మంచి కంపెనీల్లో ఉచితంగా ఇంట‌ర్న్‌షిప్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని అఖిల భార‌త సాంకేతిక విద్యా మండ‌లి (ఏఐసీటీఈ) దీనికోసం ప్రత్యేకంగా ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇంజినీరింగ్ విద్యార్థులు, పట్టభద్రులకు క‌ల్పిస్తున్న ఈ ఉచిత ఇంట‌ర్న్‌షిప్ ప‌థ‌కం ఏమిటీ? దానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం ఎలా? విధి విధానాలు ఏమిటీ? ఉప‌కార వేత‌నం ఇస్తారా? త‌దిత‌ర వివ‌రాలు గురించి ఇక్కడ తెలుసుకోండి.
 
ఏమిటీ ఇంటర్న్ షిప్?
దేశంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు మంచి కొలువులు సంపాదించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పలు సంస్థల్లో ఇంటర్న్ షిప్ చేయడం కొరకు ప్రవేశపెట్టిన పథకం ఇది. 2025వ సంవత్సరానికల్లా దేశంలోని కోటి మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ ఇంటర్న్‌షిప్ కల్పించాలనేది కేంద్ర ప్రభుత్వం ఆశయం. ప్రస్తుతం, 179 ప్రముఖ సంస్థల నుంచి 38,950 పైచిలుకు ఇంటర్న్‌షిప్‌లు వివిధ రంగాల్లో విద్యార్థుల కొరకు అందుబాటులో ఉన్నాయి.
 
ఎవరు అర్హులు?
ఇంజినీరింగ్ కళాశాలల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ చదివిన విద్యార్థులతో పాటు పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరూ కూడా అర్హులే. ఏ బ్రాంచ్‌కు సంబంధించిన వారైనా సరే ఈ ఇంటర్న్ షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
 
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
దరఖాస్తు ప్రక్రియ మొదలు, ఎంపిక ప్రక్రియ వరకు పూర్తిగా ఆన్‌లైన్ లోనే ఉంటుంది. ఇందుకోసం ఏఐసీటీఈ ప్రత్యేకించి ఒక పోర్టల్‌ను నిర్వహిస్తోంది.
 
ఏఐసీటీఈ ఇంటర్న్‌షిప్ వెబ్ పోర్టల్ చిరునామా ఏదీ?
internship.aicte-india.org/ ఈ వెబ్ సైటులో ఇంజినీరింగ్ విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా ఇంటర్న్ షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
 
దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు చెల్లించాలా?
ఇది పూర్తిగా ఉచితం. దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్న్ షిప్ పొందడానికి నయాపైసా చెల్లించక్కర్లేదు. ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలి.
 
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా చేయాలి?
మీరు విద్యార్థి అయితే ఈ వెబ్‌సైటులో విద్యార్థిగా నమోదు చేసుకోవాలి. అందులో అడిగిన వివరాలు ఇచ్చి మీకు ప్రత్యేకించి ఒక లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. తరువాత మీ మెయిల్‌కు లేదా మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ఈ వెబ్‌సైట్ నుంచి మెసేజ్ వస్తుంది. ఏదైనా వివరాలు లేదా పత్రాలు సమర్పించాలంటే అడుగుతారు.
 
విద్యార్థికి అనుకూలమైన రంగంలో ఇంటర్న్ షిప్ వివరాలు తెలుసుకోవడం ఎలా?
ఈ వెబ్‌సైటులోనే ఏఏ రంగాల్లో ప్రస్తుతం ఇంటర్న్‌షిప్ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు, ఎక్కడెక్కడ అవకాశాలున్నాయి తదితర వివరాలన్నీ ఉంటాయి. వాటి ఆధారంగా విద్యార్థులకు తమకు సరిపోయే రంగాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న ఇంటర్న్ షిప్ కార్యక్రమాలు వివరాలు కూడా ఇందులో ఉంటాయి.
 
ఇంటర్న్‌షిప్‌లో గౌరవ వేతనం లేదా ఉపకార వేతనం ఏమైనా ఇస్తారా?
ఏఐసీటీఈ ప్రత్యేకించి ఇంటర్న్‌కు ఎలాంటి ఉపకార వేతనం ఇవ్వదు. కానీ మిమ్మల్ని ఇంటర్న్‌షిప్ కొరకు ఎంపిక చేసుకునే కంపెనీలు, సంస్థలు మీకు ఇంటర్న్‌షిప్ కాలంలో ప్రతి నెలా ఇంతని ఆయా సంస్థలను బట్టి కొంత ఉపకారవేతనం, గౌరవ వేతనం ఇస్తాయి. ఇది కనీసం రూ.18,000లకు తక్కువ కాకుండా గరిష్టంగా రూ.25,000ల వరకు ఉండొచ్చు. కొన్ని కంపెనీలు ఏమీ ఇవ్వకుండానే కేవలం ఇంటర్న్ షిప్ చేయడానికి మాత్రమే అవకాశం కల్పిస్తాయి.
 
ఇంటర్న్ షిప్ కాల పరిమితి ఎంత ఉంటుంది?
అది ఆయా కంపెనీలు మీకు ఆఫర్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అయితే, మీ ఇంజినీరింగ్ కోర్సు చివరి సంవత్సరం పరీక్షల ఫలితాలు రావడానికి ఇంటర్న్‌షిప్ ప్రకటించే తేదీకి మధ్య గరిష్టంగా 18 నెలల మించి ఉండకూడదు. బీ.టెక్ విద్యార్థి పూర్తి స్థాయి ఇంటర్న్‌షిప్ అంటే 600-700 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. అంటే వారానికి ఇంటర్న్‌షిప్, ట్రైనింగ్, ప్రాజెక్టు వర్క్, సెమినార్ తదితరాలకు 40-45 గంటలు పనిచేయాల్సి ఉంటుంది.
 
మా కళాశాల ద్వారా నేను ఇంటర్న్ షిప్‌కు వెళ్లడం ఎలా?
ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ప్రతీ కళాశాల, విశ్వవిద్యాలయాల్లోనూ తప్పనిసరిగా ట్రైనింగ్ అండ్ ప్లేస్ మెంట్ సెల్ ఏర్పాటు చేసి ఉండాలి. దీనికి ట్రైనింగ్ అండ్ ప్లేస్ మెంట్ ఆఫీసర్ (Training and Placement Officer – TPO) అధిపతిగా ఉండి కార్యకలాపాలు పర్యవేక్షిస్తుంటారు. ఆయన కళాశాలలో విద్యార్థులకు దీని గురించి తగు సలహాలు సూచనలు ఇస్తారు.
 
విద్యార్థులకు కళాశాలలు ఇంటర్న్‌షిప్ కల్పిస్తాయా?
ట్రైనింగ్ అండ్ ప్లేస్ మెంట్ సెల్ ద్వారా ప్రతీ కళాశాల కూడా తమ విద్యార్థులకు AICTE నియమావళి ప్రకారం రెండో, నాలుగో, ఆరు లేదా ఏడో సెమిస్టర్లలో ఈ ఇంటర్న్ షిప్ అవకాశం కల్పించాలి. కళాశాలలు ప్లేస్‌మెంట్ సెల్ ద్వారా పరిశ్రమలకు కావాల్సిన విద్యార్థులను ఇంటర్న్ షిప్ కు పంపడానికి అంగీకరిస్తూ లేఖ రాయాలి. విద్యార్థులు కూడా కళాశాల నుంచి ఒక లేఖను లేదా ఈ మెయిల్ అనుమతి పత్రాలను ఆ కంపెనీ ఇంటర్న్ షిప్ కొరకు చేసే దరఖాస్తుతో పంపాలి. కళాశాల నుంచి బయటకు వచ్చేసిన వాళ్లు నేరుగా వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
 
మొబైల్ అప్లికేషన్ ఉందా?
ఏఐసీటీఈ ఇంటర్న్ షిప్ కొరకు ఆ సంస్థ మొబైల్ అప్లికేషన్ కూడా కల్పిస్తోంది..
 
వివరాలకు ఎవర్ని సంప్రదించాలి?
ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ( ఏఐసీటీఈ)
నెల్సన్ మండేలా మార్గ్
వసంత్ కుంజ్
న్యూదిల్లీ
ఫోన్: 011-29581423
Mail: [email protected]
 
విద్యార్థుల‌కు ఒక మంచి అవ‌కాశం
అఖిల భార‌త సాంకేతిక విద్యా మండ‌లి నిర్వ‌హిస్తున్న ఇంట‌ర్న్‌షిప్ కార్యక్రమం ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు ఎంతో ప్ర‌యోజ‌న‌కరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సలహాదారు డాక్టర్ బుద్దా చంద్రశేఖర్ అన్నారు. ‘‘కోటి మంది ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు ఈ ఇంట‌ర్న్‌షిప్ క‌ల్పించాల‌నేది కేంద్ర ప్ర‌భుత్వ సంక‌ల్పం. ఇప్ప‌టివ‌ర‌కు 30 ల‌క్ష‌ల మంది విద్యార్థులు ఇంట‌ర్న్‌షిప్ చేశారు. వారిలో ఎంతోమంది పెద్ద బ‌హుళ‌జాతి సంస్థ‌లతో పాటు మ‌న దేశీయ సంస్థ‌ల్లో మంచి ఉద్యోగాలు సాధించారు.
 
క‌ళాశాల‌లో చ‌దువుతున్న‌ప్పుడే వారు ఏదో ఒక కంపెనీలో ఏఐసీటీఈ త‌ర‌ఫున ఇంట‌ర్న్‌షిప్ చేయ‌డం వ‌ల్ల వారు ఎంచుకున్న రంగానికి సంబంధించి ముందుగానే వృత్తి నైపుణ్యాలు, ఆ రంగంలో కొంత వృత్తి అనుభం సాధించి ప‌రిశ్ర‌మ‌కు అందుబాటులోకి వస్తున్నారు. ఇలాంటి మాన‌వ వ‌న‌రుల కోస‌మే కంపెనీలు ఎదురు చూస్తుంటాయి. ప్లేస్‌మెంట్ల సమయంలో ఈ ఇంట‌ర్న్‌షిప్ చేసిన వారికి కంపెనీలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి’’ అని ఆయన చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెలుగు లోకి రాని హీరోలకు మద్దతు: ఎన్ఐ-ఎంఎస్ఎంఇతో భాగస్వామ్యం చేసుకున్న రికార్డెంట్